ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి
చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు
పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక
ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్ 6 : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్, డీఏంహెచ్‌వో మనోహర్, సూపరింటెండెంట్ మహేశ్, జిల్లా వైద్య నోడల్ అధికారి కాశీనాథ్, వైద్య సిబ్బందితో పీహెచ్ సీ బలోపేతం, వైద్య సేవలు అందుతున్న తీరుపై సవి•క్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో వైద్యులు టైమ్ టూ టైమ్ 24 గంటలు వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. చేర్యాల పీహెచ్‌సీ పరిధిలో ఎన్ని ఏఎన్‌ఎంలు ఉన్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో రజినిని మంత్రి ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీల పరిధి వారీగా రెండు రోజులలో నివేదికలు ఇవ్వాలని గతంలో చెప్పినా తీరు మారలేదన్నారు. ఇకనైనా మేల్కొనండి. నెల రోజులైంది. ఇంకా సమయం దొరకలేదా అంటూ.. డీఎంహెచ్‌ఓ మనోహర్, డిప్యూటీ డీఏంహెచ్‌ఓ రజినిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ డీఏంహెచ్‌వో రజినిని చేర్యాల పీహెచ్‌సీకి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించాలని టీవీవీపీ కమిషనర్ అజయ్‌ని మంత్రి ఆదేశించారు. చేర్యాలలో 30 పడకల దవాఖాన నూతన భవనం, రెండు థియేటర్లు, లేబర్ రూమ్, మార్చురీ గది, ఇంకా అవసరమైన ఎస్టిమేషన్ కాపీ ప్రతిపాదనలు వారం రోజుల్లో పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుత పీహెచ్‌సీ భవన నిర్మాణం తాత్కాలిక మరమ్మతుల విషయమై కావాల్సిన నిధులు ఇస్తామని, అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. చేర్యాల పీహెచ్‌సీలో అదనంగా గైనకాలజిస్ట్, ఇద్దరు ఏంబీబీఎస్ డాక్టర్లు, పిల్లల డాక్టర్, అనస్తీషియా వైద్యులను వెంటనే అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని టీవీవీపీ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే చేర్యాల పీహెచ్ సీలోని ఆరోగ్య శ్రీ, జనరేటర్ నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సవి•క్షించారు.