లాటిన్ అమెరికాలో ‘వెని జులా’ దేశం విశిష్ట ప్రాధ్యాన్యాన్ని కలిగి ఉంది. లాటిన్ అమె రికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి విప్లవ చోదక శక్తిగా ప్రభవించి ప్రత్యామ్నాయ సారధిగా పరిణమించి నయా వలసవాద రాజకీ యాలను అంతమొందించి ప్రపంచానికి ప్రత్యా మ్నాయ మార్గదర్శనం చేశారు.
ప్రపంచంలో సంభవించిన విప్లవోద్యమ పరిణామాల్లో సైనిక తిరుగుబాటుతో వెలుగులోకి ప్రసరించిన హ్యూగో చావెజ్ నేతృత్వంలో కొనసాగిన ‘వెనిజులా విప్లవ ప్రయోగం’ విప్లవాలకు ‘దశ-దిశ’ను నిర్దేశించింది. ఆయన అందించిన స్పూర్తితో నేడు ఆయా లాటిన్ అమెరికా దేశాలు సామ్యవాద సంక్షేమ రాజ్యాలుగా నిత్యనూతనంగా వెలుగొందుతున్నాయి.
వెనిజులా రాజకీయ చరిత్రను పరీశీలిస్తే 1908 లో యువాన్ విసెంటె గోమెజ్ అధికారంలోకి రావడంతోనే వెనిజులా ఆర్థిక ద్వారాలను అంత ర్జాతీయ పెట్టుబడుల కోసం బహిర్గతం చేశారు. 1935 లో గోమెజ్ పూర్వపు అనుచరుడైన జనరల్ ఎలియాజర్ లోపేజ్ కాంట్రెరాస్ పాలనలో ప్రజా స్వామిక శక్తులు అజ్ఞాతంలోకి నెట్టివేయబడి రహస్య స్థావరాలనుండే తమ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ప్రజాస్వామిక కార్యాచరణ (ఎ. డి) పార్టీ మరియు ప్రజాస్వామిక రాజకీయ ఎన్నికల సంఘటనా మండలి ( కోపి) పార్టీల హవా వెనిజులాలో నిర్విఘ్నంగా కొనసాగుతుండేది. 1946 లో వెనిజులా కమ్యూనిస్ట్ పార్టీ మరియు 1947 లో వెనిజులా కార్మిక సంఘాల సమాఖ్య లు ఏర్పడ్డాయి.వామపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహ రించిన ప్రజాస్వామిక కార్యాచరణ (ఎ. డి) పార్టీ 1948 లో పతనం చెందింది. 1948 నుండి దాదాపు పదేళ్ళ పాటు పెరెజ్ జిమినెజ్ అనే సైనికాధికారి దేశంలో ముఖ్యంగా వామపక్ష ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు. 1960 వరకు కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రంగానే వ్యవహరించిననూ 1970 లో చీలిపోయింది. ప్రభుత్వం వెనిజులాలో వామపక్షాలపై దుర్మార్గంగా దమనకాండలకు పాల్పడుతుండడంతో అవి కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి.
1971 తర్వాత వెనిజులాలో సైనిక అకాడమీని సంస్కరించారు. సామాన్య మధ్య తరగతి ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన హ్యూగో చావెజ్ సైనిక అకాడెమీలో చేరి 1975 లో పట్టభద్రులయ్యారు. చావెజ్ గెరిల్లా నిరోధక కార్యకలాపాల నిమిత్తం నియమింపబడి చురుకైన పాత్రను నిర్వహించారు. అంతేకాకుండా ఆయన అధ్యాపకులుగా విధులు నిర్వర్తించి సైనిక విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపి కొత్త తరం సైనికులను, అధికారులను తీర్చిదిద్దారు. సైనిక అకాడెమీ లో శిక్షణ పొందుతున్న రోజుల్లోనే వెనిజులా దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయాలని చావెజ్ నిర్ణయించుకున్నారు.పేద వర్గాల నుంచి వచ్చిన సైనికాధికారుల ప్రజాస్వామిక ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా 1987’ డిసెంబర్ 17 న ‘బోలివర్ విప్లవోద్యమం-200’ ని ఆవిర్భవిం పజేయడంలో చావెజ్ విశేష కృషి చేశారు.
1989, ఫిబ్రవరి 27 న ప్రభుత్వం ధరలు పెంచడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. 1989, మార్చి 4 నాటికి 400 మంది మృత్యువాత పడిన ఈ ‘కరాకాజో దమనకాండ’కి చలించిన హ్యూగో చావెజ్ బృంద సభ్యులు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరు ద్ధరణకు పిడికిలి బిగించారు. సైన్యంలో కేవలం పది శాతం మద్దతు కలిగి ఉన్న చావెజ్ వారి సహాయంతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 1992 డిసెంబర్ లో సైనిక తిరుగుబాటు చేయాలనుకున్నారు. కాని తిరుగుబాటు వ్యూహకర్తలలో కొందరు ద్రోహులుగా మారి తప్పులు చేయడంతో చావెజ్ పథకం విఫలం అయ్యింది. అయిననూ ఆయన ప్రజల్లో పెద్ద కదలిక తీసుకు వచ్చారు. ప్రజలు చావెజ్ ని ‘దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే యోధుడి’గా చూశారు. సైనిక తిరుగుబాటులో పాల్గొన్న అనేక మంది అధికారులు మరియు సైనికులు చెరసాలపాలు అయ్యారు. చెరసాలలో ఉండగానే చావెజ్ తీక్షణమైన అధ్యయనం చేసి ‘విప్లవాన్ని సమర్ధిస్తూ ముందుకు వచ్చిన వారంతా ఆకలితో ఉన్నవారేనని, విప్లవక్రమం సాధించకుండా వెనిజులా ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడదు’ అని చావెజ్‌గ్రహించి విప్లవక్రమం లక్ష్యాలను సాధించడానికి సైన్యాన్ని ఒక వాహకంగా ఎంచుకున్నారు.
చావెజ్ నిర్బంధం నుండి విడులయ్యాక సైన్యం వెలుపల కూడా ఉద్యమాన్ని బలోపేతం చేశాడు. ప్రజాస్వామిక కార్యాచరణ (ఎ. డి) పార్టీ మరియు ప్రజాస్వామిక రాజకీయ ఎన్నికల సంఘటనా మండలి ( కోపి) పార్టీలు విశ్వసనీయతనుకోల్పోవుతున్న నేపథ్యంలో ‘ఎన్నికల పంథా’ను ఎంచుకోవడం మేలు అని ఉద్యమ నాయకత్వం భావించింది. చావెజ్ తో పాటు ఇతర విప్లవ ఉద్యమ నాయకులు దేశమంతా పర్యటించి ఆయా సము దాయాలతో చర్చలు జరిపి ‘రిపబ్లిక్ ఉద్యమాన్ని’స్థాపించి దానికి రాజకీయ వేది కను కల్పించారు. 1997, ఏప్రిల్ 19 న జరిగిన బొలివేరియన్ -200 మహాసభల సందర్భంగా పార్ల మెంట్ రాజకీయాల్లో పాల్గొనాలన్న నిర్ణయాన్ని చావెజ్ బృంద సభ్యులు తీసుకున్నారు. తదుపరి 1998 డిసెంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ 56 శాతం ఓట్లు తెచ్చుకొనివిజయం సాధించి అధ్య క్షుడుగా ఎన్నిక కావడంతో వెనిజులా లో విప్లవక్రమం మొదలైనది.
సైన్యాన్ని వాహకంగా చేసుకొని అధ్యక్షుడుగా విజయం సాధించిన చావెజ్ ‘పేదలకు గృహవసతి కల్పించడం, వైద్యం, పౌష్టికాహారం తదితర సేవలను అందించడం లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు సైన్యాన్ని సమీకరింపజేశారు. 1999, జూలై 29 న రాజ్యాంగ సభ ఏర్పాటు కావడం, 350 అధికరణలతో రాజ్యాంగ సభ నూతన రాజ్యాంగాన్నిఆమోదించడం జరిగింది. వెనిజులా రిపబ్లిక్ గా ఉన్న దేశం పేరును ‘బొలివియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా’గా ఆధునీకరించారు. విద్య, వైద్యం, ఉపాధి, గృహావసతి, మరియు ఆహార వసతి లను ప్రజలందరికీ మౌలిక హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరిచారు. మళ్ళీ 2000 జూలై నెలలో జరిగిన ఎన్నికల్లో చావెజ్‌అనుకూల శక్తులు విజయం సాధించడంతో చావెజ్ తిరిగి రెండవసారి అధ్యక్షు డుగా ఎన్నికయ్యారు.
2001, మే 7 న ‘బొలివర్ విప్లవోద్యమం – 200’ నకు పునరంకితం కావాలని చావెజ్ పిలుపునిచ్చారు. 2001 నవంబర్ లో ప్రజోపయోగ భూసంస్కరణలు, చమురు వనరుల స్వాధీనం, సూక్ష్మ వనరుల స్వాధీనం తదితర కీలకాంశాలు మొత్తం 49 ఉత్తర్వులను పార్లమెంట్ లో నెగ్గించుకున్నారు చావెజ్. యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యావకాశాలు కల్పింపజేశారు. ప్రధాన పదవులు అన్నింటిలోనూ విప్లవ చైతన్యం గల అధికారులను నియమించి చమురు, బంగారు గనులు మొదలైన ప్రకృతిపరమైన సహజ వనరులను అన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి ఆయన ప్రజలకు అంకితం చేశారు. దేశ అభివృద్ధి కోసం చావెజ్ తీసుకున్న ప్రజాపయోగ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం తగ్గి ప్రజల జీవన ప్రమాణ స్థాయి గణనీయంగా పెరిగింది.
