- తెలంగాణ తల్లి బంధ విముక్తికే పాదయాత్ర
- బీఆర్‌ఎస్-బీజేపీ వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం
- ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన
- రైతులను రాజును చేసి చూపుతామన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అరాచక పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర ఏఐసీసీ కార్యక్రమమని, దానికి తాను కూడా హాజరవుతానని చెప్పారు. బీఆర్‌ఎస్-బీజేపీ వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఒక్కశాతమే ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు రూ.వెయ్యి కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నిధులపై బీజేపీ సర్కార్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
తెలంగాణ తల్లికి బంధ విముక్తిని కలిగించేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని, స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం ఆదాయం భారీగా పెరిగింది. రైతుబంధు డబ్బులన్నీ బెల్టు షాపులకే వెళ్తున్నాయి. తెలంగాణ మోడల్ అంటే 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులు…ఇదేనా కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పునరుద్గాటించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ఒక అగ్రిమెంట్‌గా భావిస్తూ.. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఈ విషయంలో ఇప్పటికే పార్టీ అగ్ర నేత రాహూల్‌గాంధీ హావి• ఇచ్చారు’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెడతామని చెప్పారు. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమిలేని రైతులకు రూ.12 వేలు ఇస్తామని, ప్రత్యేక పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. పసుపు పంట క్వింటాకు రూ. 12వేలు, మొక్కజొన్న క్వింటాకు రూ.2500 మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షల వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చు భరించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని, ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతులు బతికుండగా ఆదుకోని సర్కారు.. చనిపోయాక రైతు బీమా ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో 2014 నుంచి 2023వ సంవత్సరం వరకు రైతులు ఎలా మోసపోయారో ఒకసారి ఆలోచించాలని కోరారు. కేసీఆర్‌పై కోపంతో బీజేపీవైపు చూస్తే పెనంవి•ద నుంచి పొయ్యిలో పడ్డట్టే అని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చిన ఎంపీ అర్వింద్ మాట తప్పారని విమర్శించారు. ఆర్మూర్ రైతు దీక్ష తనను రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేలా చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు, అల్లం, ఇతరపంటలను మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి.. ఆ తర్వాత పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రైతు ఉచితాలు కోరుకోవడం లేదని, పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతుబంధు ఇస్తూ సబ్సిడీలను ఎత్తివేయడం వల్ల భారీగా రైతులపై భారం పడుతోందన్నారు. అలాగే పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని వారు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.