తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది. పైగా ఆంధ్రలోకూడా అధికారాన్ని కోల్పోవాల్సి వొచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికలనుండి ఆ పార్టీ పతనావస్థకు చేరుకుంటూ పోయింది. గెలుచుకున్న ఎమ్మెల్యే లను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ బిజెపి లాంటి పార్టీలు అదే అంశాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా చివరకు వారు చేరేది గులాబీ గూటికే అంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ కి సవాలుగా మారింది.. ఇప్పుడు 2024 ఎన్నికల రాబోతున్న తరుణంలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పు సంభవిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తెలంగాణలో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమవుతుందంటూ విశ్లేషకులు, రాజనీతిజ్ఞలు జోస్యం చెబుతూ వొచ్చారు.
ప్రధాని, హోంశాఖ మంత్రితో పాటు బిజెపి బలగాలన్నీ కర్ణాటకపై దండెత్తినా బిజెపి ఓటమినే చవిచూడాల్సి వొచ్చింది. దాని పరిణామం తెలంగాణ బిజెపిపై పడింది. బిఆర్ఎస్కు తామే ప్రత్యమ్నాయమని నిన్నటి వరకు ప్రచారం చేసుకున్న బిజెపిది ఇప్పుడు మూడవస్థానానికే పరిమితమవుతుందన్న మాటలు వినవొస్తున్నాయి. అనూహ్యంగా బిజెపిని నెట్టి కాంగ్రెస్ ఆస్థానానికి చేరుకుంటోంది. కర్ణాటక ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ప్రతీ విషయంలో ఇప్పుడు ఆ పార్టీ కర్ణాటకను ఆదర్శంగా తీసుకొంటోంది. నిన్నటి వరకు వర్గ విబేధాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ పార్టీలో కలిసిఉంటేనే అధికారంలోకి రాగలమన్న భావన ఉత్పన్నమైంది. కర్ణాటకలోనూ గ్రూపు రాజకీయాలున్నప్పటికీ కలిసి ఎన్నికల్లో కృషిచేసి ఫలితాన్ని పొందిన విషయాన్ని అధిష్టానం మొదలు రాష్ట్ర నాయకులవరకు ఇప్పుడు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కీలకభేటీ జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, ముఖ్యనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఈ భేటీలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు, ముఖ్యనాయకులు అంతా దాదాపు 17 మందివరకు పాల్గొన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణరాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహరచనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. అందుకు రాష్ట్ర నాయకులవద్ద ఉన్న ఎత్తుగడలేమిటి, అధిష్టానం తీసుకోవాల్సిన చర్యలేమిటన్న విషయన్ని క్షుణ్ణంగా చర్చించారు.
ముఖ్యంగా సీనియర్ నాయకులమధ్య ఉన్న అభిప్రాయభేదాలు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో వారికున్న విభేదాలతోపాటు , కొందరు సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారన్న వార్తలు వొస్తున్న విషయాలపైన దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. బాహాటంగా అసంతృప్తిని ప్రకటించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకు ఎలాంటి అభ్యంతరాలున్నా అధిష్టానానికి• తెలియజేయాలని కేంద్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తున్నది. తాజాగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి చేసిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని చర్చ జరిపినట్లు తెలుస్తున్నది. ఏదిఏమైనా అధికారమే లక్ష్యంగా అందరూ పోరాడాలని రాహుల్‌గాంధీ సూచించారు. తెలంగాణలో కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్ళాలని ఇప్పటికే రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ముఖ్యంగా గర్ వాపసీ విషయంలో, వివిధ పార్టీలనుండి నాయకులు కాంగ్రెస్‌లో చేరికల విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
ఇటీవల బిఆర్‌ఎస్‌నుండి బహిష్కరించబడిన ఇరువురు నేతలు కాంగ్రెస్‌లో చేరడంపట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తంచేశారు. వీరిద్దరు కూడా తమ చేరికలకు బ్రహ్మాండమైన వేదికలను ఏర్పాటు చేయబోతుండగా, వాటిల్లో పాల్గొనే విషయంలో గాంధీల అంగీకారాన్ని కూడా పొందారు. జూలై 2న ఖమ్మంలో న భూతో న భవిష్యత్ అన్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అధిష్టానం వెసులుబాటును బట్టి జూలై 14 లేదా 16వ తేదీన జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్‌లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభలు కాంగ్రెస్ వర్గాల్లో ద్విగిణీకృత ఉత్సాహాన్ని కలిగిస్తాయన్న కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. మరో ఆశ్చర్యకర విషయమేమంటే కేవలం ఈ ఇద్దరు నాయకులే కాకుండా ఇప్పటికే వీరితో పాటు మరో ముప్పై అయిదు మంది మాజీ శాసనసభ్యులు, గతంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికారికంగా చేరబోతున్నారు. వీరంతా ఇప్పటికే తమ చేరిక విషయంలో దిల్లీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారుకూడా. వాస్తవంగా బిజెపిలో ఇలాంటి చేరికలుంటాయనుకూన్నారు. కాని, కర్ణాటక ఎన్నికలకు ముందునుండే ఆ పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఆ పార్టీ చేరికల కమిటి చైర్మన్• ఈటల రాజేందర్ స్వయంగా తన అశక్తతను తెలియజేయడమే ఇందుకు నిదర్శనం.




