- నివాస యోగ్య ప్రాంతంగా ముందు వరసలో సిటీ
- కాల్ అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయ ప్రారంభంలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్ అగ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వొచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్ అతిపెద్ద సెంటర్ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
కాల్ అవే గోల్ఫ్ సంస్థ రెండో కార్యాలయం కోసం.. తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషమన్నారు. మౌలిక సదుపాయాల్లో దేశంలోని అన్ని నగరాల కంటే..హైదరాబాద్ ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికా తర్వాత చాలా చర్చల అనంతరం ఇండియాలో కార్యాలయం పెట్టాలనుకున్నామని కాల్ అవే సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కూరపాటి తెలిపారు. హైదరాబాద్‌లో మంచి సౌకర్యాలున్నాయని తెలుసుకుని ఇక్కడే ఈ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇక్కడి సదుపాయాలు చూసిన తర్వాత భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే సూచన కనిపిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఐటి సెక్రటరీ జయేష్ రంజన్, కాల్ అవే సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.