కమీషన్ల కోసం రోడ్డు వెడల్పు పెంచడం దారుణం
దీనిలో బిఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది
-ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం ముందు భూ భాదితులతో కాంగ్రెస్ అధ్వర్యంలో ధర్నా
భూ బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని మిట్టపల్లి రైల్వే బాధితులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జి బాధితులతో ధర్నా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో రైల్వే భూపాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ కు చెందిన నాయకులు లబ్ధి పొందేందుకు వారి కమీషన్ల కోసం వందలాది కుటుంబాలను రోడ్డున పడేసేలా వ్యవహరించారని అన్నారు. వారి సొంత లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. రైల్వే పేరిట మిట్టపల్లి కి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏ కార్యక్రమం చేసిన ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలే కానీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు పెట్టేలా ఉండొద్దని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు భూకబ్జాలు భూదందాలు వాటికే సమయం కేటాయించారని ఎద్దేవా చేశారు. గతంలో చేసిన సర్వే ఆధారంగా బ్రిడ్జి నిర్మించాలని కొత్తగా నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని కచ్చితంగా నిర్మాణం చేయకుండా అడ్డుకుంటామని అన్నారు. ఈ విషయమే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి మహిళా అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి, డిసిసి మైనార్టీ అధ్యక్షుడు మజర్ మాలిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యడరీ మధు, పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశద్, బీజాని, అయుబ్,నవాజ్, తదితరులు పాల్గొన్నారు.