మీరంతా నా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు …

  • సొంత డబ్బులు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తున్నా
  • ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణకు సార్ధకత, మాకు ఆనందం
  • మీ కోసం ప్రతిపక్ష పార్టీల నేతలతో తిట్లు తిన్నాం
  • 317జీఓ పై బిజెపిది అనవసర రాద్ధాంతం
  • తలదించుకునే చదివితే…జీవితాంతం తలెత్తుకుని బతుకొచ్చు
  • కొద్ది రోజులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి
  • టెట్‌ ‌కేసీఆర్‌ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ఏప్రిల్‌ 9(‌ప్రజాతంత్ర బ్యూరో) :  మీరంతా నా కుటుంబ సభ్యులు…తోబుట్టువులా భావించి నా సొంత డబ్బులు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తున్నాను… నా తపన సిద్ధిపేట ప్రాంత వాసులకు ఇబ్బందులు కలగకూడదని శిక్షణ ఇప్పిస్తున్నా. మీరు ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణ శిబిరానికి సార్ధకత, మాకు ఆనందంగా ఉంటుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలోని పొన్నాల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జిల్లా కార్యాలయంలో యువతీ, యువకులకు కేసీఆర్‌ ఉచిత శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి టెట్‌ ‌శిక్షణ తరగతులను మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులందరికీ అవకాశాలు రావడం కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తెస్తే ప్రతిపక్ష పార్టీల నేతలతో తాము(టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సర్కార్‌) ‌తిట్లు తినాల్సి వొచ్చిందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ తన్నీరు హరీష్‌రావు అన్నారు.

జోనల్‌ ‌వ్యవస్థ తెచ్చి, కొత్త జిల్లా మధ్య విభజన సందర్భంగా లాక్‌ ‌పెట్టామని, అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు పెట్టామని, సీనియర్‌ ‌వాళ్లకు స్థానికంగా అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. దీని కోసం 317జివో పెట్టామని, దాన్ని బిజెపి పార్టీ నేతలు అనవసరంగా  రాద్ధాంతం చేశారన్నారు. అందరికీ అవకాశం కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని, మీ కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులతో చాలా తిట్లు తిన్నామని వివరించారు. ఉచిత శిక్షణ శిబిరం 2015లోనే సిద్దిపేటలో మొదలు పెట్టామని, టెట్‌లో వెయ్యి మందికి శిక్షణిస్తే 800 మంది అర్హత, పోలీసు ఉద్యోగాలలో 608 మంది శిక్షణలో 224 మంది కానిస్టేబుళ్లు, 8 మంది సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, గ్రూప్స్ ‌పరీక్షకు హాజరైన 350 మందికి శిక్షణలో వివిధ శాఖలలో 22 మంది ఉద్యోగాలు, డిఎస్సి శిక్షణలో 300 మందిలో 66 మంది అర్హత పొందారని..వారంతా సుదూర ప్రాంతం వెళ్లలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాదు అవని గడ్డ కంటే అద్భుతంగా ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేశామని, ఇప్పుడు 600 మందికి టెట్‌ ‌శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు.. మీ కుటుంబ పరిస్థితులు, నేపథ్యం బాగా లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కున్న పరిస్థితులు గమనించి, మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సోషల్‌ ‌మీడియాలలో వాట్సాప్‌, ‌ట్విట్టర్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ఇం‌స్టాగ్రామ్‌ ‌బంద్‌ ‌చేయాలని, ఇంట్లో టివి సీరియల్స్ ‌చూడటం బంద్‌ ‌చేయాలని ఉద్యోగార్థులకు సూచించారు. ఆర్థిక మంత్రిగా స్వయంగా నేనే సోషల్‌ ‌మీడియాలో వొచ్చిన వార్తలపై అవాక్కయ్యాను. అందుకే అబద్ధపు సోషల్‌ ‌మీడియాను నమ్మొద్దు. సోషల్‌ ‌మీడియా యూనివర్సిటీ నుంచి బయటకు రావాలని..సోషల్‌ ‌మీడియాపై ఉదాహరణకు సిలిండర్‌ ‌ధర పెరిగిందని, బిజెపి ఫేక్‌ ‌కామెంట్‌ ‌పెట్టిందని, అసలు ధర 500 మిగతా రాష్ట్ర పన్ను ఉన్నదని ఫేక్‌ ‌ప్రచారం చేశారని, సిలిండర్‌ ‌ధరలో ఒక్క పైసా కూడా రాష్ట్ర పన్ను లేదని, ఇది నిజం అని..ఇలా ఫేక్‌ ‌ప్రచారం మన మనస్సు పాడుచేస్తాయని మార్గదర్శనం చేశారు.

అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు..పోటీ పరీక్షలకు హైదరాబాదులో శిక్షణ తీసుకోవాలంటే..100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితులలో ఉద్యోగార్థులకు వారథిగా నిలిచారు. పట్టు పడితే ఉద్యోగం వొచ్చి తీరుతుంది. ఉచితం అనే భావన వద్దు. మీలో సిన్సియారిటీ ఉండాలి. ఉద్యోగ సాధన ఇప్పుడు కష్టం కానీ జీవితమంతా సుఖమయం. మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు నిజమైన ప్రోత్సాహమని, అప్పుడే మరింత చేయాలనే ఉత్సాహం వస్తుందనీ ఉద్యోగార్థులకు మంత్రి హరీష్‌రావు  దిశానిర్దేశం చేశారు.
సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండండి..తలదించి చదవండి.. జీవితమంతా తలెత్తుకుని జీవించొచ్చు…

ఈ రెండు నెలలు సెల్‌ ‌ఫోన్లకు దూరంగా ఉండండి. దించిన తల ఎత్తకుండా చదవాలి. అప్పుడే మీ జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారని తెలిపారు. దించిన తల ఎత్తకుండా చదివితే..జీవితమంతా తలెత్తుకుని జీవించొచ్చని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని హితవు చెప్పారు. కేవలం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కాకుండా, ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఈ టెట్‌ ‌శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగాలలో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని, మెరిట్‌కే పట్టం కట్టాలని సీఎం ఆలోచన చేశారని, ఉద్యోగ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూ ఎత్తివేసి మెరిట్‌  ఆధారంగా ఉద్యోగాలు ఇద్దామని సిఎం కేసీఆర్‌ ‌సూచన చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 1 లక్షా 33 వేల ఉద్యోగాలకు నియామక పక్రియ జరిగిందని, ఇప్పుడు 91 వేల ఉద్యోగాల దిశగా చర్యలు ప్రారంభించినట్లు, 2023 నుంచి ఉద్యోగ క్యాలెండర్‌ ‌నిర్వహణ ఉంటుందని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా మెరిట్‌ ‌ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ..

కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క రైల్వే శాఖలో 7 ఏండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఇందుకోసం వారిపై ఒత్తిడి చేస్తూ కొట్లాడుతామన్నారు. మీరు ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిబిరానికి సార్ధకత ఉంటుందని, ఉచిత శిక్షణ శిబిరంలో ఏదీ ఉచితంగా రాలేదు కావున ఉద్యోగార్థులంతా కష్టపడి చదవాలని కోరారు. నిరాశ చెందకుండా అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, ప్రణాళికలు చేపట్టి ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివి ముందుకు సాగాలని సూచించారు. పలు ఉదాహరణలుగా చెబుతూ..సిఎం కేసీఆర్‌ 14 ఎం‌డ్లు కోట్లాడి రాదనుకున్న తెలంగాణ సాధించారు. రావనుకున్న కాళేశ్వరం నీళ్లను పట్టుబట్టి రాత్రి పగలు కష్ట పడి తీసుకొచ్చాం. సాధ్యం కాని గోదారి జలాలను సాధించుకున్నామని సామెత చరిత్రను తిరగ రాసినట్లు చెప్పారు.

అంతకు ముందు మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్‌  ‌పాల సాయిరాం మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియమాకాలు ట్యాగ్‌ ‌లైనుగా తెలంగాణ సాధించినట్లు, ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పేద నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు భోజనం వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జోనల్‌ ‌వ్యవస్థతో 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు అందేలా ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. అలాగే గతంలో సిఎం కేసీఆర్‌ ‌పేరిట నిర్వహించిన శిక్షణ తరగతులలో హాజరై ఉద్యోగాలు పొందిన ఉద్యోగి స్రవంతి మా జీవితంలో వెలుగు నింపిన మంత్రి హరీష్‌ ‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితి బాగా లేక దూరం వెళ్లలేదని, గర్భిణీగా శిక్షణ తీసుకుని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించినట్లు తెలిపింది.

గతంలో శిక్షణ పొందిన వారిలో వంశీకృష్ణ, రాములు, రాజాబాబు, గోవింద్‌ ‌శిక్షణ పొందడం కాదు..ఉద్యోగం సాధిస్తేనే నిజమైన సార్థకత ఉంటుందని, మంత్రి హరీష్‌రావుకు జాబ్‌ ‌సాధించి కృతజ్ఞతలు వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, సూడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌నేత బూసాని శ్రీనివాస్‌, ‌స్థానిక సర్పంచి శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page