మేడారం జాతర : ఆదివాసీ..వనవాసీ విముక్తి పోరాట చరిత్ర!

వీరోచిత తిరుగుబాటుకే కాదు… గొప్ప సంకల్ప బలానికి ప్రతీక! 

‘‘మేడారం జాతర అంటే రాజరిక వ్యవస్థపై విముక్తి కోసం సాగిన వీరోచిత తిరుగుబాటుకే కాదు. గొప్ప సంకల్ప బలానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రెండేళ్లకోమారు జరిగే  ఈ జాతరలో సమ్మక్క-సారక్కలను స్మరించి సంకల్పం పూనుతుంటారు. ప్రకృతి ఆరాధన కనిపించే ఈ జాతరలో ఎక్కడా విగ్రహారాధాన కన్పించక పోవడం ఈ జాతర ప్రత్యేకత. వైదిక సంస్కృతికి భిన్నంగా అరణ్య గర్భంలో జనంతో సాగే జన జాతర’’

ధర్మానంద దామోదర కోశాంబి -డి.డి. కోశాంబి మాటల్లో చెప్పాలంటే చరిత్ర అంటే రాజులు, రాజ్యాలే కాదు మానవ జీవితాలను మలుపు తిప్పిన పరిణామాలం టారాయన. దండకారణ్యంలో  ఈ రోజు మనం స్మరించుకుంటున్న  వన వాసి వీరవనితల  వీరోచిత పోరాట గాధ శతాబ్దాల కాలం నాటి నుండి ముందు తరాల వారికి అందిన మౌఖిక సాహిత్యం. పౌరాణిక గాధల నుండి చరిత్రను అర్దం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు డి.డి. కోశాంబి. సాహిత్య, పురావస్తు ఆధారాలు చరిత్ర పరిశోధనకు మూలాధారాలు. పౌరాణిక సాహిత్యం నుండి మనకు తరతరాలుగా లభించిన చరిత్రే మేడారం జాతర చరిత్ర. రాచరికంపై తిరుబగుబాటు చేసిన  అలిఖిత ఆదివాసి పోరాట చరిత్ర. ఈ దేశంలో మనకు మననంలో ఉన్న  ఆదివాసీల పోరాటాలన్నింటికి ముందు నాటి ఆదివాసీ వనవాసీ విముక్తి పోరాట చరిత్ర.  ప్రజలు లేకుండా రాజులు రాజ్యాలు లేనట్లే పన్నులు, సుంకాలు విధించి వాటికోసం పీడిరచని ఏ రాచరిక వ్యవస్థ లేదు. ఆదివాసి  రాజ్యంపై కాకతీయ సామ్రాజ్యాధి నేతల  ఆధిపత్యాన్ని ధిక్కరించి తుడుం కొట్టి బాణం ఎక్కుపెట్టిన తిరుగుబాటు చరిత్రే మేడారం నేపద్యం. ఈ పోరాటంలో సమ్మక్క – సారక్క వారి పరివారం సాగించిన వీరోచిత గాధల స్మరింపు శతాభ్దాల కాలం నుండి ఇంకా జనబాహుళ్యంలో నానుతున్నా చరిత్ర పుటల్లో స్థానం కల్పంచక పోవడం పాలకులతో పాటు  చరిత్రకారుల వైపల్యం. సమాజం పొరల్లో భద్రంగా నిలిచి పోయిన ఆదివాసి వీరవనితల చరిత్ర అక్షర రూపం దాల్చక పోయినా జనం జ్ఞాపకాల్లో చెరగని ముద్రగా మిగిలింది.

దేశంలో ఆదివాసి పోరాటాలకు స్పూర్తి
మేడారం స్థలం పురాణం,నమ్మకాలు, విశ్వాసాలు కాల క్రమ రూపాంతరాలు అనేకం జనబాహుళ్యంలో భిన్నంగా ఉన్నా  బ్రిటీష్‌ పాలనకు ముందు నాటి  రాచరిక వ్యవస్థలో ఈ దేశంలో  జరిగిన ఆదివాసీల తిరుగుబాటుగా చెప్పవచ్చు.  బ్రిటిష్‌ పరిపాలనా కాలం నుండి జరిగిన అనేక ఆదివాసీ తిరుగుబాట్లకు పోరాటాలు చరిత్రలో నమోదయ్యాయి. కాని అంతకు ముందే12 వ శతాబ్ద కాలంలో కాకతీయల కాలంలో జరిగిన  సమ్మక్క- సారక్క ఆదివాసీల తిరుగుబాటును  చరిత్ర కెక్కించలేక పోయారు. గోండు రాజ్యంలో కరవు కాటకాలతో తల్లిడిల్లుతున్నామని కాకతీయ రాజులకు కప్పం  కట్టలేమని తిరుగుబాటు ప్రకటించిన చరిత్ర సమ్మక్క -సారక్కలది. ఆదివాసీల  స్చేఛ్ఛా  వాయువుల కోసం రాచరిక పాలనపై  బాణం ఎక్కు పెట్టారు. ఈ పోరాటంలో వీరమరణం పొందిన వారిస్మృత్యర్థం జరిగే జాతరే ఈ మేడారం జాతర. వీరి పోరాటం దేశంలో అనేక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా లెక్కలేనన్ని గిరిజనుల పోరాటాలు జరిగాయి.  పాలకులు ఎవరైనా కావచ్చు తమ ఉనికికి స్వేచ్ఛకు భంగం కలిగినపుడల్లా గిరిజనుల పోరాటాలు జరిగాయి.

