‘అంతర్జాతీయ రసాయన ఆయుధాల సమావేశం’లో తీసుకున్న నిర్ణయాలు 29 ఏప్రిల్ 1997 నుంచి అమలులోకి వచ్చాయి. 11 నవంబర్ 2005న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 10వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఏటా 29 ఏప్రిల్ రోజున ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా రసాయన యుద్ధ క్షతగాత్రులకు సంఫీుభావాన్ని ప్రకటిస్తూ, ప్రాణాలు కోల్పోయిన మిలియన్ల ప్రజల ఆత్మశాంతికి ప్రార్థనలు చేయడం, విష రసాయనాల పట్ల అవగాహన, రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించాలనే ఉద్యమాలు చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల సభ్యత్వం కలిగిన 98 శాతం అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు ‘రసాయన ఆయుద్ధాల నిషేధ సంస్థ (ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, ఓపిసిడబ్ల్యూ)’ సూచనల ప్రకారం రసాయన ఆయుద్ధాలను నిషేధించాలనే విషయాలను మరోసారి పునరుద్ఘాటించడం జరుగుతుంది. ఓపిసిడబ్ల్యూ చొరవను గుర్తించిన నోబెల్ పురస్కార కమిటీ 2013లో ఆ సంస్థకు ‘నోబెల్ శాంతి బహుమతి’ని కూడా ప్రకటించడం ముదావహం. 30 నవంబర్ రోజున కూడా ‘రసాయన ఆయుద్ధ క్షతగార్తుల స్మారక దినం’ పాటించుట కొన్ని దేశాల్లో జరుగుతున్నదని గుర్తుంచుకోవాలి.
రసాయన ఆయుధాల వినియోగం:1914-18 మధ్య జరిగిన ప్రపంచ యుద్ధంలోనే విచక్షణారహితంగా రసాయన ఆయుద్ధాలను విరివిగా వినియోగించడం చరిత్రలో మరిచిపోలేని చీకటి కోణంగా నిలిచింది. ఈ మహా విపత్తులో లక్షకు పైగా మరణాలు, మిలియన్ల ప్రజలు గాయపడడం మరిచి పోలేని అమానవీయ దుర్ఘటనగా నిలిచింది. అదృష్టవశాత్తు 1939-45 మధ్య జరిగిన ప్రపంచ యుద్ధంలో ఎలాంటి రసాయన ఆయుధాలు వినియోగించక పోవడంతో అపార ఆస్థి ప్రాణ నష్టం నివారించినట్లు అయ్యింది. రసాయన ఆయుద్ధాలు సృష్టించే ఆస్థి ప్రాణ నష్టాలు, క్షతగాత్రుల రోదనలకు చలించిన అంతర్జాతీయ సమాజం 1993లో ‘రసాయన ఆయుధాల సమావేశం’ నిర్వహించి భవిష్యత్తులో రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
రసాయన ఆయుధాల వర్గీకరణ: ఓపిసిడ్ల్యూ నిర్వచనం ప్రకారం మానవాళి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు ప్రాణాలు సహితం హరించగల రసాయనాలను ‘రసాయన ఆయుధాలు’గా వర్గీకరిస్తారు. రసాయన ఆయుధాల్లో న్యూక్లియర్, బయలాజికల్, రేడియోలాజికల్, మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ అనబడే వర్గాలు ఉన్నాయి. మానవ శరీరంపై వాటి దుష్ప్రభావాన్ని బట్టి బ్లిస్టర్ ఏజంట్లు (ఫాస్పీన్ ఆక్జైమ్, లివిసైట్, మస్టర్డ్ గ్యాస్), నర్వ్ ఏజెంట్లు (సరిన్, సోమన్, తబున్), బ్లడ్ ఏజెంట్లు (సయనోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ సయనైడ్), ఛోకింగ్ ఏజెంట్లు (క్లోరోపిక్రిన్, ఫాసజీన్, క్లోరిన్), లాక్రిమేటరీ ఏజెంట్లు (టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే) లాంటి రసాయన ఆయుధాలు ఉన్నాయి. మానవ నిర్మిత ‘విఎక్స్’ అనే రసాయన ఆయుధం అత్యంత ప్రమాదకారి అని గుర్తించారు. వాయు/ద్రవ/ఘన రసాయన ఆయుధ వినియోగంతో మానవాళి మాత్రమే కాకుండా సకల జీవరాశి కూడా దుష్ప్రభావానికి గురి అవుతుంది.
రసాయన ఆయుధాల దుష్ప్రభావాలు: అమెరికా, ఉత్తర కొరియా లాంటి పలు దేశాల్లో నేటికీ రసాయన ఆయుధాల నిల్వలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రసాయన విషప్రభావానికి లోనైనపుడు చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, వాయునాళం లాంటి అవయవాలు దుష్ప్రభావానికి గురి అవుతాయి. రసాయన ఆయుధ విష ప్రభావంతో ఊపిరి సమస్య, ఉక్కిరిబిక్కిరి కావడం, స్పర్శ చికాకు, కేంద్ర నాడీ మండలానికి నష్టం, కళ్ళు/ముక్కులోంచి నీరు కారడం, రక్తంలోకి విష రసాయనాలు చేరడం లాంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమై చివరకు మరణం కూడా కలుగవచ్చు. రసాయన ఆయుధాలతో మానవాళి, జీవరాశులు మరియు పర్యావరణం కూడా ప్రభావితం అవడం వల్ల అపార దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది.
చైనా సంధించిన జీవ ఆయుధంగా భావిస్తున్న కరోనా మహమ్మారి వల్ల మానవాళి మాత్రమే భయపడిరది. రసాయన ఆయుధాల వల్ల మానవ జాతితో పాటు సమస్త జీవరాసులు, పర్యావరణం కూడా విష ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కరోనా వలె రసాయన ఆయుధాలకు కూడా పేద ధనిక విచక్షణలు లేవు. వాటి ముందు అందరూ సమానమే. ఇలాంటి అత్యంత ప్రమాదకర రసాయన ఆయుధాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సమస్త మానవ సమాజం ముక్తకంఠంతో కోరుతున్నది. విభేదాలను చర్చలతో, పట్టువిడుపులతో పరిష్కరించుకుంటూ, యుద్ధాలు లేని ప్రపంచాన్ని మానవీయ కోణంలో ప్రేమల పునాదుల మీద నిర్మించుకుందాం.
(నేడు ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’)
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి