వినూత్న పక్రియ…•రుతు ప్రేమ..•

ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం…
సిద్ధిపేటలో ప్రతి మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ
రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మంత్రి హరీష్‌రావు సరికొత్త ఆలోచన
బట్ట ప్యాడ్స్ ‌వాడకంలో ప్రపంచానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలి
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ఏప్రిల్‌ 6(‌ప్రజాతంత్ర బ్యూరో) : స్వచ్చ సర్వేక్షణ్‌-2021‌లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేయాలని నిర్ణయించింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుతుప్రేమ’ పేరిట ప్రతీ మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ చేసే ఓ సరికొత్త అవగాహన సదస్సుకు అంకురార్పణ చేశారు. రాష్ర ్టఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  వినూత్న ఆలోచనకు సిద్ధిపేటలోని 5వ వార్డు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులతో హాజరైన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఈ రోజు చాలా సంతోషకరమైన దినం. మహిళ శక్తి చైతన్య స్ఫూర్తి నిండిన దినం. మహిళ ఆరోగ్యం, డబ్బుల ఆదా, పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పక్రియ చేపట్టిన సుదినం. ఇది మరో మార్పుకు నాంది కావాలి. రాష్ట్రంలో తొలి పక్రియగా సిద్దిపేటలో మొదలైన రుతు ప్రేమ ఇక్కడితో ఆగొద్దు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. దేశానికే మనమే ఆదర్శంగా ఉండాలని హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. బట్ట ప్యాడ్స్ ‌వాడటంలో ప్రపంచానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలన్నారు. ఋతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుందనీ,  నేడు మనం మొదటి మెట్టు ఎక్కామంటే మీ మహిళల సహకారం వల్లనేననీ అన్నారు.  వీటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, డబ్బు వృథా కాదనీ,  ఇది ప్రపంచంలో ఉండే ప్రతి మహిళకూ ప్రతి నెలా జరుగుతున్న పక్రియ అని,  ఈ వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్త ఇవ్వడంలో అదర్షంగా నిలవడంతో ఈ వార్డు పైలెట్‌ ‌ప్రాజెక్టుగా ఎన్నుకున్నామన్నారు. ఎవరి ఆరోగ్యంను వారే కాపాడుకోవాలనీ, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారనీ,  జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సును నిర్వహించి ప్యాడ్స్ ‌పంపిణీ చేస్తామనీ,  ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా సిద్ధిపేటలో నిర్వహిస్తున్నామన్నారు. రుతు ప్రేమ పేరిట ప్రతి మహిళకు క్లాత్‌ ‌ప్యాడ్స్, ‌పిల్లలకు బేబీ క్లాత్‌ ‌డైపర్స్ ‌పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.

రసాయనిక డైపర్స్ ‌వాడకం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారన్నారు. ఆడపిల్లగా పుట్టిన ప్రతీవారికి ప్రతీ నెలా రుతుస్రావం (బహిష్టు) అనేది ఓ సహజ పక్రియ. అది ప్రకృతి ధర్మం అని మంత్రి తెలిపారు. ఈ కంప్యూటర్‌ ‌యుగంలో..ఇతర గ్రహాలకు ఉపగ్రహాలను పంపుతున్న నేటి కాలంలో కూడా ఆడపిల్లలు కూడా దీని గురించి బహిరంగంగా మాట్లాడరని, తల్లి తండ్రులు ఆ దిశగా ప్రోత్సహించరని మంత్రి అన్నారు. అదొక ఆరోగ్య విషయంగా కాకుండా.. గుప్త విషయంగానే చూస్తారని అన్నారు. మహిళల్లో సహజంగా జరిగే పక్రియ రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడక పోవడం వల్ల ఇప్పటికే సమాజం అనేక విధాలుగా నష్ట పోయిందని మంత్రి తెలిపారు. చాలా మంది అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని జయించే ధైర్యం లభించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆ హద్దులను చెరిపివేసి ఆమెకు ఆరోగ్య మంత్రిగానే కాకుండా సమాజంలో బాధ్యతాయుత పౌరుడిగా అభయం అందించి అండగా ఉండాలని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హరీష్‌ ‌రావు తెలిపారు. రుతు ప్రేమ కార్యక్రమం వల్ల ప్రస్తుతం దానిపై బహిరంగంగా చర్చ, చైతన్య పక్రియ జరగడం తొలి విజయంగా అభివర్ణించారు.

ఇదే స్పూర్తితో మహిళ సంఘాలు వైద్యులు ప్రజలను మరింతగా చైతన్యం చేయాలని క్లాత్‌ ‌ప్యాడ్స్ ‌వినియోగం గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. క్లాత్‌ ‌ప్యాడ్స్ ‌వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు అధిగమించడంతో పాటు, డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ్ ‌సిద్దిపేట లాంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 35 కోట్ల మహిళలు రసాయనిక ప్లాస్టిక్‌ ‌ప్యాడ్స్ ‌వాడుతునట్టు సర్వేలో తేలిందన్నారు. ప్లాస్టిక్‌ ‌ప్యాడ్స్ ‌స్థానంలో క్లాత్‌ ‌ప్యాడ్స్ ‌వాడడం బహుశ రాష్ట్రంలో సిద్దిపేట తొలి పక్రియగా అభివర్ణించారు. దీనిపై మరింత చర్చ జరుగాలన్నారు. రానున్న రోజుల్లో అన్ని వార్డుల్లో క్లాత్‌ ‌ప్యాడ్స్ ‌పంపిణీ చేస్తామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళ అధికారులు, ఉద్యోగుల, మెప్మా, మహిళ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారికి అవగహన కల్పించాలని మంత్రి హరీష్‌రావు అక్కడే ఉన్న ఆదనపు కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌కు మంత్రి హరీష్‌రావు సూచించారు. నార్మల్‌ ‌డెలివరీ ఎక్కువగా చేయాలనీ, రాష్ట్రంలో డెలివరీ కోసం చేసే సర్జరీలు 62శాతం అని, మొదటి గంటలో ముర్రుపాలు తాగేది మన రాష్ట్రంలో 37శాతం మాత్రమే అన్నారు. రానున్న రోజుల్లో అన్ని వార్డులలో బట్టప్యాడ్స్ ‌పంపిణీ చేస్తామనీ, ప్యాడ్స్ ‌వాడకంలో మనం ప్రపంచానికి ఆదర్శం కావాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page