Take a fresh look at your lifestyle.

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం
పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు
గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య

రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం కేసీఆర్‌ ‌గురువారం సమీక్షించారు. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ, ఇతర మంత్రులతో కేసీఆర్‌ ‌సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్‌ ‌జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం అప్పుడు విజయవంతమైంది. తిరిగి దీనిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని సిఎం కేసీఆర్‌ ‌సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా.. వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు, భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై చర్చించారు. రోడ్లు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని చెప్పారు. పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం వల్ల…రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే పలు ఇతర అంశాలపై సీఎం చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్‌ ‌పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ ‌వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఆర్‌ అం‌డ్‌ ‌బీ శాఖ అధికారులతో పాటు తదితరులు ఉన్నారు. సచివాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇంటీరియర్‌ ‌పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. కొత్త సచివాలయం ప్రాంగణానికి కేసీఆర్‌ ‌చేరుకుని పనులను పరిశీలిస్తున్నారు.

150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్‌ ‌డిజైన్‌, ఎలక్ట్రికల్‌, ‌ప్లంబింగ్‌, ‌వర్క్‌స్టేషన్‌ ఏర్పాటు, కలరింగ్‌, ‌ఫ్లోరింగ్‌, ‌మార్బుల్స్, ‌పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్‌ ‌బిల్డింగ్‌ ‌కాన్సెప్ట్ ‌పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ ‌శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ ‌రెడ్డి, బాల్క సుమన్‌, ‌పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, దానం నాగేందర్‌, ‌మైనంపల్లి హన్మంతరావు, సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌సీఎం ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ నర్సింగ్‌ ‌రావు, సీఎం సెక్రటరీలు భూపాల్‌ ‌రెడ్డి, స్మితా సభర్వాల్‌, ‌పంచాయతీరాజ్‌ ‌శాఖ కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా, కమిషనర్‌ ‌హన్మంతరావు, సంజీవరావు, ఆర్‌ అం‌డ్‌ ‌సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్‌ ‌రావు, ఫైనాన్స్ ‌సెక్రటరీ రోనాల్డ్ ‌రాస్‌, ‌సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ ‌తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply