వొచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి

  • పక్క రాష్ట్రాలలో కేసుల దృష్ట్యా స్వీయ జాగ్రత్తలు అవసరం
  • డీహెచ్‌ ‌డా.శ్రీనివాసరావు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి పూర్తిగా పోలేదనీ, రానున్న మూడు నెలల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కొరోనా వ్యాప్తి అదుపులోనే ఉందనీ, పక్క రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్వీయ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. గురువారం కోఠిలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదనీ, హైదరాబాద్‌ ‌మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదని తెలిపారు.

కొన్ని చోట్ల ఫోర్త్ ‌వేవ్‌ ‌ప్రారంభమైందనీ, మనం థర్డ్‌వేవ్‌ ‌నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ‌గత నాలుగు రోజులుగా కోవిడ్‌ ‌వివరాలు తెలుసుకుంటున్నారనీ, ఏప్రిల్‌, ‌మే, జూన్‌ ‌నెలల్లో వివాహాలు, విహార యాత్రలు ఎక్కువగా ఉంటాయనీ, ఈ దృష్ట్యా మూడు నెలలు ప్రభుత్వం చెప్పే నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ ఎక్స్ఈ ‌వేరియంట్‌ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చనీ, 2022 డిసెంబర్‌ ‌నాటికి కోవిడ్‌ ‌పూర్తిగా ఫ్లూలాగా మారే అవకాశం ఉందని చెప్పారు.

ఫోర్త్ ‌వేవ్‌ ‌నుంచి ప్రజలు బయపటడాలంటే ప్రజలు తప్పనిసరిగా టీకా వేసుకోవాలనీ, ఇప్పటికే తెలంగాణలో 106 శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావొద్దంటే టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమనీ, 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రబుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాలలో బూస్టర్‌ ‌డోసు వేస్తున్నామనీ, రెండు డోసు తీసుకున్న తరువాత 9 నెలలకు అర్హతను బట్టి బూస్టర్‌ ‌డోసు తీసుకోవాలని ఈ సందర్భంగా డీహెచ్‌ ‌డా.శ్రీనివాసరావు సూచించాచరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page