వేతన దోపిడీ, పని ప్రదేశాలలో అన్నీ రకాల వేధింపులు, పని ప్రదేశంలో జరిగే ప్రమాదాలకు పరిహారం, రావలసిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందడం వంటి అనేక అంశాలలో ఈ హెల్ప్ లైన్… ‘ఇండియా లేబర్లైన్ -18008339020 సహాయాన్ని అందిస్తుంది. అలాగే, వలస కార్మికులకు న్యాయ సహాయాన్ని, మధ్యవర్తిత్వ సేవలు కూడా ఈ హెల్ప్ లైన్ పనిలో భాగం. ఈ మొత్తం పనులను చేయటానికి అందించడానికి వివిధ సంస్థల, వ్యక్తుల సమన్వయంతో వర్కింగ్ పీపుల్స్ కోయలిషన్ ((WPC) ఏర్పడింది..
ఈ రోజు మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మిక వర్గ గతిని మార్చిన పోరాటాలకు గుర్తుగా ఎన్నో సంవత్సరాలుగా ఈరోజుని జరుపుకుంటున్నాం. అయితే ఇప్పటివరకూ సంఘటిత కార్మికవర్గానికే పరిమితమయిన ‘మే డే’ ని ఇప్పటికీ అసంఘటితంగా, వెలుగులోకి రాకుండా మిగిలిపోయిన అసంఖ్యాక శ్రామికులను కలుపుకుంటూ వారి హక్కుల కోసం నిలబడాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ క్రమంలో జరుగుతున్న కొన్ని స్పూర్తిదాయక ప్రయత్నాలను ప్రజల ముందుకు తీసుకురావటమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.
హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాదు మారుమూల జిల్లాలలో కూడా ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల నుంచీ వలస కార్మికులు పెరగటం మనకు కనిపిస్తోంది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల జీవితాలు అత్యంత విషాదభరితంగా సమాజం ముందుకు వచ్చాయి. ఎవరీ వలస కార్మికులు? ఎక్కడి నుంచీ వస్తున్నారు ? అనాలోచిత లాక్ డౌన్ వల్ల దేశమంతా వలస కార్మికుల నడకలతో, వారి అర్థాంతర మరణాలతో అంతర్జాతీయ సమాజం ముందు మన దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది . ప్రతీ రాష్ట్రం లోనూ వలస కార్మికుల సంఖ్య ఎంత వుందో ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరా లెక్కలు లేవు… కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు. .? పనిచేసే చోట వాళ్ల జీవితాలు ఎలా వుంటున్నాయో, వారి పనిలో, వేతనాల్లో చట్టం అమలవుతోందో లేదో ఎవరికీ తెలియదు. స్థానిక కార్మికులను పెట్టుకోవటానికి ఏ సంస్థా సిద్ధపడటం లేదు. స్థానికులు సరిగ్గా పనిచేయరు అని ఒక ముద్ర వేసేయటం కనిపిస్తుంది. కానీ, అసలు నిజమేమిటంటే, స్థానికులైతే తమకు రావలసిన వేతనాల గురించి ప్రశ్నిస్తారు, పని గంటల గురించీ నిలదీస్తారు. తమకు అన్యాయం జరిగితే మద్ధతుగా తమ సమూహాన్ని కూడగట్టుకుంటారు. ఇదంతా జరగకూడదనుకుంటే, భాష రాని దూరప్రాంతపు వలస కార్మికులను తీసుకుంటే ఎన్ని గంటలైనా పనిచేయించుకోవచ్చు. తక్కువ వేతనాలు ఇవ్వొచ్చు. వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే అసలు వేతనమే ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టవచ్చు. అడిగేవారు వుండరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళను మనుషులుగా కూడా గుర్తించనవసరం లేదనే భావన అడుగడుగునా వ్యక్తమవుతుంది.
