కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి
ఫిరాయింపులకు కెసిఆరే ఆద్యుడు..
61మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు
పార్లమెంటులో బిజెపికి వోటేయించిన ఘనులు
జీవన్ రెడ్డి అంశంతో రాజకీయంగా లబ్ది పొందాలని చూశారు
మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
త్వరలో టిపీసీసీ కొత్త అధ్యక్షుడు..
దిల్లీలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్27: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదని, దానికి పునాది వేసింది కేసీఆరే అని అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. వారి మాటలకు అప్పట్లో బీజేపీ వంతపాడింది.
ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్, బీజేపీ రంకెలేశాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్రమని అన్నారు. ఇప్పటికీ ఆయనకు కనువిప్పు కలగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వోటింగ్ 16 శాతానికి తగ్గింది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీను కేసీఆర్ గెలిపించారు. కంచుకోటగా చెప్పుకొనే మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకు అన్ని వోట్లు పడ్డాయంటే అర్థమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్ తలుపులు తెరిచారు.
రాష్ట్రావతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించాం. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డే. విచారణ కమిషన్ కేసీఆర్‌కు లేఖ రాయగానే విచారణ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో విపక్ష నేత మాట్లాడే సంప్రదాయం ఉందా? గతంలో మాకు కనీసం ఆహ్వానం కూడా లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో గందరగోళం నెలకొందని, ఇప్పుడు అంతా సర్ధుకుందని.. పరిస్థితి చక్కబడిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కేబినెట్ విస్తరణ ఇంకా ఖరారు కాలేదు..
కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని సీఎం తెలిపారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని, అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శాఖలకు మంత్రులు లేరనడం సరికాదన్నారు. మంత్రులు నిరంతరం సమీక్షలు చేస్తున్నారని, జీవన్‌రెడ్డి వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగాలని.. గుంట నక్కలు ఎదురు చూస్తున్నాయని, ప్రత్యర్థుల ఆశలు నెరవేరలేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించమని అధిష్ఠానానికి ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా.
నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి బీఆర్ఎస్కు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఫామ్ హౌస్‌లో పడుకోవడానికి తాను కేసీఆర్‌ని కాదని, క్యాలెండర్ డేట్ ప్రకారం నిర్ధిష్టంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖ ద అనేక రివ్యూలు చేశామని, ఏ ఒక్క శాఖ ఖాలీగా లేదని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని, సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అన్ని శాఖల మంత్రులను కలుస్తున్నామని, బీజేపీ పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా కేంద్రాన్ని కలవలేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు వోట్లు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టు కెసిఆర్ మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ వోట్లు బీజేపీకి వేయించారని ఆరోపించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూస్తున్నారంటూ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు…పక్క రాష్టంతో సంబంధాలు కొనసాగిస్తామని, రోజుకు 18 గంటలు పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌పై కమిషన్ తాము ప్రతిపాదించలేదని.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారని, దీంతో రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించామన్నారు. వాళ్లు కమిషన్ అడిగారు.. మేము కమిషన్ వేశామని.. కేసీఆర్ తన వాదనను కమిషన్ ముందు వినిపించుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డియా సమావేశంలో జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.





