Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

  • 15254 మెగావాట్లతో అత్యధిక పీక్‌ ‌డిమాండ్‌ ‌నమోదు
  • ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు వెల్లడి

హైరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం జరిగినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు పేర్కొన్నారు. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌నమోదైందన్నారు. ఇవాళ ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్‌ అత్యధిక ఫీక్‌ ‌డిమాండ్‌ ‌నమోదైందని.. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగమని ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ ‌వినియోగం రోజురోజుకూ పెరుగుతుందన్నారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడం వంటివి విద్యుత్‌ ‌వినియోగం పెరగడానికి కారణమన్నారు. మొత్తం విద్యుత్‌ ‌వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానిదేనని ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ ‌వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా.. రెండో స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

నిన్న విద్యుత్‌ ‌వినియోగం 14 138 మెగా వాట్లు కాగా.. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్‌ ‌డిమాండ్‌ 15254 ‌మెగా వాట్లు రికార్డ్ ‌స్థాయిలో నమోదు ఇదేనన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం కాగా.. ఈ సారి గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 15254 మెగా వాట్ల ఫీక్‌ ‌డిమాండ్‌ ‌నమోదు అయిందన్నారు. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్‌ ‌వొచ్చే అవకాశం ఉందని ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. ఎంత డిమాండ్‌ ‌వచ్చినా సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తామన్నారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌నమోదు అవుతుందని ముందే ఉహించామన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ ‌సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర రైతాంగానికి..అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా చేస్తామని ట్రాన్స్ ‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు వెల్లడించారు.

Leave a Reply