2020 లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీద నిస్సహాయంగా నడిచివెళ్తున్న వారిని ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, వారు పనిచేసిన చోట వేతనాలు ఇవ్వకుండానే యజమానులు వెళ్లగొట్టారని! బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని! భారత కార్మిక వర్గంలో ఎక్కువశాతం ఈ అసంఘటిత శ్రామికులే వుంటారు. అభివృద్ధి పేరుతో ఏర్పాటవుతున్న స్పెషల్ ఎకనామిక్ జోన్లు వలసలను తీవ్రతరం చేస్తాయి. నగరాల విస్తరీకరణ వల్ల నిర్మాణ రంగం పెరిగి అక్కడ విపరీతమైన శ్రామికుల అవసరం ఏర్పడుతుంది. అయితే అక్కడ పనిగంటల భారం ఎక్కువ. వేతనాలు తక్కువే కాకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. వీటి గురించి పట్టించుకునే వ్యవస్థలు వుండవు. ఆర్థిక దోపిడీ సర్వ సాధారణం. ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం కాదు కదా సరైన రక్షణ, వైద్య వ్యవస్థల సహకారం కూడా ఉండదు. తమ స్వంత ప్రాంతాల్లో ఉపాధి అస్సలు లేదు కాబట్టి జీవనోపాధి గురించి అన్నీ రకాల దోపిడీలను సహిస్తూ కుటుంబాలను సాదుకునే వారే మనకు ఎక్కువ కనిపిస్తారు. మహిళలైతే అదనంగా లైంగిక వేధింపులకు, దోపిడీకి కూడా గురవుతున్నారు. ఉపాధి కోసం కొంతమంది కుటుంబాలను స్వంత ఊరిలోనే వదిలేస్తే, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు కుటుంబాలతో సహా వచ్చి పనిచేస్తారు. ఏ రకమైన ప్రాధమికమైన వసతి సౌకర్యాలూ లేకుండానే జీవనం సాగించాల్సి వుంటుంది. తల్లిదండ్రులతో వచ్చే పిల్లలకు బడి సౌకర్యాలు గానీ, అంగన్వాడీ సౌకర్యాలు గానీ వుండవు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ , చలికి వణుకుతూ లక్షలమంది పిల్లలు తమ ప్రాథమిక హక్కులకు దూరమై బతకుతున్నారు. లెక్కలకు అందని అనేక వృత్తులలో ఈరోజు వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారనేది కోవిడ్ మన కళ్ళకు కట్టింది. బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లు తున్నారనేది అర్థమయిన సంధర్భం.
సరిగ్గా ఈ పరిస్థితుల నేపథ్యం లో నుంచే అనేకమంది ప్రజాస్వామ్యవాదుల, సంస్థల కృషితో వలస కార్మికుల కోసం ‘ఇండియా లేబర్లైన్ -18008339020 హెల్ప్‌లైన్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఈ హెల్ప్‌లైన్ వలస కార్మికులకు సహాయాన్ని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ హెల్ప్‌లైన్ ఏకకాలంలో వివిధ భాషల్లో పనిచేయటం. దీనిద్వారా ఎంతోమంది వలస కార్మికులు రెండు తెలుగు రాష్ట్రాలలో తమ సమస్యలను వెల్లడించగలుగు తున్నారు. పోరాడగలుగుతున్నారు.
వేతన దోపిడీ, పని ప్రదేశాలలో అన్నీ రకాల వేధింపులు, పని ప్రదేశంలో జరిగే ప్రమాదాలకు పరిహారం, రావలసిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందడం వంటి అనేక అంశాలలో ఈ హెల్ప్ లైన్ సహాయాన్ని అందిస్తుంది. అలాగే, వలస కార్మికులకు న్యాయ సహాయాన్ని, మధ్యవర్తిత్వ సేవలు కూడా ఈ హెల్ప్ లైన్ పనిలో భాగం. ఈ మొత్తం పనులను చేయటానికి అందించడానికి వివిధ సంస్థల, వ్యక్తుల సమన్వయంతో వర్కింగ్ పీపుల్స్ కోయలిషన్ ((ILL) ఏర్పడింది. ఈ కోయలిషన్ ఆధ్వర్యలో ఇండియా లేబర్లైన్ ((WPC)) పనిచేస్తూ వలస కార్మికులకు, అలాగే దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ మద్దతు గా నిలుస్తోంది. ఈ కోయలిషన్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్నప్పటికీ అనేక భాషలలో పనిచేస్తూ అవసరమైన చోట ప్రత్యక్ష సహకారాన్ని అందించడానికి శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలు ఉన్నారు.
