- పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- పెట్రో, విద్యుత్ చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను అడుకున్న పోలీసులు
- రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
- బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్ సౌధ గేటు ముందు ధర్నా
- ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్ చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
- విద్యుత్ సౌధ ముట్టడిలో ఉద్రిక్తత…మహిళా కాంగ్రెస్ నేతకు గాయాలు
పెట్రో, విద్యుత్ చార్జీల పెంచుతూ పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ గురువారం సివిల్ సప్లై భవన్, విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేతలు బయటకు వొస్తే అరెస్టు చేయడానికి సిద్దం చేసుకున్నారు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి వైపు ఉన్న రోడ్ల వద్ద బారికెట్లు పెట్టి దిగ్బంధం చేసి ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇక కాంగ్రెస్ ధర్నాలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను గృహ నిర్బంధం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చమురు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడే ధర్నాలు చేయాలన్న పిలుపు మేరకు పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేతులు షబ్బీర్ అలీ, మల్లురవి, దాసోజు శ్రవణ్, హర్కర వేణుగోపాల్, జక్క జడ్సన్, తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.
ఇంధన ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం, యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేసే దాకా కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేయకుండా అడ్డుకోవడంపై రేవంత్ మండిపడ్డారు. టిఆర్‌ఎస్ రాస్తారె•కోలు చేస్తుంటే పోలీసులు రక్షణ కల్పించి తమకేమో అడ్డుంకులు సృష్టించడం దారుణమన్నారు. టిఆర్‌ఎస్ ద్వంద్వ విధానాలను ఆయన ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వొచ్చిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు విద్యుత్ సౌధ గేటు బయట నిరసన తెలిపారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేతల్ని మాత్రమే లోపలికి అనుమతించగా, కాంగ్రెస్ కార్యకర్తలు గేటు బయట ఆందోళనకు దిగారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసుల్ని అడ్డుకోవడమే ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తోపులాట జరగడంతో కాంగ్రెస్ నాయకురాలు విద్యా రెడ్డి కిందపడి పోయారు. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెను నిమ్స్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.