అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు
సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం
అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక కొలిక్కి రాకపోగా, ఇప్పుడు రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడానికి కారణంగా మారింది. కృష్ణా జలాల్లో మా వాటా ఎంత అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో ఈ జలాలను వినియోగించుకునే విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉద్యమకారులు ఆనాడు లెక్కలతో సహా వివరించారు. నిధులు, నియామకాలతో పాటు నీళ్ళ విషయంలో ఆనాడు ఉద్యమించినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళకాలంలో కూడా వీటిని తెలంగాణ ప్రభుత్వం అధిగమించలేకపోయింది. ఈ విషయంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు గత ప్రభుత్వంపైన వేలెత్తి చూపుతున్నది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
త్వరలో లోకసభ ఎన్నికలు రానుండగా ఈ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు వేలెత్తి చూపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కృష్ణా జలాల్లో సమాన వాటాను గత బిఆర్ఎస్ ప్రభుత్వ సాధించలేకపోయిందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే పాలన చేతగాకనే ప్రభుత్వం తమపైన ఆరోపణలు చేస్తున్నదంటుంది ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్. ఇందులో ఎవరి వాదనలో ఎంత బలమున్నదన్నది త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లోనే తేల్చుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బిఆర్ఎస్ నాయకత్వం ప్రకటించడంతో త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ఈసారి వేడివేడిగా చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ సమావేశాల్లో మాజీ సిఎం, గజ్వేల్ శాసనసభ్యుడు కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు తప్పక హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అప్పుడే వాస్తవాలేమిటో బయటికి వొస్తాయంటున్నారాయన. వాస్తవంగా 2004 నుంచి 2023 వరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని, అందుకు నాటి ముఖ్యమంత్రి కెసిఆరే కారణమని ఒక పక్క సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తుంటే కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(ఎఆర్ఎంబి)కు అప్పగించడంపైన కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. దీనిపై ఇరు పార్టీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా రివర్ బోర్టుకు ప్రాజెక్టులను ఎవరు అప్పగించారన్నదానిపైన చర్చకు సిద్ధం కావాలన్న సిఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది. ఈ విషయంలో ఇప్పటికే బిఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నది.
ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించిన పక్షంలో తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందంటుంది బిఆర్ఎస్. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణలోని రైతాంగమంతా సాగునీటి కష్టాలను ఎదుర్కునాల్సి వొస్తుందంటున్నారు. ఈ విషయమై గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లాలోని ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామ సమీపంలోని ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టుపై నిరసన ప్రదర్శన చేశారు. బోర్డుకు అప్పగిస్తే కర్నాటక, మహారాష్ట్రతోపాటు జోగులాంబ, గద్వాల, ప్రియదర్శిని, జూరాల, నెట్టంపాడు ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందంటూ ఆందోళన వెలిబుచ్చారు. కెఆర్‌ఎంబికి తాము అప్పగించలేదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తున్నదంటున్న ఆయన, పదిహేను ఔట్లెట్స్ నిర్వహణకు బోర్డు చైర్మన్ సిబ్బందిని ఎందుకు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టులను బోర్డుకు అపగించడం తెలంగాణ రైతాంగ వ్యతిరేక నిర్ణయమంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కృష్ణా జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఆయన తమ పార్టీ శ్రేణులకు గుర్తుచేశారు. జలాల హక్కులపైన గత పదేళ్ళుగా తమ ప్రభుత్వం చేసిన పోరాటాన్ని ఆయన వారికి వివరిస్తూ దీనిపైన పార్టీ శ్రేణులు స్పంచిందాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా కృష్ణానదిపైన ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను తమకు అప్పగించాలని కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం గతంలో తమపైన ఒత్తిడి తెచ్చినప్పటికీ అప్పగించేదిలేదని ఖచ్చితంగా చెప్పామని, కాని ఇప్పుడు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి ఒప్పందమేదో చేసుకుని సంతకాలు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మొత్తం మీద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో కృష్ణాపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించేందుకు అంగీకరించింది మీరంటే మీరని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధానాంశంగా బిఆరఎస్ ప్రచారం చేపట్టనుంది. అందులో భాగంగానే త్వరలో ఛలో నల్లగొండ పేరున నల్లగొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఆందోళన లోకసభ ఎన్నికల్లో బిఆర్ఎస్కు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.