జూలై 16, 2021 నుండి ఈ హెల్ప్ లైన్ ప్రత్యక్ష అమలులో ఉంది. శిక్షణ పొందిన టెలి-కౌన్సెలర్లు కార్మికులకు తమ దగ్గర వున్న సమాచారంతో సహకారాన్ని అందిస్తారు. వారి ఫిర్యాదులను హెల్ప్‌లైన్‌లో నమోదు చేస్తారు. చట్టపరమైన వివాదాలలో క్షేత్రస్థాయిలో మద్ధతు అందించటానికి తయారుగా ఉంటారు. సమస్యలలో వున్న కార్మికులను సంబంధిత అధికార శాఖలైన పోలీసు, కార్మిక శాఖలతో అనుసంధానించి సమస్య పరిష్కారానికి సహాయ పడతారు. మధ్యవర్తిత్వం విఫలమైనప్పుడు, న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కార్మికులకు న్యాయ సహాయం అందిస్తుంది.
వలస కూలీలు తమకు ఎదురైన సమస్యను చెప్పటంలో మొదట ఎదుర్కునే పెద్ద సవాలు భాష. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ భాషల నుండీ వచ్చే కార్మికులు తమ స్వంత భాషలో వివరించి సహాయం పొందడానికి ఈ హెల్ప్‌లైన్ లో బహుభాషా సేవను ఉపయోగించుకోవచ్చు. కార్మికులు ఎక్కడి నుండి వచ్చినా లేదా ఏ భాష మాట్లాడినా వారికి అవసరమైన మద్దతును ఈ హెల్ప్ లైన్ లో పొందగలుగు తారు. చాలామంది కార్మికులకు తమ హక్కుల గురించి, తమకు రావలసిన పరిహారం పొందడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఏమీ అవగాహన ఉండదు. ఇండియా లేబర్లైన్ ద్వారా లాయర్లు కార్మికులకు చట్టపరమైన హక్కులపై సమాచారాన్ని అందించడంతో పాటు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా అందిస్తారు. కేసులను నిరంతరం పర్యవేక్షిస్తారు. అసంఘటిత కార్మికుల హక్కులను రక్షణలో మెరుగైన విధానాలు, నిబంధనల రూపకల్పన కోసం ఈ హెల్ప్ లైన్ పౌర సమాజ సంస్థలతో, కార్మిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తోంది.
ఇప్పటివరకూ 10 రాష్ట్రాలలో 14 కేంద్రాలలో ఈ హెల్ప్ లైన్ సేవలు ప్రత్యక్షంగా అందుతున్నాయి. ఇంకో ఐదు రాష్ట్రాలలో తొందరలో మొదలు కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ హెల్ప్ లైన్ హైదరాబాద్ రామంతపూర్ లోని మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. గత సంవత్సరంన్నర కాలంగా మొత్తం 696 కేసులు హెల్ప్ లైన్ లో నమోదు అవగా, అందులో 267 కార్మిక వివాదాలను పరిష్కరించి, రూ. 63,31,182.00 (అరవైమూడు లక్షల ముప్ఫై ఒక్కవేల నూట ఎనభై రెండు రూపాయలు) పరిహారం కార్మికులకు అందేలా చేశారు. హెల్ప్ లైన్ కి వస్తున్న ప్రతి కథనాన్నీ మీడియా రాయగలిగితే, చూపించగలిగితే ఎంత అమానవీయత సమాజంలోని ప్రతీ వ్యవస్థ లో పేరుకుపోయి వుందో అర్థంఅవుతుంది.
వలస కార్మికుల, అసంఘటిత కార్మికుల హక్కుల రక్షణలో తమ శక్తి మేరకు పనిచేస్తున్న ఇండియా లేబర్ లైన్ తో అనుసంధానమయి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ హెల్ప్ లైన్ సమాచారాన్ని మరింత ఎక్కువమంది అసంఘటిత వలస కార్మికులకు అందుబాటులోకి తీసుకు రావలసిన బాధ్యత ప్రతి వొక్కరి మీదా వుంది..
–కె .సజయ
సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్