- అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్ష
- కుటుంబ పాలనను అంతం చేస్తాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- అంబేద్కర్ దారిలో నడవాలన్న వివేక్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 14 : రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్ష అని ఆయన చెప్పారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బండి సంజయ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలి తప్ప కల్వకుంట్ల రాజ్యాంగం సాగనివ్వమని స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంతం కోసం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వివరించారు. అంబేద్కర్ ఆశీస్సులతో పాదయాత్ర విజయవంతమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని బండి స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా ముందుకుసాగుతామని అన్నారు.
అంబేద్కర్ పెట్టిన బిక్ష కారణంగానే తాను ప్రధాని అయినట్లు స్వయాన మోదీ చెప్పారన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు వొస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని గుర్తుకు వొస్తాయన్నారు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని చేయలేదని, బీజేపీ ఒత్తిడి మేరకు ఇప్పుడు పనులు ప్రారంభించారని తెలిపారు. దేశంలో ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వివేక్, అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ వొచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని తెలిపారు. వోట్ల కోసమే కేసీఆర్ హామీలు ఇచ్చారని చెప్పారు. దళితుల వోట్ల కోసం దళిత బంధు అని విమర్శించారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు.