- టిఆర్‌ఎస్‌కు సామాజిక న్యాయమంటే తండ్రీకొడుకు పార్టీ ప్రెసిడెంట్లుగా ఉండటమేనా?
- ఒబిసి సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
- టిఆర్‌ఎస్ పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే సిఎంలు, పార్టీ అధ్యక్షులు
- నాకు జరిగిన అన్యాయమే హరీష్‌రావుకూ జరుగుతుంది…
- ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయటపడ్డ
- సిద్ధిపేట బిజెపి ఒబిసి సదస్సులో ఈటల రాజేందర్
సిద్ధిపేట, మార్చి 29 (ప్రజాతంత్ర బ్యూరో) : రాచరిక పాలనకు స్వస్తి పలకాలంటే అది సిద్ధిపేట గడ్డ నుండే ప్రారంభం కావాలనీ, అది బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందనీ బిజెపి ఒబిసి సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో బిజెపి ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు బిజెపి నేతలు లక్ష్మణ్, రాజేందర్, ఆలె భాస్కర్, దూది శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ…అక్రమ కేసులతో బెదిరిస్తే బిజెపి నాయకులు భయపడరనీ టిఆర్‌ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8యేండ్లలో కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతూనే ఉందనీ, ప్రశ్నించిన వారిని గొంతు నొక్కుతున్నారనీ ఆరోపించారు.
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యంగ నడుస్తుందనీ, రాజ్యాంగం మార్చాలని సిఎం కేసీఆర్ అనడం అవివేకమన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనీ, బిజెపి ద్వారానే ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ సొమ్ము ఒకరిది, సోకు ఒకరిదిలా వ్యవహరిస్తూ నిధులను దారి మళ్లిస్తుందని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ సామాజిక న్యాయం అంటే తండ్రి కొడుకు పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండడమేననీ అన్నారు. బిజెపి సామాజిక న్యాయం అంటే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేసిందన్నారు. 1శాతం ఉన్న కులానికి 4గురికి మంత్రి పదవులు ఇదేనా టిఆర్‌ఎస్ పార్టీ సామాజిక న్యాం అంటే ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బుల్డోజర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట, రుణమాఫీ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు మాటల గారడీ నమ్మడానికి ఇకమీదట తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రిజర్వేషన్ల పేరిట గిరిజనులను, ఎస్సీలను టిఆర్‌ఎస్ పార్టీ నేతలు, ప్రభుత్వం మోసం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌కు సాధ్యమైన రిజర్వేషన్ పెంపు, •కేసీఆర్‌కు ఎందుకు సాధ్యం కావడం లేదన్నారు. బిసిలను గతంలో పాలించిన ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. బిసిల రిజర్వేషన్‌ను కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. బిసిల పట్ల ప్రాంతీయ పార్టీలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయన్నారు. బిసిల రిజర్వేషన్ పెరగడానికి బిజెపి మాత్రమే కారణమనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 20శాతం రిజర్వేషన్ ఇచ్చింది బిజెపి పార్టీ మాత్రమేననీ అన్నారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన సిఎం కేసీఆర్ తాను మాత్రం వరి వేసి నేడు ఎవరికి ఉరి వేస్తున్నాడన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశంలో 18రాష్ట్రాల్లో బీజేపి అధికారంలో ఉందనీ, త్వరలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామనీ లక్ష్మణ్ అన్నారు.
టిఆర్‌ఎస్ ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులే సిఎంలు, పార్టీ అధ్యక్షులు….: ఈటల రాజేందర్
బిజెపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ..టిఆర్‌ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు జరిగిన అన్యాయమే సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులే సిఎంలు అవుతారనీ, వారే పార్టీ అధ్యక్షులుగా ఉంటారన్నారు. కానీ, బిజెపి పార్టీలో సామాన్య కార్యకర్త కూడా రాష్ట్రానికి సిఎం, దేశానికి ప్రధానమంత్రి అవుతారన్నారు. టిఆర్‌ఎస్ పార్టీలో నా ఎదుగుదలను ఓర్వలేక నన్ను తుంచే ప్రయత్నం చేశారనీ, అదేగతి హరీష్‌రావుకు పడుతుందన్నారు. నేను ఆత్మ గౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయట పడ్డాననీ చెప్పారు. కుటుంబ పాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిసి కూకటి వేళ్లతో కూల్చాలని పిలుపునిచ్చారు. దీని కోసం ఆనాటి ఉద్యమం తరహాలో బాధ్యతను నేనే తీసుకుంటాననీ అన్నారు.
టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. సిఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో అణగారిన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మద్యం సేవించడంలో తెలంగాణ మొదట స్థానంలో ఉందనీ, ఈ ఏడాది 37వేల కోట్ల రూపాయల మద్యం అమ్మి ఆడబిడ్డల తాలి బొట్లు తెప్పేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. పేద ప్రజల గోస సిఎం కేసీఆర్‌కు కనబడటం లేదా?అని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్ అయ్యాక హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల విలువ గల భూములు అమ్మి పాలన చేస్తుందనీ ఆరోపించారు. 5500కోట్ల బడ్జెట్ బిసిల కోసం పెడితే ఇంత వరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండు చేశారు. రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఆలోచనలతో ఇక్కడ వోట్లు రాలవనీ కేసీఆర్ గ్రహించాలనీ, హుజూరాబాద్‌లో కూడా అనేక సలహాలు ఇచ్చాడనీ, ఎన్నికల ఇంఛార్జిగా ఉన్న మంత్రి హరీష్‌రావు 600కోట్ల రూపాయలు ఖర్చు చేశారనీ ఏమైందో ప్రజలందరికీ తెలుసుననీ అన్నారు. సామాన్యులకు అధికారం లేకుండా చేసిన దుర్మార్గ పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అని, దేశంలోనే ధర్మాన్ని చెరబట్టలనే చూసే ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అన్నారు. ధర్మం నిజమైతే వేల కోట్లు రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయే కేసీఆర్ చెప్పాలని డిమాండు చేశారు. దళితబంధు ఒక హుజురాబాద్‌లో మాత్రమే 10లక్షల రూపాయలు ఇస్తున్నారనీ రాష్ట్రంలో మరెక్కడా ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణ ప్రజలు తమ బాధల్ని గుండెల్లో పెట్టుకుని, సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ సమయం వచ్చినప్పుడు టిఆర్‌ఎస్ పార్టీ కర్రుకాల్చి వాత పెడతారన్నారు. బిసిలకు 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని సిఎం కేసీఆర్‌ను డిమాండు చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిఎం కేసీఆర్ డబ్బు సంచులు తీసుకొని ధర్మానికి, న్యాయానికి వోటు వేయాలని పిలుపునిచ్చారు.