ఎంతకాలమీ సంఘర్షణ?ఎంతకాలమీ అశాంతి? అలజడులతో అశాంతిని సృష్టించి, సాధించే దేమిటి? యుద్ధాల వలన ఒరిగే దేమిటి? ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు నేర్పిన గుణపాఠం ఏమిటి? ప్రజలు ఆమోదించని యుద్ధాలను పాలకులు ప్రజల నెత్తిన రుద్ధుతున్నారెందుకు? అహం వలన, ఆధిపత్య భావజాలం వలన పుట్టుకొస్తున్న యుద్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాలు కుప్పకూలుతున్నాయి. అయినా కొన్ని దేశాలకు యుద్ధాల జాఢ్యం పట్టుకున్నది. ప్రజలతో సంబంధం లేకుండా,ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి,కేవలం అహంకార మదంతో, చెలరేగి పోయి, పీనుగుల గుట్టల్లో, కుప్పకూలిన ఆకాశ హర్మ్యాల శిధిలాల్లో,ఆకలి కేకల్లో, రుధిర ధారల్లో విజయాన్ని ఆస్వాదించడం ఒక తీవ్రమైన మానసిక ఉన్మాదం.యుద్ధకాంక్ష ఒక ఉన్మాదం వంటిది.
యుద్ధాల వలన వినాశనమే తప్ప ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు. గతించిన చరిత్ర గాయాల నుండి గుణపాఠాలు నేర్వకుండా వివిధ దేశాలు అహంకారంతో యుద్ధమేఘాలను సృష్టించి ప్రజలను భయోత్పాతానికి గురిచేయడం క్షంతవ్యం కాదు. చిరు చినుకులే పెనువానగా మారి, మహాప్రళయానికి దారితీసినట్టు వివిధ దేశాల మధ్య నెలకొన్న చిన్న చిన్న తగాదాలు యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడడం ఆందోళనకరం. గతమంతా రుధిరంతో తడిసిన నేలంతా యుద్ధాల వలన కలిగే విలయాలకు సాక్షీభూతం. అయినప్పటికీ యుద్ధం వైపే మానవ పయనం మరుభూమికి మరో దారి. ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ, హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాను ముట్టడించడం, అనేక మంది ప్రజలు మరణించడం జరిగింది. ఇప్పటికీ గాజా లో రావణ కాష్ఠం చల్లారలేదు. అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ ల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నయి. ఇరాన్ కు ఇజ్రాయిల్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయిల్ కొమ్ము కాస్తున్నది. భారత దేశం ,ఇజ్రాయిల్ మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. ఇజ్రాయిల్ భారత దేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని భారత్ ఖండించింది. పాలస్తీనా విషయంలో భారత్ గత ప్రభుత్వ విధానాలను త్రోసి పుచ్చి ఇజ్రాయిల్ కు మద్ధతుగా నిలిచిన నేపథ్యంలో ఇరాన్ విషయంలో భారత్ ను కట్టడి చేయాలను కోవడం సముచితం కాదు. ఇజ్రాయిల్- ఇరాన్ లు తమ మధ్య గల విబేధాలను పరిష్కరించుకోవాలి.
అవసరమైతే అమెరికా మధ్య వర్తిత్వం నిర్వహించుకోవచ్చు. అంతే కాని సంబంధం లేని సమస్యలను భారత్ కు ముడి పెట్టి, ఇండో- ఇరాన్ సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. భారత్ కు అత్యంత ప్రధానమైన చాబహార్ పోర్టు విషయంలో అమెరికా కొర్రీలు పెడుతున్నది. ఒక వైపు చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ ను అన్ని రకాలుగా దెబ్భతీయడానికి ప్రయత్నిస్తుంటే, భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా ఇరాన్ తో గల భారత మైత్రిని త్రుంచడానికి అమెరికా కుటిల యత్నాలు చేయడం క్షంతవ్యం కాదు. తమకు నచ్చిన దేశాలను నెత్తి మీద పెట్టుకోవడం, తమ మాట వినని దేశాలను నాశనం చేయడం అమెరికా నైజం. పెద్దన్నగా పిలవబడుతూ బుద్ధి లేని పనులు చేస్తూ, ప్రపంచాన్ని నిరంతరం అశాంతిలో ముంచెత్తడం అమెరికా నైజం. ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెట్టడం అమెరికాకు కొత్తేమీ కాదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్దం అమెరికా కారణం గానే సుదీర్ఘ కాలం కొనసాగుతున్నది. ఆయుధ,ఆర్ధిక సహాయంతో రష్యా పైకి ఉక్రెయిన్ ను అమెరికా ఎగదోయడం వలనే ఈ యుద్ధం ముగియడం లేదు. గతంలో ఇరాన్, ఇరాక్ దేశాలకు వివిధ రకాలుగా సహాయం చేసి, చివరకు ఇరాక్ కువైట్ ను ఆక్రమించడంతో ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని, ఇరాక్ ను సర్వనాశనం చేసిన చరిత్ర అమెరికాదే. అప్పట్లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడానికి గోర్భచేవ్ సంస్కరణలు కొంత కారణమైతే, గోర్భచేవ్ ను నోబెల్ శాంతి బహుమతి ద్వారా శాంతి కాముకునిగా మార్చి, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి అమెరికా ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసింది. సోవియట్ యూనియన్ చిన్న చిన్న స్వతంత్ర దేశాలుగా విడిపోయినా రష్యా ఈనాటికీ ఆయుధ సంపత్తిలో అమెరికాను ఢీకొట్టే స్థాయిలో ఉండడం, ఉక్రెయిన్ అనేక సహజ వనరులతో ఆర్ధికంగా బలంగా ఉండడంతో ఉక్రెయిన్ పై రష్యా శతృత్వాన్ని అదనుగా తీసుకుని, ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చి, రష్యా కు కోపాన్ని రగిలించింది.

ఉక్రెయిన్- రష్యా ల మధ్య రగిలిన రుధిర జ్వాలల్లో చలికాచుకుంటున్న అమెరికా విషయంలో ప్రపంచ దేశాలు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నాయి. ఆప్ఘన్ విషయంలో అమెరికా ఆపద్భాంధవుని పాత్ర పోషించి, తాలిబాన్ల నుండి ఆప్ఘన్ ప్రజలను కాపాడుతున్నామన్న భ్రమ కల్పించి, ఆప్ఘన్ ప్రజలను అభివృద్ది పనులతో మెప్పించి, రక్షణ స్థావరాలు ఏర్పరచి, విద్య,వైద్య సౌకర్యాలను కల్పించి, ఆప్ఘన్ లో ఆర్థిక వనరులను దోపిడీ చేసి, చివరకు ఆఫ్గనిస్తాన్ ను తిరిగి తాలిబాన్ల చేతికి అప్పగించి,పలాయనం చిత్తగించిన అమెరికాను నమ్మడం శ్రేయస్కరం కాదు. ప్రపంచంలో కమ్యూనిజం అంతం కావడానికి అమెరికా కారణం కాదా? కమ్యూనిస్టు ప్రభుత్వాలను కూలదోయడంలో అమెరికా తీవ్ర కృషి చేసిన మాట సత్యం దూరం కాదు. ఇక చైనా కూడా పాక్ కు వత్తాసు పలుకుతూ, భారత్ ను అస్థిరతకు గురిచేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది.ప్రస్తుతం భారత్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న మొండి వైఖరి ఆక్షేపణీయం.ఇరుదేశాల నడుమ యుద్ధం గనుక సంభవిస్తే కలగబోయే విపత్కర పరిణామాలు కేవలం ఇరుదేశాలకే కాదు యావత్ప్రపంచ మానవాళి మనుగడకే శరాఘాతం.1956 నుంచి భారత్, చైనాల మధ్య సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి. టిబెట్ లో సంక్షోభ పరిస్థితులు, చైనా చర్యల పట్ల భారత్ ఆందోళనకు గురికావడం, భారతదేశం దలైలామాకు ఆశ్రయమివ్వడం వంటి చర్యల వలన చైనా ఆగ్రహించడం లోకవిదితమే.1962 లో చైనా భారత్ పై యుద్దానికి దిగడం వంటి చర్యల ద్వారా భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. “హిందీ- చీనీ” భాయ్ భాయ్ “బైబై” వరకు వచ్చింది.టిబెట్ పై దాడిచేసి తమ ఆధీనంలో కి తెచ్చుకున్న చైనా అంతటితో ఆగలేదు.భారత్ భూభాగంలో కూడా చైనా ఆక్రమణలు మొదలెట్టింది.ప్రపంచమంతా భారత సరిహద్దును అంగీకరించిందని నమ్మిన భారత్ కు చైనా అతిక్రమణలు బాధించాయి.