2005 లో చావెజ్ మొదటిసారిగా ‘21 వ శతాబ్ధి సోషలిజం’ అన్ని నినదించిననూ తాను ‘మార్క్సిస్ట్’ అని, ‘కమ్యూనిస్ట్’ అని చెప్పుకోలేదు.ఆయనపై సైమన్ బొలివర్ ప్రభావం అత్యధికంగా ఉండడంతో తానొక ‘బొలివేరియన్’ నని, ఒక ‘విప్లవకారుడు’ నని మాత్రమే ఆయన ప్రస్తావించుకున్నారు. వెనిజులా దేశ సౌభాగ్యం కోసం ‘బొలివేరియన్ మార్గం’ సరిపోతుందని ఆయన విశ్వసించారు.
2006 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చావెజ్ 63 శాతం ఓట్లు తెచ్చుకొని తిరిగి మూడవసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే వామపక్ష శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ‘యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా’ ని చావెజ్ స్థాపించారు. అలాగే మరోసారి 2012 లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలు, మీడియా విష ప్రచారాలు అన్నింటిని చావెజ్ అవలీలగా అధిగమించి 53 శాతం ఓట్లు సాధించి తిరిగి నాల్గవసారి అధ్యక్షుడుగా ఎన్నిక కాబడి విజయఢంకా మ్రోగించారు.
2006 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చావెజ్ 63 శాతం ఓట్లు తెచ్చుకొని తిరిగి మూడవసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే వామపక్ష శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ‘యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా’ ని చావెజ్ స్థాపించారు. అలాగే మరోసారి 2012 లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలు, మీడియా విష ప్రచారాలు అన్నింటిని చావెజ్ అవలీలగా అధిగమించి 53 శాతం ఓట్లు సాధించి తిరిగి నాల్గవసారి అధ్యక్షుడుగా ఎన్నిక కాబడి విజయఢంకా మ్రోగించారు.
చావెజ్ నాలుగు పర్యాయాలు అధ్యక్షుడుగా కొనసాగిననూ ఆయన తననెప్పుడు అధ్యక్షుడుగా భావించుకోలేదు. ఆయన అతి నిరాడంబర జీవితాన్ని గడిపారు. చావెజ్ వెనిజులా స్థితిగతులను సునిశితంగా అధ్యయనం చేసి సరైన విప్లవ క్రమాన్ని అనుస రించడంలో కృతకృత్యులై విజయాన్ని సాధించారు. వెనిజులా విప్లవ పోరాటంలో చావెజ్ క్రియాశీల పాత్రని నిర్వహించారు. ప్రపంచీకరణ విధానాలకు ప్రత్యామ్నాయ బాటను చూపి ఆచరించి తన పద్నాలుగు ఏళ్ల పాలనను జనరంజకంగా తీర్చిదిద్దిన ‘బొలివేరియన్ సోషలిస్ట్’ గా చావెజ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.
వెనిజులాలో అమెరికన్ వలసవాద ఆధిపత్యాన్నిఅంతమొందించి పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రత్యామ్నాయ నేతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న హ్యూగో చావెజ్‌ని కాన్సర్ వ్యాధి కబళించడంతో 2013, మార్చి 5న తుదిశ్వాస విడిచారు. నేడు చావెజ్ లేని వెనిజులా, చావెజ్ లేని లాటిన్ అమెరికా, చావెజ్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం ఎంత మాత్రం సాధ్యం కాదు. చావెజ్ మరణించిననూ, తరాలు అంతరించిననూ ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజా హృదయాలలో మెడలాడుతూనే ఉంటాయి. ఆఖరి క్షణం వరకు జనహితం కోసం కృషి చేసిన చావెజ్ ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఆదర్శ నేతగా కీర్తి పతాకాలు అందుకొని జయకేతనంతో ప్రభవించారు. హ్యూగో చావెజ్ కాన్సర్ వ్యాధితో కనుమూసిననూ ఆయన నేడుప్రజా హృదయాలలో చిరస్మరణీయంగా ‘వెని జులా విప్లవ వేగుచుక్క’గా వెలుగొందుతూనే ఉన్నారు.
( మార్చి 5 హ్యూగో చావెజ్ పదవ వర్ధంతి )
( మార్చి 5 హ్యూగో చావెజ్ పదవ వర్ధంతి )
జె.జె.సి.పి. బాబూరావు, రీసెర్చ్ స్కాలర్, 94933 19690.