పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున నగర్, ఇక్రిశాట్ కాలనీ లలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు ఆయా కాలనీలలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.