దేశంలోఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల అవసరం పెరిగింది. గతంలోకన్నా ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య కూడా పెరిగింది. పేరుకు ప్రజాసేవకోసమనే చెబుతున్నప్పటికీ ప్రతీ రాజకీయ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే పార్టీల సంఖ్య పెరిగినట్లుగా ఆ పార్టీల లక్ష్యాన్ని చేరవేసే వ్యూహకర్తల లోటుమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అందుకే వ్యూహరచనకోసం ఇతరులపైన అధారాపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇంచుమించుగా అన్నిపార్టీల్లో నెలకొంది. ఈ సందర్భంలో మనకు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న వ్యూహకర్త) పేర్లలో ప్రశాంత్ కిశోర్ పేరు ఒకటి. దేశంలోని ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఆయన సేవలను పొందడంద్వారా విజయం సాధించిన సంఘటనలతో ఇప్పుడాయన పేరు మారుమోగుతోంది. ఎదుటి పార్టీని చిత్తుచేసే పథక రచనలో దిట్టగా పేరున్న ప్రశాంత్ కిశోర్ సేవలను ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కూడా వినియోగించుకుంటోంది.
ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, మూడవసారికూడా ఆ పదవిని దక్కించుకునేందుకు ఉత్సాహపడుతున్న తెలంగాణ సిఎం కెసిఆర్ ఇటీవల స్యయంగా ఈ విషయంపైన వివరణకూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ తనకు చిరకాలంగా మంచి మిత్రుడని, ఆయన సలహాలు తీసుకోవడంలో తప్పేముందని తాజా మీడియా సమావేశంలోనే పేర్కొన్న విషయం తెలియందికాదు. వాస్తవంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త కొత్త సమీకరణలు తెరమీదకు వొస్తున్నాయి . కొత్తపార్టీలు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. భారతీయ జనతాపార్టీ రానున్న ఎన్నికల్లో గోలకొండపైన ఎగిరేది కాషాయ జండానే అన్న విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నది. కోలుకోని దెబ్బలు తిన్న కాంగ్రెస్‌కూడా ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయని, రాబోయే కాలంలో కాబోయే సిఎం తమ పార్టీనుండే అన్న విషయంలో ఏమాత్రం సంశయం లేదని చెబుతోంది. మరో పక్క వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తాను తెలంగాణ కోడలినని చెప్పుకుంటూ తిరుగుతున్నది. ఈ పార్టీలన్నీ అధికార తెరాస తప్పిదాలను ఏకరువు పెట్టడంతోపాటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ పార్టీలకు తోడు కొత్తగా ఆమ్ ఆద్మీపార్టీ రంగప్రవేశం చేయబోతున్నది. ఇప్పటికే ఇక్కడ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నతర్వాత ఆ పార్టీ అధినేత అరవింద కేజ్రీవాల్ ఇప్పుడు తెలంగాణపైన దృష్టిపెట్టాడు. తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందన్న ఉద్దేశ్యంగా ఇక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దంచేసుకుంటున్నాడు. ఏప్రిలో ఇక్కడ పర్యటించేందుకు సన్నాహాలుకూడా జరుగుతున్నాయి. ఇన్ని పార్టీలతో పోరాడాల్సిన పరిస్థితి తెరాసకు ఇప్పుడు ఏర్పడింది. సహజంగానే రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తిగా కెసిఆర్‌కు పేరుంది. ఎదుటి పార్టీలు చేసే వ్యూహానికి ప్రతివ్యూహం చేసేదిట్ట. ఏ విషయంపైన అయిన అనర్గళంగా గంటలకొద్ది మాట్లాడగలిగే వాక్పటిమ కలిగిన వ్యక్తి. మాటల మాంత్రికుడిగా ఆయనకు ఉద్యమకాలంనుండి పేరుంది. అలాంటి వ్యక్తికి కూడా ఇప్పుడు ఓ రాజకీయ వ్యూహకర్త అవసరం వొచ్చిపడింది. రానున్న 2023 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కేవలం తన ఒక్కడి వ్యూహమే సరిపోదని ప్రశాంత్‌కిశోర్‌ను రప్పించుకున్న కెసిఆర్ ఆయనకు అప్పుడే బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కెసిఆర్‌పైన ఉన్న వ్యతిరేకతకు కారణాలను ఆయన అధ్యయనంచేసి నివేదికను కూడా అందజేసినట్లు వార్తలు వొస్తున్నాయి.
కెసిఆర్ తాజాగా ప్రకటించిన తొంభైవేల ఉద్యోగాల ప్రకటన వెనుకకూడా ప్రశాంత్ కిశోర్ నివేదికే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. దీంతోపాటుగా అధికార పార్టీ ఎంఎల్‌ఏలపై ప్రజలకున్న అభిప్రాయాలు, మంత్రుల పనితీరు తదితర విషయాలపైన ఇప్పటికే ఆయన అధ్యయనం పూర్తిచేసినట్లు తెలస్తున్నది. హైదరాబాద్‌లో ప్రశాంత్‌కిశోర్ తన కార్యాలయాన్ని నెలకొల్పడంతోపాటు రానున్న ఎన్నికల వ్యూహానికి కావాల్సిన సమాచారం కోసం సిబ్బందినికూడా ఏర్పరుచుకుంటున్నారు . కెసిఆర్ పాలనపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అధికార పార్టీని అలర్ట్‌చేసేపనిలో ఆయన నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు చురుకు పుట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సమస్య వొచ్చినా సులభంగా పరిష్కారం చూపించగలిగే ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ లాంటి నాయకుల కరువు ఏర్పడింది. గులాబ్ నబీ ఆజాద్, చిదంబరం లాంటి సీనియర్ నాయకులున్నప్పటికీ ఇప్పుడు పార్టీలో వారి ప్రమేయం తగ్గింది. దాంతో కాంగ్రెస్‌కూడా వ్యూహకర్తల వేటలో పడింది. ప్రశాంత్ కిశోర్ సహచరుడు సునీల్ కనుగోలును తమ రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకుంది.
ఆ పార్టీ రాష్ట్ర నాయకుల బృందం ఈ నెల నాలుగున ది•ల్లీకి వెళ్ళినప్పుడు రాహుల్‌గాంధీ యే స్వయంగా ఆయన్ను వీరికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా 2012లో గుజరాత్‌లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కావడానికి, ఆతర్వాత 2014లో బారత ప్రధాని కావడానికి ప్రశాంత్‌కిశోర్ వ్యూహాలే కారణమన్నది జగమెరిగిన సత్యం. 2017 ఏపిలో వైఎస్‌ఆర్‌పార్టీ, 2020లో ది•ల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, 2021లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి రాజకీయ సలహాదారుగా ఉంటూ వారిని అధికారంలోకి వొచ్చే వ్యూహరచన చేసిన ప్రశాంత్‌కిశోర్ ఇప్పుడు టిఆర్‌ఎస్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ఒక పార్టీ పక్షాన పనిచేస్తున్నారంటేనే ప్రతిపక్షపార్టీ ఆశలు వొదులుకోవడమన్నది ఇప్పటివరకు జరుగుతున్నది. తెలంగాణలో కెసిఆర్ ఎత్తుగడలకు ప్రశాంత్‌కిశోర్ వ్యూహాలు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2013 అసెంబ్లీ ఎన్నికలే చెబుతాయి.