విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేనా !

దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్య వేదికకు రంగం సిద్ధం అవుతోంది. ఓవైపు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈ ‌విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు హర్యాణాలో చౌతాలా కూడా బీహార్‌ ‌సిఎం నితీశ్‌తో కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 25న ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా నిర్వహించతలపెట్టిన సమ్మాన్‌ ‌దివస్‌ ‌ర్యాలీని కూడా చేపట్టారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొన్న తర్వాత బిహార్‌ ‌సీఎం నితీశ్‌ ‌కుమార్‌.. ‌ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తానని ప్రకటించారు. విపక్ష పార్టీలతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నితీశ్‌, ‌హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా కలిశారు.

అప్పుడే నితీశ్‌ ‌తన మనసులోని ప్లాన్‌ను చౌతాలా ముందుంచారు. విపక్షాల ఐక్యతపై వారిరువురూ చర్చించారు. ఈ నేపథ్యంలో చౌతాలా ’సమ్మాన్‌ ‌దివస్‌ ‌ర్యాలీ’పై ప్రకటన చేశారు. ఇలా ఎవరికి వారు వేర్వేరుగా పోరాడినంత కాలం ఐక్యత సాధ్యం కాదు. తక్షణంగా విపక్షపార్టీలు ఐక్య కార్యాచరణను ప్రకటిస్తేనే ప్రజల్లో నమ్మకం వస్తుంది. అయితే విపక్షాల్లో పెద్దగా కదలిక కానరావడం లేదు. కెసిఆర్‌ను కలిసిన వారిలో కేవలం కర్నాక మాజీ సిఎం కుమార స్వామి మాత్రమే బహిరంగ మద్దతు ప్రకటించారు. ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం బలమైన కూటమిని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని ఇటీవల ప్రకటించారు. బిజెపి ముక్త భారత్‌ అన్న నిదాంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నాలను ఆయన ముమ్మరం చేస్తున్నా..దేశంలోని అనేక పార్టీలు తమ రాజకీయ ఎజెండాతో ముందుకు సాగుతున్నాయే తప్ప ఐక్యత కోసం కలసి రావడం లేదు.

ప్రతిపక్షాల్లో ఎక్కడా చురుకుదనం కానరావండ లేదు. బీహార్‌ ‌వెళ్లి సిఎం నితీశ్‌ను కూడా కెసిఆర్‌ ‌కలిసి వచ్చారు. అలాగే మరోవైపు రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్ర ద్వారా కాంగ్రెస్‌ ‌శ్రేణులను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే.. ప్రభుత్వాలు చేసే దుర్మార్గాలను అడ్డుకోవా ల్సిందే. కేంద్రంలో అయినా,రాష్ట్రంలో అయినా అధికార పార్టీల ఆగడాలను ఎదుర్కోవాల్సిందే. అలాగే విపక్షాల కుటమి కడుతున్నామన్న కెసిఆర్‌ ‌కూడా తెలంగాణలో ప్రజావ్యతిరేక చర్యలను ముందుగా ఆపాలి. నిజానికి దేశంలో విచ్ఛిన్నకర పాలన ధోరణులు రోజురోజుకు ప్రబలుతున్నాయి. కార్పోరేట్‌ ‌సంస్థలకు కేంద్రం అండగా నిలుస్తే..కాంట్రాక్టర్లకు రాష్టాల్ల్రో ప్రభుత్వాలు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ జగగరూకులై ఉండాలి.

ఈ నేపథ్యంలో ప్రజలను విభజించే కుట్రలను సమష్టిగా తిప్పికొట్టాలి. ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని రక్షించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరమున్నది. ప్రాంతీయ పార్టీల ఐక్యత కూడా నేటి దేశ రాజకీయ తక్షణావసరం. అలాగే ప్రాంతీయ పార్టీల పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఉండాల్సిందే.. ఇకపోతే బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తు న్నారు. మోడీ నిరంకుశ విధానలను కూడా ఎవరూ హర్షించడం లేదు. వివిధ రకాలుగా పన్నులు పేరుతో దోపిడీ జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని పోరాటాన్ని ప్రకటించారు. ఇలా ప్రగతికోసం చేసే కృషికి సహకారాన్ని అందించడానికి ఎవరెరవరు ముందుకు వస్తాన్నది కూడా ముఖ్యమే. అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తొలుతు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణను సాధించి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ ‌నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.

దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కేసీఆర్‌ ‌క్రియాశీల భూమిక పోషించాలని కోరారు. ఇందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దక్షిణాదిలో ప్రస్తుతానికి కుమారస్వామి మాత్రమే మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారని వార్తలను స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్‌ ‌లాంటి సీనియర్‌ ‌నాయకుడి అవసరం దేశానికి ఎంతో ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో భేటీలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై చర్చించారు. ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని కెసిఆర్‌ ‌బలంగా నమ్మకం కలిగిస్తున్నారు. తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రకటించారు.గుజరాత్‌ ‌మోడల్‌ ‌కాదు…తెలంగాణ మాడల్‌ ‌దేశవ్యాప్తంగా కావాలన్న సంకల్పాన్ని ప్రకటిం చారు. అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశానికి తెలంగాణ మాడల్‌ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

దేశంలో విచ్ఛిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలను విభజించే కుట్రలను సమష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ ‌పలు వేదికల ద్వారా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథా, దాని పర్యవసానాలపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెడుతున్నారని విమర్వలు గుప్పిస్తున్నారు. దేశ ప్రజాస్వామిక సమాఖ్యస్ఫూర్తిని రక్షించేందుకు ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నా యం కాంగ్రెస్‌ అనే అభిప్రాయం దేశ ప్రజల్లో ఉందని కాంగ్రెస్‌ ‌నేతులు భావిస్తున్నారు. తామే ప్రత్యమ్నా యమని కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత జరిగితే మంచిదే. బీజేపీతో ప్రజలు విసిగిపోయారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం బలమైన కూటమిని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని ఇటీవల నితీశ్‌ ‌కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఎవరికి వారు కార్యాక్రమాలు చేపట్టకుండా ఐక్యంగా ముందుకు సాగాల్సి ఉంది. ఐక్య పోరాటాలు చేయాల్సి ఉంది. అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది.

– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page