- అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రజల సంక్షేమానికి కృషి
- డిసెంబర్‌లోగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట
- పివి మార్గ్‌లో విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ మహనీయుడు చూపిన బాటలో నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నరని మంత్రి కెటిఆర్ అన్నారు. డిసెంబర్‌లోగా హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం అంబేడ్కర్ విగ్రహాలలో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదని ఆయన అన్నారు. ఈ కాంస్య విగ్రహాన్ని 11 ఎకరాలలో 150 కోట్లతో గొప్పగా ప్రతిష్ఠించబోతున్నామని, ఈ ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, పర్యాటక కేంద్రంగా వర్థిల్లనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సచివాలయం సమీపాన నిర్మించబోయే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇఎన్సీ గణపతి రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, కేసీఆర్ మహోన్నత ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో కేసీఆర్ నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నయని, దళితబంధు, రైతుబంధు పథకాలు మహత్తరమైనవని, ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
దాదాపు అన్ని మంచి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని, నగరం నడిబొడ్డున, సచివాలయం సమీపాన పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్ఠిస్తామని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 8 నెలలుగా విగ్రహ ఏర్పాటు పనులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారని, రాత్రిబవళ్లు ముమ్మరంగా పనులు కొనసాగుతున్నయని, ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటిలో అతి పెద్దదని, ఇది దేశానికే తలమానికంగా నిలవనున్నదని, ఇందులో మ్యూజియం, గ్రంథాలయం, ఫోటో గ్యాలరీ, ధ్యాన మందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్ ఏర్పాటు జరుగుతుందని కెటిఆర్ తెలిపారు.
ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించనున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు తెలంగాణలో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని కెటిఆర్ తెలిపారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, కాలే యాదయ్య, దివాకర్ రావు, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, బిసి కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు మహ్మద్ సలీం, రావుల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.