వందరోజుల పాలనలో సిఎం రేవంత్ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్ రెడ్డికి ధోకా ఉండదు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నంతలో రేవంత్ అభివృద్దికి కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చింది. అప్పులకుప్పగా చేసింది. జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్టాన్న్రి అప్పుల ఊబిలోకి నెట్టింది. ఈ క్రమంలో అధికారం చేపట్టిన రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది.. అయితే అప్పుల గురించి, అవినీతి గురించి ప్రజలు ఆలోచించకుండా…చర్చించకుండా ఉండేలా..బిఆర్ఎస్ కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, ఎలా అమలు చేస్తారని పొద్దున లేచింది మొదలు విమర్శలకు దిగుతున్నారు. గ్రామాల్లో ప్రజలు ఛీత్కరించుకుంటున్నా.. పట్టించుకోవడం లేదు. తాజా పరిణామాలను గమనిస్తే వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కక పోవచ్చు. ఇవన్నీ చక్కదిద్దుకుంటూనే వొచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా సిఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు తో ప్రజల సహకారంతో సుస్థిర అభివృద్దికి ప్రణాళికను రూపొందించుకోగలిగింది. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధికి ఆలంబనగా నిలిచేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ అభివృద్దే లక్ష్యమని హావిూనిచ్చిన.. మేరకు ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తున్నది. ఎన్నికల హావిూల అమలు, అభివృద్ధి, సంక్షేమం, పెండిరగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక అంశాల విూద సిఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనంగా చూడాలి.
అయితే అంతకు మించిన అవలక్షణాలు ఇప్పుడు బిఆర్ఎస్లో బయటపడడం ప్రజల్లో ఉన్న భరోసాను కోల్పోతోంది. ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీకేజీ, గతంలో ఇంటర్ పరీక్షల విధానం, ధరణి సమస్యలు, ప్రాజెక్టుల నిర్వాసితుల పట్ల నిరంకుశ వైఖరి వంటివన్నీ బిఆర్ఎస్ అనుసరించిన ఈ విధానాల పట్ల ప్రజల్ల తీవ్ర ఆగ్రహం ఉంది. ఇవన్నీకూడా కావాలని చేసినట్లుగా ఉండడంతో బిఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని ప్రతిఫలించింది. ఇలాంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. అందుకే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది. కెసిఆర్ అప్పులు చేసి అవి ప్రజలకు తెలియకుండా..ఆస్తులు సృష్టించామని చెబుతూ వొచ్చారు.
సంక్షేమ పథకాల రూపకల్పనలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని బాకాలు ఊదారు. రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకమంటూ లేదని ఊరూవాడా ప్రచారం చేసుకున్నారు.. తెలంగాణ ఏర్పడక ముందున్న పరిస్థితులను పోలిస్తే గతంలో కన్నా మెరుగైన విధంగానే అభివృద్ది, సంక్షేమం కోసం తీవ్రంగా కసరత్తు జరుగుతోందన్న భ్రమలు కల్పించారు. మంచిని మంచిగా.. చెడును చెడుగా చూడాలన్న భావనతో విశ్లేషిస్తే గానీ అసలు నిజాలు బయటపడలేదు. అందుకే గత పాలనకు భిన్నంగా రేవంత్ రెడ్డి తన వందరోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమాలకు సమప్రాధాన్యమిస్తూ ముందుకుపోతున్న విధానాన్ని ఆచరణలో ప్రతిఫలించింది.
ఆదాయ వనరులు పడిపోయిన పరిస్థితుల్లో కూడా మున్నెన్నడూ లేనిస్థాయిలో ఇచ్చిన హావిూల అమలుతో ప్రజలకు అండగా ప్రభుత్వం నిలిచింది. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. నిధుల కేటాయింపుల్లో సర్వజన సంక్షేమం కనిపిస్తున్నది. గ్రావిూణ ఆర్థిక వికాసం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రోత్సహించేదిగా ఉంటున్నాయి. విద్య, వైద్య రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కనిపిస్తున్నది. మూసీ సుందరీకరణ, మెట్రో రైలు, రీజినల్ రింగ్రోడ్లాంటి వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తగిన ప్రాధాన్యం లభించింది. సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న దనడానికి చేపట్టిన కార్యక్రమాలను నిదర్శనంగా చూడాలి.
వెనుకబడిన, నిమ్న వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మహిళలకు వడ్డీలేని రుణాలు మొదలు బీసీలు, ఎంబీసీల కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధికోసం అవసర మైన నిధులతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. ఇకపోతే రైతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. సాగునీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మొత్తంగా అభివృద్దికి వెనకడుగు వేసేది లేదని నిరూపించుకునేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. పేపర్ లీకేజ్ గత ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై ఉక్కు పాదం మోపాలి. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్న భావన వొచ్చేలా కృషి జరగాలి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రెఫరెండమని సిఎం రేవంత్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకునే చూస్తారు. ఈ ఒక్కటి గ్రహించి ముందుకు సాగితే తిరుగు ఉండదు.
ప్రజాతంత్ర డెస్క్





