యువ ధిక్కార గొంతుక, బర్రెలక్క

ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి. స్వేచ్చా, సమానత్వం, సౌబ్రాతృత్వం కోసం తన తుదిశ్వాస వరకూ కొట్లాడిన మహనీయుడు అంబేడ్కర్‌    విగ్రహాన్ని హైదరా బాద్‌ నడిబొట్టున నిలిపిన ప్రభుత్వం ఆయన స్ఫూర్తిని పాటించి తెలంగాణా యువత భావ ప్రకటన స్వేచ్చను గౌరవిస్తుందని పూర్తిగా విశ్వసిస్తూ… రాజకీయమంటే మేమే అని విర్రవీగుతూ ఏళ్లుగా అదే నియోజకవర్గంలో తిష్ట వేసుకొని పేదలపై పెత్తనం చేస్తున్న జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్‌ నేతల మీద పోటి చేసి తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది నిరుద్యోగ యువతి, బర్రెలక్క అనబడే శిరీష. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇయ్యాల దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం మొత్తం ఆమె తన ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారు అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అంతర్జాతీయ న్యాయ నిపుణులు కావేటి శ్రీనివాసరావు, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య వంటి మేధావులు పలువురు ఆమెకు ఇప్పటికే బహిరంగ మద్దతు తెలిపి ఆమె ప్రచారానికి వాహనాలు వంటివి సమాకూర్చి ఉన్నారు.

ఆమెకు తొలి దశలో నామినేషన్‌ వేసినప్పుడు పెద్దగా ఆదరణ రాకపోయినా నిర్భయంగా ముందుకు నడిచిన కారణంగా తర్వాత రోజుల్లో నిదానంగా మద్దతు పెరిగి వివిధ ప్రాంతాల నుంచి ఆమె పోటీ చేస్తున్న కొల్లాపూర్‌ వెళ్లి యువత, మేధావులు మరియు ప్రగతి శీల శక్తులు పెద్ద మొత్తంలో నేరుగా మద్దతిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ నేను ఈ వ్యాసం రాయడానికి నన్ను కొన్ని విషయాలు బలంగా పురిగొల్పినాయి. ముందుగా పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో నిరసన చేయడానికి ఆమె ఎంచుకున్న పద్ధతి. బర్రెలు కాస్తూ ఆమె మాట్లాడిన కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఆ దృశ్యం సామజిక మధ్యమాల్లో అత్యంత వేగంగా విస్తృత ప్రచారాన్ని పొంది నిరుద్యోగ తెలంగాణా యువత నిరాశకు ఒక ప్రతిఘటనా ప్రతిబింబంగా మారింది. ఆమె సామజిక మధ్యమాల్లో పెట్టిన దృశ్యం చూసి మనమందరం సంతోషపడ్డం కానీ ఆమె ఆ తర్వాత కేసుల కారణంగా భయంకరమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నది. అధికార పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, దాడులు చేసినా, డబ్బు ఆశ చూపించినా ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నది. బహుశా ఆమె బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో చెప్పినట్టు రౌడీ రాజకీయాలు ఉంటాయని చిన్నప్పుడు తన తాత చెప్పిన మాటలు పెద్దయ్యాక నేడు చేదు నిజాలై కళ్ళ ముందే కనిపించేసరికి పెద్దగా భయం అనిపించడం లేదేమో. సక్కగ సదువుకోకుండ ఈ రాజకీయాలు ఆమెకెందుకు అంటూ విడ్డూరించే వాళ్ళు, పెదవి విరిచే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యం అనిపించే అంశం ఏమిటంటే యువత రాజకీయాలు తప్ప అన్ని విషయాల మీద మాట్లాడుతున్నరు. మన జీవితాల్ని ప్రభావితం చేసే అంశాల మీద మనం నోరు విప్పి మాట్లాడకపోతే, అదీ యువత మాట్లాడకపోతే ఆ సమాజం నిద్రావస్థలో ఉన్నట్టు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకపోతే మన ఉనికి ప్రశ్నర్ధకమేనని అంబెడ్కర్‌ మహాశయుడు అంటాడు. మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడుతుంది కాబట్టి తెలంగాణ సమాజం బర్రెలక్కని నిండు మనసుతో అభినందించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం చేయవలసిన పనులను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఆ పనుల్ని చేయడంలో విఫలమైతే సూటిగా ప్రశ్నించే హక్కు ప్రజలకు భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది.

