ఏపీ భూ హక్కు చట్టం
ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థను పటిష్టపరిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించకుండా వీటి సత్వర పరిష్కారానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ని అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది. ప్రజల స్థిరాస్తులను డిజిటలైజ్ చేయాలన్న కేంద్రం ఆలోచనకు అనుగుణంగా నీతి అయోగ్.. భూమికి సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి చేసిన సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. భూమి హక్కులకు సంబంధించి ప్రస్తుతం మన రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. ప్రభుత్వ గ్యారంటీ కూడా లేదు. ఇటువంటి పరిస్ధితులలో టైట్లింగ్ చట్టం ద్వారా భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుందని భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే అని ఈ చట్టం చెబుతోంది. అయితేరాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన భూమి హక్కు చట్టం భూ వివాదాలకు పరిష్కారం చూపకపోగా, మరింత సంక్లిష్టం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ చట్టం అమలు తీరుతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. భూమి, స్థిరాస్తి వ్యవహారాలు అంటేనే చాలా సంక్లిష్టమైనవి, సున్నితమైనవి. విస్తృత వ్యవస్థలు పనిచేస్తున్నా ఎన్నో రకాల సమస్యలు వాటి విషయంలో వేధిస్తుంటాయి. అయితే ఈ చట్టం ద్వారా ఒకే సారి పరిష్కరిస్తాం అని చెప్పడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదు.
రెవెన్యూ వ్యవస్ధపై ప్రజలకు నమ్మకం ఉందా?
రెవెన్యూ వ్యవస్ధపై ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉందో అందరికీ తెలిసినదే,ఏ చిన్నపని కావాలన్న ఆఖరికి మంత్రివర్యులు సైతం సిపార్సు చేసినా వాళ్లకు లంచాలు చెల్లెస్తే కానీ పని కాదు అనేది సర్వ విదితమే.నేడు సివిల్ కోర్టులు చుట్టూ తిరుగుతున్న చిన్న సన్నకారు రైతులు అందరూ రెవెన్యూ వారు వేసిన చిక్కు ముడులే కారణం కాదా?
ప్రస్తుతం దేశంలో గల ఏ రాష్ట్రాలలో పరిశీలించినా అక్కడి పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది విధి విధానాలను పక్కన పెట్టి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్న ఘటనలు నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం.అంతే కాదు స్వయం ప్రతి పత్తి గల రాజ్యాంగ సంస్ధలు కూడా కొన్ని రాజ్యాంగ ఆశయాలను పక్కన పెట్టి అధికార ప్రభుత్వాల ఆజ్ఞలను శిరసావహిస్తున్న ఘటనలు కూడా తక్కువేం కాదు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలచే నియమింపబడిన అధికారులు రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తే ప్రజల ఆస్తికి భద్రత ఏముంటుంది? ప్రభుత్వం లక్ష్యం ప్రజల హక్కులకు భద్రత కల్పించడమా లేదా సివిల్ న్యాయ స్ధానాల జోక్యం లేకుండా కార్యానిర్వాహక శాఖ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమా అనే విషయంలో సందేహాలు మొదలయ్యాయి..హక్కుల పరిరక్షణకు న్యాయ శాఖపై ప్రజలకు గల నమ్మకాన్ని తొలగించి కార్యనిర్వహక శాఖ చొరబాటు చేసినట్లే కదా ఇది రాజ్యాంగ బద్దమా? అవినీతిని ప్రోత్సహించడం కాదా? దీని ద్వారా భూవివాదాల్లో సివిల్ కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాన్ని లేకుండా కట్టడి చేయడం అంటే న్యాయశాఖ లో కార్యనిర్వాహక వర్గం చొరబాటు చేయడమే అవుతుంది.
సహజ న్యాయ సూత్రాలు
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలతో సంబంధం లేకుండా స్థిరాస్తి హక్కుల వివాదాల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధి నుంచి తొలగించి, సహజ న్యాయసూత్రాల ఆధారంగా తీర్పులు ఇవ్వటం జరుగుతుందని చట్టంలో పేర్కొన్నారు.సహజ న్యాయం అంటే అధికారుల విచక్షణ మేర తీర్పులు ఇవ్వడమే అవుతుంది.. ఈ సహజ న్యాయ తీర్పులలో రాజకీయ వత్తిళ్ళు ఏర్పడితే సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది.ప్రస్తుత నెలకొన్న వివాదాలకు సంబంధించి తీర్పులు రావడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. దీనికి కారణం కోర్టులు మరియు న్యాయవాదుల సంఖ్య తక్కువుగా ఉండటమే.ప్రజల స్థిరాస్తిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సివిల్ కోర్టుల సంఖ్యను పెంచి, వాటి ద్వారా కేసుల విచారణను వేగవంతం చేయాలే తప్ప.. సివిల్ కోర్టుల వల్ల ఆలస్యం అవుతుందనే సాకుతో రెవెన్యూ ట్రైబ్యునల్స్ అధికారులకు విస్తృత అధికారాలను కట్టబెట్టడం ఎంత వరకూ సబబు? న్యాయశాస్త్రాలపై సరైన పరిజ్ఞానం లేని అధికారులు భూ యాజమాన్య హక్కులను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలకు ఈ చట్టంలో సమాధానం లేదు.
