రాష్ట్ర గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు మోసం

  • వారికి కెసిఆర్‌ ‌క్షమాపణ చెప్పాలి
  • రాష్ట్రంలో వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలి: కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : తెలంగాణ గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ‌గిరిజనులు, బీసీలు, అణగారిన వర్గాల వారిని చిన్న చూపు చూస్తున్నదని, గిరిజనులకు కేసీఆర్‌ ‌క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేసారు. కేంద్రానికి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తున్న టిఆర్‌ఎస్‌ ‌గిరిజన రిజర్వేషన్లు ఎందుకు సాధించలేక పోతున్నదో చెప్పాలన్నారు. ఒక్క రోజు కూడా టిఆర్‌ఎస్‌ ఎం‌పీలు పార్లమెంట్‌లో గిరిజన రిజర్వేషన్ల అంశంపై మాట్లాడలేదని గుర్తు చేసారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీ తండాలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం కనీసం గ్రామ పంచాయితీ కార్యాలయం కూడా కట్టలేదన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగాల్లో, విద్యా అవకాశాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్‌ అన్నారు. ఏపీలో ట్రైబల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటై పనిచేస్తున్నదని, కానీ తెలంగాణలో ఇంకా యూనివర్సిటీ ఏర్పాటు కాలేదన్నారు. ఎంపీగా రెండున్నర మూడేళ్ళుగా గిరిజన రిజర్వేషన్లపై తాను కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాన్నా కేంద్రం కిమ్మనటం లేదన్నారు. 12 శాతం గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్‌ అసెంబ్లీ లోపల, బయట అనేకసార్లు ప్రస్తావించారు కానీ కేంద్రమంత్రి మాత్రం గిరిజన రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారని అన్నారు.

దీన్ని రాష్ట్ర గిరిజనులు గమనించాలని, అసలు విషయం తప్పుదారిపట్టించేలా హరీష్‌ ‌రావు వ్యాఖలు ఉన్నాయని అన్నారు. మార్చి 21న రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారని, గత 21 డిసెంబర్‌ 2021 ‌లోను ఇదే సమాధానం ఇచ్చారని, పార్లమెంట్‌ ‌జీరో అవర్‌లో, రూల్‌ 377 ‌కింద గిరిజన రిజర్వేషన్‌ అం‌శాన్ని ప్రస్తావించినా…ఇదే సమాధానం వొచ్చిందని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలు మొగుడు పెళ్లాల మధ్య ఉన్న గొడవ లాంటిదని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. అన్ని అంశాలు సర్దుకుంటాయని చెప్పారు. తాను ప్రధానిని కలిసినంత మాత్రాన బీజేపీకి మారతాననటం తగదన్నారు. ‘‘నేను చివరి వరకు కాంగ్రెస్‌ ‌లోనే కొనసాగుతా..కేసీఆర్‌ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిసా..భవిష్యత్తులో కూడా కలుస్తా’’ ని వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. సరైన సమయంలో రైతుల పంటలు కొనుగోలు చేసి రైతులకు బోనస్‌ ఇవ్వాలని, కోవిడ్‌ ‌నేపధ్యంలో ఎకరానికి పదివేల పెట్టుబడి పెరిగింది కనుక బోనస్‌ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్‌ ‌చేశారు.

పంట ధాన్యం కొనుగోలు చేతకాకపోతే కెసిఆర్‌ ‌నువ్వు తప్పుకో తాను, రేవంత్‌ ‌చేసి చూపిస్తామని కెసిఆర్‌కు సవాలు విసిరారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉంటే చత్తీస్‌ఘడ్‌లో లా క్వింటాకు 2500 రూ ఇస్తామన్నారు. చత్తీస్‌ ‌ఘడ్‌లో తమ పార్టీ ప్రభుత్వం వరి ధాన్యానికి 500 బోనస్‌ ‌కూడా ఇస్తున్నదన్నారు. 3 వేల కోట్లు కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానని, తెలంగాణలో వరిధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేసీఆర్‌ను డిమాండ్‌ ‌చేస్తున్నానని అన్నారు. కేసీఆర్‌కి తన అభివృద్ధి మాత్రమే ముఖ్యమని, రైతు బంధు పథకం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదని, కేసీఆర్‌కు ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకపోతే తమకు అప్పచెబితే మద్ధతు ధరతో కొనుగోలు చేసి చూపిస్తామని వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డిది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమని అన్నారు. ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయదని, కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే తమ గురించి వ్యతిరేకంగా రాస్తారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను గతంలో కలిసానని, భవిష్యత్తులో కూడా కలుస్తానని కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *