- సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ దవాఖానాలు
- ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే చేస్తుంది
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాబోయే 50 ఏళ్ల ప్రజల వైద్య అవసరాలను తీర్చే విధంగా హైదరాబాద్‌లోని నలు దిక్కులా మూడు టిమ్స్ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానాలు పుట్టగొడుగుల్లా వెలిశాయనీ, అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలను అనుగుణంగా దవాఖానాలలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం అల్వాలలో మూడు మల్టీ స్పెషాలిటీ దవాఖానాలకు శంకుస్థాపన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలు ఒకవైపు, కొరోనా లాంటి పరిస్థితులు మరోవైపు గుండె, కిడ్నీ, జబ్బులు పెరుగుతున్నాయనీ, వరంగల్ హెల్త్ సిటీలో కలిపి 7500 పడకలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మూడు టిమ్స్‌లలో 3 వేల ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకువస్తున్నామనీ, జంట నగరాలకే పరిమితం కాకుండా చుట్టపక్కల ఉన్న జిల్లాలకు సైతం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 మాత్రమే వైద్య కళాశాలు ఉంటేవనీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పున దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పన 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. గతంలో బెంగాల్ ఏం చేస్తే దేశమంతా అదే చేసేదనీ నానుడి ఉండేదనీ, ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశమంతా అదే అనుసరిస్తుందనే నానుడి నిజం అవుతున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయనీ, 15వ ఆర్థిక సంఘం కూడా బస్తీ దవాఖానాలను కొడియాడిందనీ, ఏడేళ్లలోనే డయాలసిస్ సెంటర్ల సంఖ్యను 3 నుంచి 102కు పెంచామని ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.