హైదరాబాద్, ఏప్రిల్ 11 : రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్ జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్ జిల్లా అర్జునగుట్ట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో ప్రధాన పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో వైనగంగ, వార్దా నదులు సంగమించి ప్రాణహితగా ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రస్థానం మొదలవుతుంది. దాదాపు 113 కిలోవి•టర్లు ప్రవహించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతీనది కలుస్తుండటంతో కాళేశ్వరాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా చెబుతారు.
ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల దీనిని ప్రణీత అనీ, తీరం వెంబడి అడవిలో రకరకాల ప్రాణులు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారని చెబుతారు. ప్రాణహిత-గోదావరి సంగమ స్థానంలో ఉన్న కాళేశ్వరం క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు కొలువుదీరి ఉండటం ప్రత్యేకత. వీటిని కాళేశ్వర, ముక్తీశ్వరుల పేరుతో కొలుస్తారు. పుష్కర శోభతో మరింత పవిత్రతను పొందిన ప్రాణహితలో పుణ్యస్నానం పన్నెండేండ్లకు గానీ దక్కని అదృష్టం. బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నదులకు పుష్కరాలు నిర్వహించడం సంప్రదాయం. ఆ విధంగా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి నదికి పుష్కరాలు వొస్తాయి. చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం బృహస్పతి తన స్వక్షేత్రమైన వి•నంలోకి ప్రవేశిస్తున్నాడు.
ఈ క్రమంలో అదేరోజు నుంచి పన్నెండు రోజులు చైత్ర శుద్ధ అష్టమి అంటే ఏప్రిల్ 24 ఆదివారం వరకు పుష్కర సంబురం కొనసాగనుంది. బృహస్పతి రాశి సంక్రమణతో పుష్కరుడు గురువుతోపాటు నదిలోకి ప్రవేశిస్తాడని ప్రతీతి. ఆ పన్నెండు రోజులు నదీజలాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని నమ్మకం. ముక్కోటి దేవతలు సైతం పుష్కర నదిలో స్నానం చేస్తారని పురాణ వచనం. అందుకే పుష్కర స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. అంతేకాదు, పుష్కర నదిలో శ్రాద్ధవిధులు, తర్పణాలు నిర్వహించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుణ్యస్నానాలు, దానధర్మాలు, తర్పణాలతో పుష్కర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.