 సంతాల్‌ల తిరుగుబాటు
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసి తెగలైన సంతాల్‌ లు బీహార్‌, బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలలో 1811, 1823, 1829లో తిరుగుబాట్లు చేశారు. బ్రిటీష్‌ పాలనకు ముందు ఈస్టిండియా కంపెనీకి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక సార్లు అనేక సంవత్సరాల పాటు పోరాటాలు చేసారు. జార?ండ్‌, పశ్చిమ బెంగాల్‌ లో 1855 లో సంతాల్‌ తెగ ఆదివాసీలు సాయుధ తిరుగు బాటు చేసారు. పదిసంవత్సరాల పాటు వారి పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్లు బ్రిటిష్‌ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన కన్హూ 1856 ఫిబ్రవరిలో సైన్యం చేతిలో మరణించాడు.1880 లో చత్తీశ్‌ ఘడ్‌ బస్తర్‌  ప్రాంతంలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా  తిరిగుబాటు చేసారు. బీహార్‌ లో ముండా గిరిజనుల తిరుగుబాటు కూడ దాదాపుగా అదే కాలంలో జరిగింది. నూనూగు మీసాల యవ్వనంలో ఉన్న  బిర్సాముండా ఈ పోరాటానికి 22 ఏళ్ల వయసులో నాయకత్వం వహించాడు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ సైనికులతో విరామం లేకుండా పోరాటం చేసారు. పాతికేళ్ల వయస్సులో  బిర్సా ముండా ను భందించి చెరసాలలో పెట్టివిష ప్రయోగం చేసి చంపేసారు.

దండకారణ్యంలో నిజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా కొమురం నాయకత్వంలో గోండుల తిరుగుబాటుకు జరిగింది. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదాలతో కొమురం భీం గొండులను, కొలాములను ఏకం చేసి నిజాం సర్కార్‌ పై సాంప్రదాయ ఆయుధాలతో సాయుధ పోరాటం చేసారు. కొమురం భీం తండ్రిని చిన్నూను 15 ఏళ్ల వయసులో నిజాం అటవి శాఖ సిబ్బంది దాడి చేసి చంపారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు కొమురం భీం, జమీందార్లతో, నిజాంతో సాయుధ పోరాటం చేశారు. 1940 అక్టోబర్‌ 27 న జోడేఘాట్‌ అడవుల్లో కొమురం భీమ్‌ స్థావరాన్ని ముట్టడిరచి చంపేసారు. మద్రాస్‌ రెసిడెన్సీలో ఉన్న  మన్యం ఏజెన్సి ప్రాంతంలో అల్లూరి సీతారామా రాజు నాయకత్వంలో 1922 ప్రాంతంలో గెరిల్లా పద్దతిలో పోరాటం చేసారు. సీతారామ రాజును 1924 మే 7న కాల్చి చంపారు. నాయకత్వం వహించిన అనేక మంది మన్యం వీరులను కాల్చి చంపి పోరాటాన్ని అణిచి వేశారు.  దేశ వ్యాప్తంగా ఆదివాసుల తిరుగుబాట్లు పోరాటాలు అన్ని  ఒకే లక్ష్యంతో జరిగాయి. బానిసత్వానికి, వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా జల్‌,జంగల్‌, జమీన్‌ కోసం సాగిన విముక్తి పోరాటాలు. దేశ వ్యాప్తంగా ఉన్న  ఆదివాసీలు ఈ దేశ మూల వాసులు ఇప్పటికి పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా స్చేచ్చకోసం  పోరాడుతున్నారు.  రాజ్యంగ పరంగా ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాల పరిరక్షణకోసం చేసిన చట్టాలు నిర్వీర్యం చేసారు.

