తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆహ్వానించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనక పోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస మర్యాదను కూడా పాటించడం లేదని ఆయన విరుచుకు పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. 29 సంవత్సరాల తర్వాత ఒక ప్రధాని ఓరుగల్లు పట్టణానికి వొస్తుంటే ఆయనను కలుసుకోకుండా బహిష్కరించడం ఎంతవరకు సమంజసమన్నారు. బహిష్కరించడానికి బలమైన కారణమేంటన్నది ప్రజలకు చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నందుకు బహిష్కరిస్తున్నట్లా అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాంతంలో విస్తారమైన జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేస్తున్నందుకా లేక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించినందుకా, రాష్ట్రం నుండి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రేన్‌లను ప్రారంభించినందుకు బైకాట్ చేశారా అని నరేంద్ర మోదీ ఉన్న వేదిక పైనుండే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అలాగే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు మోదీ వొస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, మంత్రులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మోదీ మోసం చేయలేదని, నిరుద్యోగ భృతి ఇస్తానని యువకులకు ముఖం చాటెయ్యలేదని, మతోన్మాద ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగలేదని, ముప్పై వేల మంది యువకుల ఉపాధి విషయంలో పెట్టిన పరీక్షల్లో అవినీతి, అక్రమాలు బయట పడినందుకు ఆయన ముఖం చాటేసుకోవాలా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని ఇవ్వకపోవడం, వారికి రుణమాఫీ చేయకపోవడం లాంటి కారణాలతో ముఖ్యమంత్రి ముఖం చాటేసుకోవాలె కాని మోదీ కాదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను ఫాం హౌజ్‌కే పరిమితం చేయడం ఖాయమన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వోటేస్తే సంక్షేమ పథకాలన్ని నిలిచిపోతాయని ఆయన హెచ్చరించారు. అందుకే కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత తన ఎదుగుదలకు బిజెపి పార్టీ తోడ్పాటు నందించిందని, దానికి ఎల్లప్పుడు కృతజ్ఞతగానే ఉంటానని, భద్రకాళి సాక్షిగా బిజెపిని అధికారంలోకి తీసుకొస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.