“కర్ర ఉన్న వాడిదే బర్రె” అనే సంగతిని భారత్ మరచిపోవడం,చైనాను గుడ్డిగా నమ్మడం వలన భారత్ భారీ గా నష్టపోయింది. ప్రజాస్వామ్య బద్ధంగా,నైతిక సూత్రాలతో,శాంతి వచనాలతో మనుగడ సాగించే భారత్ కు, నియంతృత్వ పోకడలతో రెచ్చిపోయే చైనాకు మధ్య సారూప్యతను ఊహించుకోవడం హాస్యాస్పదం బలవంతంగా ఇతర ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనాకు, రాజులను అంతం చేయకుండా రాజ్యాలను అంతం చేసిన భారత్ శాంతి యుత విధానాలకు హస్తిమశకాంతమంత వ్యత్యాసముంది.భారత్,చైనా ల మధ్య కుదిరిన పంచశీల ఒప్పందానికి ఏడు పదుల వయసు దాటింది. చైనాతో సత్సంబంధాలు మాత్రం నెలకొనలేదు.భారత్-చైనా ల మధ్య సరిహద్దు రేఖ “వాస్తవాధీన రేఖ” (ఎల్.ఎ.సి)ను చైనా గౌరవించదు.చైనా కన్ను సియాచిన్ గ్లేసియర్ పై ఉంది. లఢఖ్ లో కవ్వింపు చర్యలు అడపాదడపా కొనసాగుతూనే ఉంటున్నాయి. ఇక మిగిలిన విషయాని కొస్తే డోక్లాంలో చైనా రహదారి నిర్మించడం,భారత్ భూటాన్ కు మద్దతు నీయడం వంటి పరిణామాలు భారత్-చైనా ల మధ్య వైరానికి అగ్నికి ఆజ్యం పోసిన చందంగా తయారైనాయి.భారత ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ, చికెన్ నెక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నదనే అరోపణ అక్షరసత్యం. డోక్లాం చుట్టూ టిబెట్ యొక్క చుంబి లోయ, భూటాన్ యొక్క హా లోయ మరియు భారత్ కు చెందిన సిక్కిం ఉన్నాయి.తన దేశ భూభాగాన్ని కాపాడుకోవడమే భారత్ లక్ష్యం. భూటాన్,చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం గా మారిన డోక్లాం వద్ద చైనా రహదారి నిర్మాణం పట్ల భారత్ అభ్యంతరం చెబుతూ భూటాన్ ను సమర్ధించడం చైనాకు కంటగింపుగా మారింది.ఇండియా,భూటాన్ చైనా ల మధ్య ట్రైజంక్షన్ డోక్లాం.సిలిగురి కారిడారు ను “చికెన్ నెక్” అంటారు.డోక్లాం వ్యూహాత్మకంగా సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉంది.ఇది భారతదేశాన్ని ఈశాన్య ప్రాంతంతో కలుపుతుంది.” భారత దేశం లోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన దేశంతో కలిపే “చికెన్ నెక్” పై చైనా ఆధిపత్యం భారత దేశ సమగ్రతకు భంగకరం. అందువలనే భారత్ చైనా పట్ల కఠిన వైఖరి అవలంభిస్తున్నది.ఈశాన్య రాష్ట్రాలను కబళించాలనే ఆలోచన చైనాలో కలగడం ఆందోళన కలిగించే విషయం.
