శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శైవ‌క్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు
వేముల‌వాడ‌, కాళేశ్వ‌రం, రామ‌ప్ప త‌దిత‌ర ఆల‌యాల్లో పోటెత్తిన భ‌క్తులు
శివుడికి  ప్ర‌త్యేక అభిషేకాలు,
ఆల‌యాల్లో భ‌జ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తిపార‌వ‌శ్యం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 8 :
రాష్ట్ర వాప్తంగా మహాశివరాత్రి  వేడుకలు ఘనంగా జ‌రిగాయి.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగిపోతోంది. శుక్ర‌వారం తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ఆ మ‌హ‌దేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.  తెలంగాణలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం  వేములవాడ రాజన్న ఆలయం భక్తుల‌తో కిక్కిరిసిపోయింది. అలాగే హ‌న్మ‌కొండ‌లోని వేయిస్తంభాల గుడి, కొత్త‌కొండ వీర‌భ‌ద్ర‌స్వామి,  ఐన‌వోలు మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం, సిద్ధిపేట జిల్లా  కొమురవెల్లి. మల్లన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, పంచరామ క్షేత్రం, కోటప్పకొండ ఆలయాలు భక్త జనసంద్రంగా మారాయి.
మ‌రోవైపు కాజీపేట మడికొండలోని మెట్టుగుట్ట, వరంగల్లోని భద్రకాళి ఆలయం, కాశీబుగ్గలోని కాశీ విశ్వేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ములుగు జిల్లా  వెంకటాపూర్ మండలం రామప్పలోని రామలింగేశ్వర క్షేత్రం, మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రుడి సన్నిధి, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని త్రివేణి సంగమ తీరం, కాళేశ్వర ముక్తీశ్వర సన్నిధానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page