ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వేతన జీవులకు మాత్రం పెద్దగా ఊరట లభించలేదు. 7లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ప్రకటన మాత్రమే
కొంత ఉపశమనంగా కనబడుతున్నప్పటికీ గత సంవత్సరం ప్రకటించిన కొత్త స్లాబ్లనే కొనసాగించడం కొంత నిరాశ కలిగించినది.
బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత దానిపై వ్యాఖ్యానించే ముందు అది ఏ రకమైన బడ్జెట్ అనేది ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాలన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ప్రవేశపెట్టబడిన బడ్జెటే వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. 6 నెలలకు గాను సాధారణ పాలన వ్యయాలని ఉద్దేశించి మాత్రమే ఈ తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సహజంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ లో అన్నీ ఎన్నికల తాయిలాలు,ప్రత్యేక రాయితీలు,ప్రజాకర్షక పథకాలు ప్రతిబింబించే విధంగా ఉంటాయి. కానీ నిన్న ప్రవేశపెట్టబడిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.
వాస్తవికతకు దగ్గరగా ఉన్నది. ఏది సాధ్యమో,ఏది అసాధ్యమో గుర్తెరిగి జాగ్రత్తగా పొందుపరిచినట్లుగా కనబడుతున్నది. ఆవాస్ యోజన కింద రెండు కోట్ల గృహ నిర్మాణము చేపట్టాలని సంకల్పించడం శుభ పరిణామం. ఆయుష్మాన్ భారత్ కింద అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు ఊరట కలిగించడం హర్షించదగ్గ పరిణామం. కోటి ఇళ్లపై రూప్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేయడం ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అందిస్తామనడం,మిగిలిన కరెంటును డిస్కములకు సప్లై చేయడం ద్వారా సగటున సంవత్సరానికి 18,000/- వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించడం స్వాగతించదగ్గ పరిణామం. ఇది పర్యావరణహితంగా ఉండడమే కాకుండా తరిగిపోతున్న ఇంధన వనరులను కాపాడుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. అంతేకాకుండా కొద్దిపాటి ఆదాయం కూడా మధ్యతరగతి వర్గానికి అందించినట్లు అవుతుంది.
కార్పొరేట్ సంస్థలకు కొంత రాయితీ కల్పించడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతాయి. దానివల్ల విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగకుండా ముందుకు వేగంగా పోతుంది. అంతేకాకుండా ఆర్థికవేత్త రోజెన్ స్టీన్ రోడాన్ పేర్కొన్నట్లు పెద్ద ఊపు తీసుకురావడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న చిన్నపాటి ఒడిదుడుకులు కూడా మాయమవుతాయి. అంతర్జాతీయంగా చమురు సంస్థలు లాభాల బాటన పయనిస్తున్నప్పటికీ ప్రభుత్వము చొరవ తీసుకొని ప్రత్యేక రాయితీలు కల్పించలేక పోవడం వల్ల సామాన్యునిపై భారాన్ని తగ్గించలేకపోయారని చెప్పవచ్చు. అంటే కొత్త భారాన్ని పేద,మధ్యతరగతి వర్గాలపై మోపకపోగా ఉన్న భారాన్ని కొంత మాత్రమైన తగ్గించలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వేతన జీవులకు మాత్రం పెద్దగా ఊరట లభించలేదు. 7 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ప్రకటన మాత్రమే కొంత ఉపశమనంగా కనబడుతున్నప్పటికీ గత సంవత్సరం ప్రకటించిన కొత్త స్లాబ్ లనే కొనసాగించడం కొంత నిరాశ కలిగించినది.
ప్రజాకర్షక పథకాలు,ప్రత్యేక రాయితీలు కల్పించడం ద్వారా కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. దానికి తోడు ‘‘రూపాయి రాక’’ కొరకు సరికొత్త పన్నులను సైతం వడ్డించవలసి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయోగాలకు తావివ్వకుండా ఉన్నఫలంగా తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ ఎన్నికల తాయిలాలుగా పేర్కొనే ప్రజాకర్షక పథకాల జోలికి పెద్దగా వెళ్లకుండా వ్యవస్థీకృత,వేగవంత, సమ్మిళిత అభివృద్ధి, ఆర్థికపర ప్రతిష్ఠపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కనబడుతున్నది. ఈ తాత్కాలిక బడ్జెట్ వచ్చే ఐదేళ్ల కాలం నాటికి ప్రభుత్వ పాలన విధానాలు ప్రతిబింబించే విధంగా కనబడుతున్నది. త్వరలో ప్రకటించబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో ఇప్పుడు చోటు కల్పించబడని అంశాలకు అప్పుడు చోటు కల్పించబడవచ్చు అని ఆశిద్దాం.
-భువన వాణి
సామాజిక, రాజకీయ
ఆర్థిక విశ్లేషకులు
8919464488
ఏది ఏమైనప్పటికీ ఎన్నికల తాయిలాలుగా పేర్కొనే ప్రజాకర్షక పథకాల జోలికి పెద్దగా వెళ్లకుండా వ్యవస్థీకృత,వేగవంత, సమ్మిళిత అభివృద్ధి, ఆర్థికపర ప్రతిష్ఠపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కనబడుతున్నది. ఈ తాత్కాలిక బడ్జెట్ వచ్చే ఐదేళ్ల కాలం నాటికి ప్రభుత్వ పాలన విధానాలు ప్రతిబింబించే విధంగా కనబడుతున్నది. త్వరలో ప్రకటించబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో ఇప్పుడు చోటు కల్పించబడని అంశాలకు అప్పుడు చోటు కల్పించబడవచ్చు అని ఆశిద్దాం.
-భువన వాణి
సామాజిక, రాజకీయ
ఆర్థిక విశ్లేషకులు
8919464488