అరుణాచల్ ప్రదేశ్ పై “డ్రాగన్” కన్ను పడింది.చైనా- మ్యాన్మార్, ఇండియా చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి.భారతదేశానికి- ఇతర దేశాలకు విదేశాంగ విధానాల్లో చాలా వ్యత్యాసముంది. అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండడం కూడా భారత్ కు ప్రపంచంలో విశ్వసనీయత సంపాదించి పెట్టింది.అదే సందర్భంలో భారత దేశ శాంతి వచనాలు పరాయి పాలకులు అసమర్ధతగా భావించారు. అయితే క్రమేపీ భారత దేశం కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి, దూకుడుగా ముందుకు సాగడం హర్షదాయకం. చైనా పై దలైలామా పోరాటం చేయడం, విఫలం కావడం శరణార్ధిగా దలైలామా భారత్ కు రావడం చైనాకు నచ్చ లేదు.టిబెట్ తో పాటు అరుణాచల ప్రదేశ్ కూడా తమదే నంటూ చైనా ఆరోపించడాన్ని భారత్ ఎప్పటికప్పుడు త్రిప్పికొడుతూనే ఉంది. ఒకప్పుడు టిబెట్ స్వతంత్ర రాజ్యం. తర్వాత చైనా ఆధ్వర్వంలో ని స్వయం ప్రతిపత్తిగల ప్రాంతంగా మారింది.ఆప్ఘన్ లోని తాలిబన్ మాదిరిగా చైనా కూడా భౌద్దారామాలను ధ్వంసం చేసింది. భారత దేశానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇతర దేశాల వల్ల పీడించబడ్డ వారికి ఆశ్రయం కల్పించిన నేపథ్యం ఉంది. దలైలామాకు ఆశ్రయం కల్పించడం కూడా ఇందులో భాగమే. బంగ్లాదేశ్ విమోచనలో కీలక భూమిక పోషించడంలోను, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడంలోను,అప్పటి పాలస్తీనా నాయకుడు దివంగత యాసర్ అరాఫత్ కు మద్ధతు నివ్వడం లోను, ఎల్.టి.టి.ఇ దాడుల నుండి శ్రీలంకను కాపాడంలోను భారత దేశం పోషించిన పాత్ర శ్లాఘనీయం.
మన దేశ ప్రయోజనాలను సైతం ప్రక్కనబెట్టి, బలహీన దేశాల పట్ల భారతదేశం చూపించిన ఔదార్యం చరిత్రకు అందని త్యాగాల సమాహారం. భారతదేశం అణ్యస్త్ర దేశమైనప్పటికీ, మొదటగా తాను ఏదేశం పైనా అణ్యస్త్రాలను ప్రయోగించబోనని భారత్ స్వీయ నియంత్రణ విధించుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ అడుగడుగునా భారత్ భద్రతకు ముప్పుగా మారిన పాకిస్తాన్ తో ఎన్నో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంది. పాక్ పాలకులు అన్ని ఒప్పందాలను కాలరాస్తూ భారత్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పంజాబ్, కాశ్మీర్ లలో పాక్ దురాగతాలను చరిత్ర మరవదు. కాశ్మీర్ యువతను రెచ్చగొట్టి, భారత్ పై విద్వేషాలను రెచ్చగొట్టడం,జిహాద్ పేరుతో ఉగ్రవాదులను తయారు చేసి, ప్రజల ధన,మాన,ప్రాణాలతో చెలగాటమాడిన పాక్ కు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో సరైన గుణపాఠాలే నేర్పింది. భారత దేశ సమగ్రతకు ముప్పుగా మారిన పొరుగు దేశాలను నిలువరించడానికి భారత్ వ్యూహాత్మక రక్షణ చర్యలు చేపట్టాలి.
సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్, కాలమిస్ట్)
తూ.గో.జిల్లా
ఆంధ్రప్రదేశ్
మొ:9704903463





