Take a fresh look at your lifestyle.

శోభకృత్‌ ‌నామ సంవత్సరానికి స్వాగతం

శోభ అనగా మనోహరమైన అని అర్థం. కనీసం ఈ శోభకృత్‌ ‌నామ సంవత్సరమైనా ప్రజలు మనోహరంగా గడుపాలని ఆశిద్ధాం. ఎందుకంటే గత శుభకృత్‌ ‌నామసంత్సరంలో కూడా అంతా శుభప్రదంగానే గడిచిపోతుందనుకున్నాం. కాని, రాష్ట్ర ప్రజలను కుదిపివేసే అనేక సంఘటనలతో గత ఎడాదంతా గడిచిపోయింది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్న సంతోషాన్ని శుభకృత్‌ ‌నామ సంవత్సరం ఏమాత్రం మిగల్చలేదు. అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళింది. కేవలం జ్ఞాపకాలే కాదు…అపార నష్టాన్ని మూటగట్టి ఇచ్చింది. వేలాది రైతాంగ కుటుంబాలను దుఃఖ  సాగరంలో ముంచేసింది. వారం రోజుల క్రితం నాలుగు రోజులపాటు అనుకోని రీతిలో పడిన వడగండ్ల వాన రైతాంగాన్ని పుట్టిముంచింది. వేలాది ఎకరాల పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈ అకాల పంట నష్టం ఎంతలేదన్నా పదమూడు వందల కోట్ల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల పంటలు చేతికి వొచ్చే దశలో వరుణుడి పాలైదంటే పరోక్షంగా కోట్లాది రూపాయల విలువైన జాతీయ ఉత్పత్తిని కోల్పోవడమే. పంటలన్నీ సక్రమంగా పండితేనే ధరలు మిన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక పంట సీజన్‌ ‌దెబ్బతినడంవల్ల మరింతగా ధరలు పెరగే అవకావాలు లేకపోలేదు.

శుభకృత్‌ ‌నామ సంవత్సరం పోతూ పోతూ రాష్ట్రానికి మరో అశుభాన్ని అంటగట్టి పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగించిన టిఎస్‌పిఎస్సీ పేపర్‌ ‌లీకేజీ వ్యవహారం గత వారం రోజులుగా కేవలం విద్యార్థి, నిరుద్యోగులనే కాకుండా రాష్ట్ర రాజకీయాను అతలాకుతలం చేస్తున్నది. ఎంతో పకడ్బందీగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు కొందరి చేతికి వెళ్ళడం, రహస్యం బయటపడే వరకే కొన్ని పరీక్షలు జరిగిపోవడమన్నది పెద్ద సంచలనానికి దారి తీసింది. దీనిపై విచారణ జరుగుతున్నప్పటికీ ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తీరని వేదనను మిగిల్చింది. ఆహోరాత్రులు కష్టపడి చదివిన దానికి ఫలితం లేకుండాపోయింది. మళ్ళీ శ్రమపడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ప్రశ్నాపత్రాల లీకులు సర్వసాధారణం అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడడం బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తుంది.

రాష్ట్రాన్నే కాకుండా యావత్‌ ‌దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన మరో అంశం దిల్లీ లిక్కర్‌ ‌కేసు. ఇందులో అనేక మంది పెద్దల ప్రమేయం ఉన్నట్లుగా దర్యాప్తుల్లో తేలుతుండడం, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోవడం, చివరకు ఈడీ•తో పాటు, సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ వరకు కొనసాగుతున్న ఈ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత పేరు ఉండడం మరో సంచనానికి కారణంగా మారింది. తాజాగా ఉగాదికి ఒక రోజు ముందుకూడా ఆమెను ఈడీ• అధికారులు అనేక గంటలపాటు విచారించడమన్నది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మధ్య తీవ్ర అఘాదం ఏర్పడింది కూడా శుభ కృత్‌నామ సంవత్సరంలోనే. వాస్తవానికి శుభకృత్‌ ‌నామ సంవత్సరానికి ముందునుండే వీరిద్దరికి పొసగడం లేదు. అంతవరకు గుట్టుగా ఉన్న భేదాభిప్రాయాలు శుభకృత్‌ ‌నామ యుగ ఆది నుండి బహిరంగమైంది. గడచిన ఉగాది కార్యక్రమానికి ఆహ్వానం పంపినా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వెళ్ళకపోయినప్పటి నుండీ వీరిద్దరి మధ్య  ఏదో కోల్డ్ ‌వార్‌ ‌జరుగుతున్నదన్నది బహిర్ఘతమైంది. ఆ తర్వాత అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ ‌పాటించడంలేదంటూ గవర్నర్‌ ‌తమిళిసై• బహిరంగంగానే విమర్శిస్తూ రావడం, ఆమేరకు ట్విట్టర్‌లలో పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరింత దూరం పెరుగుతూ వొచ్చింది.

తాజాగా అది సుప్రీమ్‌ ‌కోర్టు వరకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన అనేక పథకాలు గవర్నర్‌ ‌దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, కావాలనే వాటిపైన సంతకాలు చేయకుండా తాత్సారం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన తనకున్న అనుమానాలను తీర్చాలని, అందుకే వాటిని పాస్‌ ‌చేయలేదని గవర్నర్‌ ‌చెబుతున్నారు. గవర్నర్‌ ‌పదవి రాజ్యాంగ బద్ధమైనది కాబట్టి ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేమని చెప్పిన సుప్రీమ్‌ ‌కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 27కు అంటే శోభకృత్‌ ‌నామ సంవత్సరానికి వాయిదా వేసిందన్నమాట.  శుభకృత్‌ ‌నామ సంవత్సరారంభంలో లాగానే ఈ సారికూడా గవర్నర్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించినా కెసిఆర్‌ ‌హాజరు కాకపోవడం చూస్తుంటే శోభకృత్‌ ‌నామ సంవత్సరారంభం కూడా వివాదాలతోనే  ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఈ కొత్త సంవత్సరం ఆఖరులో  రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరుగనుండడంతో భవిష్యత్‌ ‌రాష్ట్ర రాజకీయల్లో ఎలాంటి ‘శోభ’ను కలిగిస్తాయన్న ఆసక్తి ప్రజల్లో ఉంది.

Leave a Reply