ఇదే విషయాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు తన తీర్పుల్లో స్పష్టకరించి ఉన్నది. ఇంత స్పష్టంగా చట్టాల్లో చెప్పి ఉన్నా ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని స్వేచ్చగా వ్యక్త పరిచ్చినప్పుడు కేసులు పెట్టడం, ఎన్నికల్లో స్వతంత్య్రంగా పోటీ చేసినప్పుడు దాడులు జరగడం వంటివి ఎందుకు జరుగుతున్నయన్నదే ప్రశ్న. వీటన్నంటికి ఎన్నో సామాజిక, రాజకీయ కారణాలున్నాయి. భయంకరమైన రాజకీయ అవినీతి, విచ్చలవిడి దోపిడీ, బంధుప్రీతీ, వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు వంటివి కొన్ని కారణాలు. నామినేషన్‌ వేయడానికి ప్రయత్నిస్తే బర్రెలక్కని తిప్పలు పెట్టడం, ప్రచారానికి అనుమతి లభించకుండా బాధ పెట్టడం , తన తమ్ముని మీద దాడి చేయడం వంటి అంశాలకు మూలాలు నేను పైన ఇచ్చిన కారణాల్లో ఉన్నాయి. ఎన్నికలు వొస్తాయి, ప్రభుత్వాలు మారుతాయి, అలాగే ప్రజల కష్టాలు ఎప్పటికి అలాగే ఉంటాయి అన్నది జీర్ణించుకోలేని చేదు నిజం. కానీ ప్రభుత్వం మీద, పాలకుల మీద జాగురుకులు అయిన ప్రజలు వ్యక్తపరచే నిరసనలే ఆయా ప్రభుత్వాల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసేలా చేస్తాయి.

అలా తెలంగాణా పౌరురాలిగా తన నిరసనని నిరుద్యోగ సమస్య మీద వ్యంగ్యంగా ఒక వీడియో ద్వారా వ్యక్త పరచి తెలంగాణా యువతకు ఒక రోల్‌ మోడల్‌ గా ఆమె నిలిచింది బర్రెలక్క. ఏదో కాలక్షేపం కోసం నామినేషన్‌ వేసిందని మనం ఒక తీర్పు చేస్తే పొరబడ్డట్టే. నిరుద్యోగం, ప్రవేటు వ్యవస్థలో పని గంటలు సరిగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు వంటి అంశాల మీద ఆమె మాట్లాడుతుంటే రాజకీయాల్లో అవకాశామిస్తే యువత ఎంత శక్తివంతులో చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక్కడ బర్రెలక్క గెలుస్తుందా లేదా అన్నది అసలు మనకి చర్చ అవసరం లేదు . విషయం ఏమిటంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత స్వేచ్చగా తమ రాజకీయ హక్కుల్ని వినియోగించుకోవడం, ఆయా ప్రభుత్వాలు బాధ్యతగా వాటిని కాపాడడం. తెలంగాణా పోటీ పరిక్షల పేపర్లు లీకై నిరుద్యోగ యువత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది నూటికి నూరు శాతం నిజం. ప్రజాస్వామ్యమంటే ‘‘నూరు పువ్వులు వికసించి వెయ్యి ఆలోచనలు సంఘర్శించే’’ స్ఫూర్తితో నడవాలి. స్వేచ్చా, సమానత్వం, సౌబ్రాతృత్వం కోసం తన తుదిశ్వాస వరకూ కొట్లాడిన మహనీయుడు అంబేడ్కర్‌    విగ్రహాన్ని హైదరాబాద్‌ నడిబొట్టున నిలిపిన ప్రభుత్వం ఆయన స్ఫూర్తిని పాటించి తెలంగాణా యువత భావ ప్రకటన స్వేచ్చను గౌరవిస్తుందని పూర్తిగా విశ్వసిస్తూ జై బర్రెలక్క, జై తెలంగాణా.

-పిల్లుట్ల నాగఫణి,
సామజిక విశ్లేషకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *