ఆయన నిర్ణయాలు ఫైనల్ కావంటూ కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి ఆగ్రహం
సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా
రేవంత్ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఇటు అధికార బిఆర్ఎస్ దీనిని తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నైజం బయటపడిందంటూ విమర్శల దాడికి దిగింది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు రేవంత్ ఎవరని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు..జాతీయ పార్టీ..ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే..తమ జాతీయ నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ అధికారం రేవంత్ రెడ్డికి లేదని సీనియర్లు తేల్చిచెప్పారు. తానా సభలో ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ మాట్లాడింది తప్పే అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను, రేవంత్ కేవలం కో ఆర్డినేటర్స్ మాత్రమే అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఏది చెబితే అది ఫైనల్ అవుతుందా? అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. రైతులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెడుతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏదీ ఫైనల్ కాదని, ఎంఎల్ఎ సీతక్కను సిఎం చేస్తానన్న వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, రేవంత్ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారో? అర్థం కావడం లేదన్నారు. రేవంత్‌పై టిడిపి ఎంఎల్ఎ, నటుడు బాలకృష్ణ ప్రభావం పడిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కార్యకర్తల పార్టీ అని చెప్పుకొచ్చారు. రేవంత్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోమటిరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు నేతలు తప్పుబట్టారు.
రేవంత్ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిచేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం వి•డియాతో మాట్లాడిన ఆయన ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి మాట్లాడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే రైతులు..రైతులు అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మంత్రులంతా ఊర కుక్కల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రేవంత్ మాట్లాడితే వక్రీకరిస్తున్నారని అన్నారు.
విద్యుత్ కొనుగోలులో అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా అని అన్నారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్లో వణుకు పుడుతుందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ ఎజెండా అని తేల్చిచెప్పారు. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేశారు. రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.