సుప్రీం తీర్పుకు విరుద్ధం…
గతంలో సుప్రీంకోర్టు కోర్టు భూ యాజమాన్య హక్కులను రెవెన్యూ అధికారులు నిర్ణయించలేరని స్పష్టమైన తీర్పునిచ్చింది. దానికి భిన్నంగా హక్కులను తేల్చే బాధ్యతను టైటిలింగ్ చట్టం ద్వారా రెవెన్యూ అధికార యంత్రాంగం చేతిలో పెట్టి సివిల్ న్యాయస్ధానాలకు అవకాశం లేకుండా చేయడం అనేది సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినట్లే కదా. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన న్యాయవ్యవస్థ ద్వారానే ప్రజల ఆస్తులకు హక్కులను నిర్ధారించే అవకాశం ఉన్నప్పుడే వారికి న్యాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా ఎలాంటి న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులకు హక్కుల నిర్ధారించే చట్టాన్ని అమలు చేస్తే చిన్న సన్నకారు రైతులు ఆస్తులను కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. భూమి వివాదంలో ఉన్నా, లేకున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎవరో ఒకరి పేరుతో టైటిల్ రిజిస్టర్లో చేర్చే అవకాశముంది. రిజిస్టర్లో పేరు నమోదు ముసుగులో చిన్న, సన్నకారు, పేద, దళిత రైతుల భూములు ఆక్రమించే ఆస్కారం కూడా లేక పోలేదు.
తిరుగులేని సాక్ష్యం ఎలా అవుతుంది.?
రికార్డ్ ఆఫ్ టైటిల్స్‌లో ఓసారి యజమాని పేరు నమోదు చేసిన తరువాత రెండు సంవత్సరాల లోపు దానిపై ఏ విధమైన అభ్యంతరాలు రాకపోతే ఆ యజమానే హక్కుదారుడు అని నిర్దారణ చేస్తూ తిరుగులేని సాక్ష్యం (కంక్లూజివ్ ఎవిడెన్స్)గా పరిగణించడాన్ని న్యాయ నిపుణులు తప్పు పడుతున్నారు. ఎందుకంటే రైతులలో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు ఉంటారు.వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడం వలన ఏ రికార్డుల్లో ఏ పేరు ఉంది అనేది ఎవరైనా చెబితే తప్ప తనకు తానుగా తెలుసుకోలేరు.తెలిసే సమయానికి రెండు సంవత్సరాలు పూర్తియితే వాళ్ళ పరిస్ధితి ఏమిటి?
సామాన్యులు హై కోర్టుకు వెళ్లగలరా
సామాన్య ప్రజానీకం తమ ఆస్తుల హక్కుల విషయంలో ఏర్పడిన అభ్యంతరాలు జిల్లా స్థాయి రాష్ట్ర స్ధాయి లో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యూనల్‌లో తేలక పోతే అంతిమంగా హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి.దీనికి అయ్యే ఖర్చును సామాన్యులు భరించగలరా అనే విషయాన్ని ఈ చట్టం పరిగణలోనికి తీసుకోలేదు. రెవిన్యూ అధికారుల తప్పుల వలనే చాలా మంది రైతులు భూహక్కులను కోల్పోయి సివిల్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న నేపథ్యంలో మరలా ఆ రెవెన్యూ అధికారులకు భూమి యొక్క శాశ్వత హక్కులు కల్పించే అధికారాన్ని కట్టబెట్టడం ఎంతవరకూ సమర్ధనీయం?.
ఈ చట్టం తేవడానికి ముఖ్య ఉద్దేశ్యం
ఈ చట్టం వలన భూ యజమానులకు హక్కులు విషయంలో ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నప్పటికి,వాటి లక్ష్యం మాత్రం వేరొకటి ఉంది.అదేమిటంటే న్యాయస్ధానాలను ప్రభుత్వాలు ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు.అదే అధికారులను అయితే తమ వత్తిళ్ళు ద్వారా సామాన్యులకు అన్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టవచ్చు.అందుకే న్యాయ పరిధినుండి తొలగించి అధికారులకు హక్కులు కట్టబెట్టే యత్నం ఈ చట్టం ద్వారా ప్రభుత్వాలు చేస్తున్నాయి.అసలు న్యాయశాస్త్రంపై అవగాహన లేని అధికారులు భూవివాదాలను పరిష్కరించి హక్కులు ఎలా నిర్ణయిస్తారు అనే దానికి వివరణ లేదు.ఈ హక్కు చట్టం కోసం కొత్తగా ఏర్పాటు చేసే టైట్లింగ్ అథారిటీ వ్యవస్ధ కోసం చేసే ఖర్చును విస్తృత పరిధిలో న్యాయస్ధానాలు ఏర్పాటు చేయడంపై పెడితే సివిల్ క్రిమినల్ కేసులు సత్వరమే పరిష్కరింపబడటానికి అవకాశం ఏర్పడుతుంది.రాజకీయ జోక్యాన్ని నివారించే అవకాశం కలుగుతుంది.
ముందస్తు నోటీసు
రెవెన్యూ రికార్డుల్లో యజమానుల పేర్లలో మార్పులు చేయాలంటే సంబంధిత/ ప్రభావిత వ్యక్తులకు ముందుగా నోటీసు ఇవ్వాలి. వారిని విచారించి, వివరణ తీసుకోవాలి. ఆ విధానమేదీ కొత్త చట్టంలో పేర్కొనలేదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేర్ల తొలగింపు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. టైటిల్ రిజిస్టర్లో ఫలానా పేరును నమోదు చేశామని అవతలి వ్యక్తి(ఎఫెక్టెడ్ పార్టీ)కి ఆ విషయాన్ని తెలియజేసే విధానం కూడా లేదు. అలాంటప్పుడు రికార్డ్ ఆఫ్ టైటిల్స్ లో యజమాని పేరు నమోదు చేశాక.. రెండేళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే ఆ వ్యక్తే యజమాని అంటూ తిరుగులేని సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారు.
న్యాయవాదులకు ఏం సంబంధం?
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలు చూసిన చాలా మంది ఇది ప్రభుత్వానికి న్యాయవాదులకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటున్న వారు లేకపోలేదు.అయితే ఈ చట్టం వలన కలిగే ప్రభావాలు గురించి సామాన్య ప్రజానీకానికి తెలియడం లేదు.ఇది న్యాయవాదుల వ్యక్తిగత సమస్య కానే కాదు. అయితే వాళ్ళు ఎందుకు ఈ చట్టాన్ని నిరసిస్తూ నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాంగాలలో కీలకమైన శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక వర్గం చర్యలు రాజ్యాంగ బద్దంగా లేకపోతే వాటిని రద్దు చేసే అధికారం న్యాయశాఖకు ఉంది.ఇటువంటి స్వతంత్ర్య ప్రతిపత్తి గల న్యాయశాఖ చేపట్టే విధులలోనికి కార్యనిర్వాహక వర్గాన్ని జొప్పించే చర్యలను ఖండించడమే కాకుండా దీనివలన సామాన్య ప్రజానీకానికి న్యాయం దక్కే అవకాశం ఉండదని న్యాయవాదుల అభిప్రాయం.చిన్న సన్న కారు రైతులు హైకోర్టు వరకూ వెళ్లి తమ అభ్యంతరాలపై వకీలును పెట్టుకుని వాదించే ఆర్ధిక సామర్థ్యం ఉండదని దీనివలన వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటారని తెలియచేసే ప్రయత్నంగా మాత్రమే న్యాయవాదుల చేసే ఈ సమ్మెను చూడాలి.
చర్చలకు తిలోదకాలు
విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేయాలనుకునే ఈ చట్టాన్ని కేంద్రంతో సంప్రదింపులు చేసి పలు మార్లు మార్పులు చేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం గురించి ప్రజలలో ప్రతి పక్ష పార్టీలలో చర్చకు పెట్టలేదు. హడావిడిగా మరియు ఏక పక్షంగా దేశంలోనే మొదటిగా ఈ చట్టాన్ని తీసుకువచ్చాం గొప్పగా చెప్పడంతో పాటు దానిలో ఎదురైన సందేహాలు అభ్యంతరాలు మొదలైన వాటికి స్పష్టత ఇచ్చిన పిదప మాత్రమే చట్టం తీసుకు రావలసిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు.ఇదే సమయంలో బాధ్యత గల పౌరులు ప్రజాసంఘాలు ఈ చట్టం వలన సామాన్య ప్రజానీకానికి భవిష్యత్ లో ఎదురయ్యే సమస్యలను గురించి అవగాహన కల్పించాలి.
రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578