దండకారణ్యంలో ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్‌ ఘడ్‌, ఒరిస్సాలో వనరులు అన్ని ఆదివాసీలు నివసించే క్రీకారణ్యాలలో భూగర్భంలో   నిక్షేపమై ఉన్నాయి. వాటిని వెలికి తీసి తరలించుకు పోయేందుకు  జరుగుతున్న ప్రయత్నాలను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చత్తీస్‌ ఘడ్‌ లో  గిరిజనులు ఏకంగా జనతన సర్కార్‌ ఏర్పాటు చేసి సమాంతర పాలన సాగిస్తున్నారు. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట ఆదివాసీల ప్రాంతాలను వశ పరుచుకునేందుకు ప్రభుత్వం తీవ్రాతి తీవ్రమైన అణిచివేతకు పాల్పడుతోంది. వేలాది మంది ఆదివాసీలు ఈ అణిచి వేతలో సమిధలయ్యారు. విముక్తి కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అర్దం చేసుకోవడం లేదు.  ఆనాడు జంపన్న వాగు సమీపంలో  సమ్మక్క -సారక్క, జంపన్న, పగిడిద్దరాజు సహా ఆదివాసీ సమూహం  కాకతీయుల సైన్యాలను ఎదిరించి వీరోచిత పోరాటం చేసిన వారసత్వాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆదివాసీలు ఇంకా కొనసాగిస్తున్నారు.  ఆ నాటి జంపన్న వాగు రక్తపు టేరులై పారినట్లే ఈ నాడు ఆదివాసి ప్రాంతాల సెలయేర్లన్ని రక్తపు టేరులయ్యాయి. ఆదివాసీలను పూర్తిగా మట్టుబెట్ట అయినా వనరుల దోపిడీ సాగించేందుకు పాలకులు ఏ మాత్రం వెనుకాడడం లేదు. వ్యవస్థలు మారినా ప్రజల అవస్థలు మారలేదు. పాలకులు మారినా పీడితుల భాదలు తీర లేదు. ఇప్పటికైనా మేడారం చారిత్రక ఆదివాసి పోరాటంపై చరిత్ర పరిశోదనలు సాగాలి. సమ్మక్క -సారక్క, జంపన్న, పగిడిద్ద రాజు, మేడ రాజు. గోవింద రాజుల జీవిత గాధలకు చరిత్ర పుటల్లో చోటుదక్కాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాల క్రితం ఏర్పాటు అయినా ఈ ప్రాంతంలో ఆ దిశగా పరిశోధనలు జరగ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం  ములుగు జిల్లాలో ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసారు. పది సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయం ఇఁకా ఆరంభ దశలోనే ఉంది. ఈ విశ్వవిద్యాయం నుండి అయినా చరిత్ర పరిశోధకులను ప్రోత్సహించి  మేడారం ఆదివాసి చారిత్రక పోరాటానికి అక్షర రూపం  కల్పించాల్సింది.

సంకల్పానికి ప్రతీక..మేడారం
మేడారం జాతర అంటే రాజరిక వ్యవస్థపై విముక్తి కోసం సాగిన  వీరోచిత తిరుగుబాటుకే కాదు…  గొప్ప సంకల్ప బలానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రెండేళ్ల కోమారు జరిగే  ఈ జాతరలో  సమ్మక్క-సారక్కలను స్మరించి సంక ల్పం పూనుతుంటారు. ప్రకృతి ఆరాధన కనిపించే ఈ జాతరలో ఎక్కడా విగ్రహారాధాన కన్పించక పోవడం ఈ జాతర ప్రత్యేకత. వైదిక సంస్కృతికి భిన్నంగా అరణ్య గర్భంలో జనంతో సాగే జన జాతర.  ఓ నమ్మకం, ఓ విశ్వాసం, ఓ సంకల్పం మనిషిని ముందస్తు  ఆచరణ వైపు నడిచేలా చేస్తాయి. ఏ పనికైనా సంకల్పం బలంగా ఉండాలంటారు. మేడారం సమ్మక్క-  సారక్క చెంత లక్షలాది మంది అందుకే సంకల్పానికి పూనుకుంటారు. తమ పిల్లల భవిష్యత్‌ కోసం, మంచి చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, సంతానం కోసం ఉపాధి కోసం, ఆరోగ్యం కోసం ఒకటేమిటి తమ కష్టాలన్నింటిని చెప్పుకుని పరిష్కారాలు వెదుక్కునే  వేదిక మేడారం.

సంస్కృతిని చట్టబద్దం చేయాలి
వైదిక అచారాల ప్రమేయం లేకుండా జరిగే ఆదివాసి మేడారం జాతరను దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది. విగ్రహారాధనకు తావులేకుండా జరిగే జాతరకు ఆదివాసీల ఆజమాయిషీలో పూర్తిగా స్వయం ప్రతి పత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలి. గతంలో ఈ జాతరపై గిరిజనేతరుల ఆదిపత్యం ఉండేది. గిరిజనుల అభ్యంతరం మేరకు చాలా వరకు తగ్గింది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం  కోట్లాది రూపాయలు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్నా సరిపోవడం లేదు. జాతర సమయంలో తప్ప పట్టించు కోరన్న విమర్శలు ఉన్నాయి. స్వయం ప్రతి పత్తి గల సంస్థను ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని ఆదివాసి సంఘాలు కోరుతున్నాయి. సీతక్క ధనసరి అనసూర్య ఈ ప్రాంతం నుండి ఆదివాసి మహిళగా  మొదటి సారిగా మంత్రి అయ్యారు. గతంలో ఆదివాసీల నుండి పొదెం వీరయ్య, చర్ప భోజారావు ఎమ్మెల్యేలుగా  గెలిచినా  మంత్రులుగా అవకాశాలు దక్కలేదు. సీతక్కకు ఆ అవకాశం దక్కింది.  మేడారం ప్రాంతానికి అవసరమైన అన్ని సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలి.

-కూన మహేందర్‌, జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page