రైతులకు విద్యుత్‌ ‌కోతలు తగవు

  • ఎరువుల ధరలు తగ్గించి ఇవ్వండి
  • సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి లేఖ
  • ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు సిద్దమని వెల్లడి
  • రాహుల్‌ను విమర్శిస్తూ కవిత ట్వీట్‌పై మండిపాటు

న్యూ దిల్లీ, మార్చి 29 : రైతాంగ సమస్యలను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తన లేఖలో…రాష్ట్రంలో రైతులకు కరెంట్‌ ‌కోతలు విధించటం, ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను వి• దృష్టికి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు లేనిది రాజ్యం లేదు ..ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటాం..నేలతల్లిని నమ్ముకుని కష్టపడి బ్రతికే రైతన్నలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ వారికి భారంగా మారకూడదు..అని కోమటి రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికే వడ్లు కొనుగోలు విషయంలో రైతులు గందరగోళంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కరెంట్‌ ‌కోతలు విధించి రైతులను ఇంకా బాధ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కోతలతో చేతికొచ్చిన పంట నీరు అందక ఎండిపోతుంటే రైతు కళ్లలో నుండి కన్నీరు కారుతుంది. పట్టణ ప్రాంతాలకు 24 గంటలు కరెంట్‌ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు అవసరం అనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయండని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీగా 35 మిలియన్‌ ‌యూనిట్లు రికార్డ్ ‌కాగా 5 మిలియన్‌ ‌యూనిట్లు కోత విధించారు. ఇలా కోతలు విధించటం మూలాన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు..రైతులను 24 గంటల కరెంట్‌కి అలవాటు చేసి ఇలా పంట చేతికొచ్చే సమయంలో కోతలు విధించడం ఏంటి..? మరో వైపు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విపరీతంగా రేట్లు పెంచటం వలన రైతులకు ఎరువులు పెను భారంగా మారాయన్నారు.

266 ఉన్న యూరియాపై 50 రూపాయలు పెంచారు. ఇలా ఓ వైపు ఎరువుల ధరలు పెంచుతూ కరెంట్‌ ‌కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నేలతల్లిని నమ్ముకుని బ్రతుకున్న రైతన్నలు ఇలా వేధించటం సరికాదన్నారు. రైతన్నలు ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ఒక్కరోజైనా ధాన్యం సమస్యపై పార్లమెంటులో మాట్లాడారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్‌ ‌ఢిల్లీ వొచ్చి సమస్యపై పోరాటం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అన్నదాతల కోసం తాము పదవులు వదులుకునేందుకు సిద్ధమన్న కోమటిరెడ్డి.. 9మంది టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు రాజీనామా చేస్తారా అని సవాల్‌ ‌విసిరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతుల పార్టీ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధానిగా ఉన్నప్పుడు రూ.70వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ పార్టీ సొంతమని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్‌ ‌పోరాటం కొనసాగుతుందన్న ఆయన.. రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్‌ ఎం‌పీలు రైతుల పక్షాన నిలబడి జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే సీఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు దిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ ‌బీ టీంగా మారిందన్న ఆయన.. రాజకీయాలను పక్కన బెట్టి రైతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page