- దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది
- ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు మండిపాటు
- తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను రాజగోపాల్ పేట చెరువులో ముంచాలని ప్రజలకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మోసేటోళ్లకు బరువు..పని చేసేటోళ్లకు విలువ తెలుస్తదని, దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తదని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై హరీశ్ రావు మండిపడ్డారు. మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2016 పెంచి పేద లబ్ధిదారులకు అందిస్తున్నారని మంత్రి చెప్పారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన హైజరై 1117 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…నంగునూరు మండలంలో గతంలో 6975 పింఛన్లు ఉండేవని, కొత్తగా 1117 మందికి ఇస్తున్నాన్నామని, మొత్తంగా 8092 ఆసరా పింఛన్లు మంజూరు చేశామని అన్నారు. పించను టీడీపీ హయాంలో 75 రూపాయలు ఉండేదని, ఎవరైనా మృతి చెందితేనే మరొకరికి పింఛన్లు వొచ్చేవనీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ.200 మాత్రమే ఉండగా..కొంతమందికే పింఛన్లు వొచ్చేవనీ, కానీ సీఎం కేసీఆర్ 200 రూపాయల పింఛన్‌ను రూ.2016 రూపాయలు పెంచారని మంత్రి వెల్లడించారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉండేదో.. నేటి టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా మారిందో..ఒక్కొక్కటిగా వివరిస్తూ…టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న అంశాలను సవివరంగా మంత్రి వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నీళ్ల కోసం చాలా కష్టం ఉండేదనీ, బోరు పొక్కలకే మన కష్టం అంత పోయిందని, కానీ సీఎం కేసీఆర్ అపర భగీరథునిగా ఉండటంతో గోదావరి నీళ్లు మనకు వొచ్చాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. యాసంగిలోనూ బోరు బండ్లు కనిపిస్తలేవని, బోర్లు వెళ్లబోయబట్టెనని..ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యంగా మంత్రి చెప్పుకొచ్చారు. వరి నాట్లు వేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మనుషులు వొచ్చి వేస్తున్నారని, లారీలలో వడ్లు ఎక్కియ్యడానికి బీహార్ హమాలీలు వొస్తున్నారని అన్నారు. దేశంలో 16 చోట్ల దిల్లీ బీజేపీ డబుల్ ఇంజన్ అంటున్నారని, ఎక్కడైనా రూ.2వేల పింఛన్, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా..? ఇస్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిన్నరేవు తలవాలని..సీఎం కేసీఆర్ సారుకు చల్లని దీవెనలు ఇవ్వాలని మంత్రి హరీష్ ప్రజలను కోరారు.




