- సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మండపం
- భక్తులు తిలకించే విధంగా మిధిలా స్టేడియం
- ఏప్రిల్ 2 నుండి 16 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు
- 10న స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం
భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి సమయం దగ్గర పడటంతో కల్యాణం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మిధిలా స్టేడియాన్ని భక్తులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సీతారాములను కుర్చుండబెట్టి కల్యాణం నిర్వహించే కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కల్యాణ మండపాన్ని వెదురు చాపలతో అలంకరించారు. అలాగే మండపం పరిసర ప్రాంతాలంతా భక్తులకు కనువిందు చేసే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 2వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి కల్యాణం కోసం ఇప్పటికే 20 క్వింటాల తలంబ్రాలను సిద్ధం చేసారు.
కల్యాణం సమయానికి సర్వం సిద్ధం చేయటానికి అధికారులు సమయాత్తం అయ్యారు. 10వ తేదీన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నారు. 11వ తేదీ మహాపట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా ఇప్పటికే మూడుసార్లు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేసారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు స్వామివారి కల్యాణాన్ని అంతరంగికంగానే నిర్వహించారు. ఈ ఏడాది కోవిడ్ ప్రభావం లేకపోవడం వలన స్వామివారి కల్యాణాన్ని కల్యాణ మండపంలో భక్తుల సమక్షంలో నిర్వహించడానికి దేవదాయ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
ఈ సారి జరిగే స్వామివారి కల్యాణానికి వివిధ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు వొచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా స్వామివారి కల్యాణాన్ని తిలకించి తలంబ్రాలు తీసుకెళ్ళేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు భద్రాచలం పట్టణంలో ఉన్న స్వఛ్చంద సంస్థలను కూడ రంగంలోకి దించారు. భక్తులకు వారు చేసే సేవలను ముందుగా తెలియపరచాలని శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆదేశాలు జారీ చేసారు. ఈసారి ఎక్కువగా భక్తులు వొస్తుంనందున స్వచ్ఛంద సంస్థల సహకారం ఎక్కువగా ఉండాలని కలెక్టర్ కోరారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడ రంగులతో తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి కల్యాణాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.