15 అమృత్ భారత్ స్టేషన్లు..17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్‌ల నిర్మాణం
26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన
రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్‌లు జాతికి అంకితం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి…హర్షం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా వాటికి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సనరుగనున్నాయని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడిరచారు. 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు కోసం రైల్వేశాఖ మొత్తం రూ. 2,245 కోట్ల నిధులను కేటాయించిందని, ఈ 40 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకు గాను, గత ఆగస్టు నెలలో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. శనివారం ఆయన దిల్లీలో మాట్లాడుతూ… ఇప్పుడు రాష్ట్రంలో మరో 15 అమృత్ భారత్ స్టేషన్లను రూ. 230 కోట్లతో చేపట్టనున్నట్లు, వీటితో పాటుగా పలు అభివృద్ధి పనులకు ఈ నెల 26 న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తూ వొస్తుందని, కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతుందని, రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా అనేక రైళ్ల గమ్యస్థానాలను పొడిగించడమే కాకుండా, వందేభారత్, అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లను కూడా ప్రవేశపెట్టిందన్నారు. రైళ్లు, రైల్వే లైన్ల విస్తరణే కాకుండా రైల్వేస్టేషన్లను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాల తో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా ‘‘అమృత్ భారత్ స్టేషన్ల’’ పేరిట నూతన పథకాన్ని ప్రారంభించిన భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు.
ఇక అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో జడ్చర్ల, గద్వాల్, షాద్ నగర్, మేడ్చల్, మెదక్, ఉందా నగర్, బాసర, యాకుత్ పుర, మిర్యాలగూడ, నల్గొండ, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, బేగంపేట స్టేషన్లు ఆధునీకరించబడనున్నాయి. ఇక అమృత్ భారత్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి అనేక సౌకర్యాలను కల్పించనున్నారు. ఇక అమృత్ భారత్ స్టేషన్లతో పాటు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 1 రైల్ ఫ్లై ఓవర్‌కు, 16 రైల్ అండర్ పాస్‌లకు కూడా శంకుస్థాపన చేయను న్నారు. అందులో హైదరాబాద్ డివిజన్ లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద 2, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద 2 మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు, సికింద్రాబాద్ డివిజన్ లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు, గుంతకల్ డివిజన్‌లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్‌ల నిర్మాణం జరగనున్నాయి. వీటితో పాటు ఆయా డివిజన్లలో రూ. 221 కోట్లకు పైగా నిధులతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్ లను, 29 రైల్ అండర్ పాస్ లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.
హైదరాబాద్ డివిజన్ లోని మహబూబ్ నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్ నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇతిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను, సికింద్రాబాద్ డివిజన్ లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్‌లు, విలాసాగర్, బిస్ బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.




