భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ టాగోర్ .1861 మే7న దేవేంద్రనాథ్ టాగోర్ శారదాదేవి దంపతులకు కలకత్తా నగరంలోజన్మించారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నిర్భంధంగా పిల్లలకు చదువు చెప్పే పద్దతి రవీంద్రునికి నచ్చేదికాదు. అందువల్లేనేమో ఆయన ప్రాథమిక విద్య ఒడిదుడుకులకు గురైనట్లు గోచరిస్తుంది.ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటి తోటలోకి వెళ్లడం ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించేరవీంద్రుడు పాఠశాల లోని నాలుగు గోడల మధ్య చదువడానికి ఇష్టపడక, ఇంటి వద్దనే చదువు కోవడానికి నిశ్చయించుకోవడం,అయితే తనకున్న అభిరుచి మేరకు అనేక రంగాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవాడు.ఆ రకంగా వలు విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు.
రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూల్లో చేరినపుడు ప్రొఫెసర్ ‘మార్లే’ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెంచుకొని సాహితీ పరుల ప్రసంగాలు వినడం,వారితో సంభాషించడం, నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి ఆంగ్ల సంస్కృతి సాంప్రదాయాలను ఆకళింపు చేసుకున్నప్పటికి (18 నెలలు ఉండి)ఏ డిగ్రీ సాధించకుండానే స్వదేశానికి తిరిగి రావడం.తన గతానుభవాన్ని దృష్టియం దుంచుకొని ప్రాథమిక విద్యాదశలో సమగ్ర దృక్పథంతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 1901లో కలకత్తా సమీపంలో ‘శాంతినికేతన్’ అనే విద్యాలయాన్ని స్థాపించాడు. రవీంద్రుడు ప్రకృతి ఆరాధకుడు కావడంతో కృత్యాధార బోధన చేయడానికి ప్రకృతి వాదం మంచి సాధనమని భావించారు.
ఈ విద్యాలయంలో కేవలం పుస్తకాలలో పేర్కొన్న అంశాలు మాత్రమే కాకుండ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే లలిత కళలు,పాశ్చాత్య విద్య,భారతీయ సంస్కృతి,సంప్రదాయాలకు సంబంధించిన విద్యా ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. ఈ విద్యాలయంలో అభ్యసించిన వారందరు అనేక రంగాలలో ప్రఖ్యాతినొందడంతో 1920 లో ‘శాంతినికేతన్’ విద్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో ఆనాటి పరిస్థితులను నిశితంగా పరిశీలించిన టాగోర్ విద్య ద్వారానే భారతీయుల అజ్ఞానం దూరం కాగలదని, శక్తివంతమైన నూతన భారతీయ సమాజం ఉద్భవించగలదని విశ్వసించేవారు.చిన్నతనం నుంచే సాహిత్యం అంటే మక్కువ కలిగిన వీరు కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, ఆధ్యాత్మికవేత్తగా ,చిత్రకారునిగా విద్యావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధునిగా ,నటునిగా వక్తగా..ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాగోర్ రాణించారు.
వీరు 1909 లో బెంగాలీ భాషలో రచించిన గీతాలను ఆంగ్లంలో అనువదించిన ‘‘గీతాంజలి’’ అని నామకరణం చేశారు.ఇది అనేక ప్రపంచ భాషలలో అనువదించ బడింది.ఇందులో మానవాళిని కృంగదీసే నిరాశ,నిస్పృహలు సకలసృష్టిని ప్రేమ భావంతో చూసేలా,శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం ఉన్నందున ప్రపంచ స్థాయిలోనే ‘‘గీతాంజలి’’ గొప్ప రచనగా నిలిచింది.ఈ కావ్యానికి 1913 లో నోబుల్ బహుమతి అందుకున్నారు. నోబుల్ బహుమతి సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండ వాసి టాగోర్ .ఈ కావ్యం అనేక భారతీయ భాషలలోకి కూడా అనువదించబడింది. రవీంద్రుని రచనలు భిన్నమైన ఆలోచనా విధంతో సాగేవి.అందుకే ఆయన సాహిత్యం కేవలం బెంగాలీలనే కాకుండా మిగిలిన భారతీయ సాహితీ ప్రియులను కూడ అలరించేది. సోనార్ తరి,పురవి,’ ది సైకిల్ ఆఫ్ ది స్ప్రింగ్, ది మార్నింగ్ సాంగ్స్ ,ది ఈవినింగ్ సాంగ్స్ వంటి పద్య రచనలు కూడా చేశారు. ఇంకా ఆయన రాసిన నవలలు గోరా , ది రెక్ ,రాజా రాణి, ముక్తధారా ,రాజ్ రిషి, ఘరే భైరే, నౌకాదుబి వంటివి విశేష ఆదరణ పొందాయి.కాగా మతాలు వేరైనా పరస్పర స్నేహాలతో కలిసి మెలసి ఉండాలని, సాంఘీక ప్రయోజనంతో పాటు ఉత్తమమైన సందేశం మిళితమైన ‘‘గోరా ‘‘అనే నవల టాగోర్ కి ఎంతో పేరు,ప్రఖ్యాతులను తీసుకు వచ్చింది.’చిత్ర ‘అనే నాటకం కూడా ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్ఠలను తెచ్చి పెట్టింది.అలాగే కాబూలీవాలా, క్షుదితపాశన్ వంటివి ఆయన కలం నుంచి జాలువారిన మంచి కథలు.
తాను నమ్మిన విషయాలను ఎదుటి వారికి చెప్పడంలోనూ,ఎంచుకున్న మార్గాన్ని అనుసరించడంలోనూ ఆయన నిక్కచ్చిగా వ్యవహరించేవారు. ఎదుటి వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికి తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా వెల్లడిచేసేవారు.
స్వాతంత్య్ర సమరంలో భాగంగా గాంధీజీ విదేశి వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చినపుడు దీని వలన అంతగా ప్రయోజనం ఉండదని గాందీ నిర్ణయాన్ని రవీంద్రుడు ఖండించారు.అలాగే బ్రిటీష్ బాల గంగాధర్ తిలక్ ను నిర్భంధి ంచినపుడు ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 1919 లో జలియన్ వాలా బాగ్ లో సమావేశమైన భారతీయులపై కాల్పులు జరుపవలసిందిగా జనరల్ డయ్యర్ బ్రీటీష్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం, ఆ సమయంలో జరిగిన కాల్పులలో వేలాది మంది భారతీయులు మరణించడంతో ఈ ఘాతుకాన్ని తీవ్రంగా నిరసించడమే కాకుండా..బ్రీటీష్ ప్రభుత్వం లోగడ తనకు ఇచ్చిన ‘సర్ ‘అనే బిరుదును తిరస్కరించి ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వాన్ని సైతం ఎదురించిన ధీశాలి. బెంగాల్ విభజన ప్రతిఘట నోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 1896 లో కలకత్తాలో జరిగిన కాంగ్రేస్ సదస్సులో మొట్టమొదటిసారిగా బంకించంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతరం’ ను టాగోర్ ఆలపించి అందరిలో చైతన్యాన్ని రగిలించాడు.మన దేశానికి స్వతంత్రం సిద్ధించిన తరువాత మనకు ఒక జాతీయగీతం ఉండాలనుకున్నపుడు బంకించంద్ర చటర్జి రచించిన ‘వందేమాతరం’ రవీంద్రుడు రచనచేసిన ‘జనగణమన’ పరిశీలనకు వచ్చినపుడు ఎన్నో తర్జన భర్జనలు,సుధీర్ఘ చర్చలు జరిగిన సమయంలో రవీంద్రుని ‘జనగణమణ’ ఎంపిక కావడం.రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ‘‘జాతీయ గీతం’’గా జనగణమణ ను,జాతీయ గేయంగా.. ‘వందేమాతరం’ ను ప్రకటిస్తూ …ఈ రెండు కూడ సమాన ప్రతిపత్తిని కలిగి ఉంటాయని ప్రకటించారు.తన విశేష ప్రతిభాపాటవాలతో భారతీయులందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రవీంద్రుడు 1941 ఆగస్టు 8న సాహితీ వినీలాకాశంలో నక్షత్రంగా ప్రకాశించడానికి అంతర్థానమయ్యారు.
– నరేందర్ రాచమల్ల
9989267462