- సుప్రీమ్ కోర్టు సంచలన నిర్ణయం
- తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు కేసులు రద్దు
న్యూ దిల్లీ, మే 11(ఆర్‌ఎన్‌ఎ) : సుప్రీమ్ కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. ఇప్పటికే ఈ చట్టంపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం రాజద్రోహం చట్టం అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని, ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని సిజేఐ ధర్మాసనం పేర్కొంది. అంతకు ముందు.. రాజద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించే వరకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలను ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజద్రోహం చట్టం నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలన్నారు.
రాజద్రోహం సెక్షన్ 124ఎ రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా..కేంద్ర తరఫున వాదనలు తుషార్ మెహతా వినిపించారు. రాజద్రోహం వ్యవహారంలో గుర్తించదగిన నేరం విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదును ఆపలేమని కోర్టుకు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దేశద్రోహం కేసులు కోర్టుల ముందే పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టులే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో బెయిల్ దరఖాస్తుపై సత్వర విచారణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజద్రోహం చట్టంపై సుప్రీమ్ కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. ఈ క్రమంలోనే రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని సుప్రీమ్ కోర్టు తెలిపింది. కొత్తగా రాజద్రోహం కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సూచించింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్ 124ఎ కింద నమోదైన కేసులన్నింటినీ పునః పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని సవి•క్షించే వరకూ స్టే విధిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది.