మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో కెసిఆర్ పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఆయనతో అయ్యేది కూడా లేదని గ్రహించారని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మహబూబ్‌నగర్‌లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిగా మారిందని అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న సమయంలోనూ పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయన్నారు. పాలమూరు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. గురువారం బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా వొస్తున్నారని, బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆర్‌డీఎస్ సమస్య అలానే ఉందని, దళితులకు 3 ఎకరాలు, దళితబంధు లేనేలేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఫామ్‌హౌజ్‌లో తాగి పడుకోడానికి అధికారం ఇవ్వలేదని, ముందు వడ్లు కొనుగోలు చేయ్..అని సంజయ్ ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ప్రారంభించలేదని, 75 శాతం ధాన్యాన్ని రైతులు నష్టానికి అమ్మేసుకున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. కురిసిన అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోయిందని, రైతులను రాజులను చేయాలన్న ఉద్దేశంతో మోడీ మద్దతు ధర పెంచుతూ వొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.