బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
నువ్వు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, దిగంబరంగా ఉన్నా పరవాలేదు. నీవు మా దాసివి అంటూ లాక్కు వస్తుంటే, ద్రౌపది దీనాతిదీనంగా ఏడుస్తూ సభికులనుద్దేశించి, ఈ సదస్సులో నున్న రక్షించే వారు ఒక్కరూ లేరా? ఒక ఆడదానిపై అత్యాచారం జరుగుతూవుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రాదులు ఏమి చేయలేని దుస్థితిలో వున్నారా? అంటూ లోక రక్షకుడిని ప్రార్ధించింది. ఓ పెద్దలారా ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానా, అధర్మంగానా అడిగింది. భీష్ముడు మాత్రం ఇలా చెప్పాడు. ఇతరుల ధనాన్ని పణంగా ఒడ్డే అధికారం జూదరికి లేదు. కానీ భార్య ఎప్పుడూ భర్త ఆధీనంలో ఉంటుంది గావున, ఈ రెండూ విరుద్ధ విషయాలే వీటిని సమన్వయించి చెప్పగల సూక్ష్మ ధర్మం మాకు తెలియదు అన్నాడు భీష్ముడు.ఇంత మంది కురువంశ ప్రముఖులున్నారీ సభలో ఎవ్వరికీ ధర్మనిర్ణయ శక్తి లేదా? ఆ శక్తి లేనివారిని జ్ఞానులనీ, వృద్ధులనీ ఎలా అనగలం ? కపట ద్యూతం సాగించి కదా ఈ పరిస్థితి వచ్చింది.
అంటూ రోధిస్తుంటే, దుశ్శాసనుడు ఆమె పైటచెంగు పట్టుకుని లాగడం ప్రారంభించాడు. అది చూసి భీముడు తన కోపాన్ని ఆపుకోలేక పోయాడు. భీముని కన్నుల్లో అగ్ని జ్వాలలు రేగాయి. ధర్మరాజు వంక తిరిగి, ఎంతటి జూదరి అయినా తన వద్ద వున్న కులటను కూడా పందెం కాయడు. మా సర్వసంపదల్నీ, మమ్మల్నీ పందెంలో ఒడ్డినా మేము బాధపడము. కానీ కుల స్త్రీని పందెంలో పణంగా పెట్టి నీచమైన పని చేసావు. ఇంతవరకూ నిన్ను సంహించాను. ఇప్పుడిక సహించేది లేదు. సహదేవా నువ్వెళ్ళి నిప్పు తీసుకురా, నా చేతులూ ఎందుకూ పనికి రానివైపోయాయి. కాల్చుకుంటాను అన్నాడు.
అర్జునుడు భీమునికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కానీ భీముడు శాంతించలేదు. ఆ సమయంలో దుర్యోధన సోదరుడు వికర్ణుడు లేచి ఇందరు మహానుభావులున్న ఈ సభలో ద్రౌపది సందేహ నివృత్తి చేయగల వారే లేరా అన్నాడు. ఎవ్వరూ పెదవి విప్పి మాట్లాడలేదు. ప్రభువుకు జూదం, తాగుడూ, కామము, భోగములందు ఆసక్తి తగనిది. వీటికి లొంగితే వారి వివేకం నశిస్తుంది. ద్రౌపది పాండవులు అయిదుగురికీ భార్య. అమెను సణంగా పెట్టాడు. ధర్మరాజు తనను తాను ఓడిన తర్వాత పణంగా పెట్టే అర్హత లేదు. కావున ద్రౌపది ధర్మ విజేతకాదంటూ వికర్ణుడి పలుకులు విని సభ ఒక్క సారిగా కలవరపడింది.




