Take a fresh look at your lifestyle.

మా డిమాండ్లు నెరవేర్చక పోతే మరో ఉద్యమానికి సిద్ధం

  • కేంద్రానికి దిల్లీ ‘కిసాన్‌ ‌మహా పంచాయత్‌’ ‌సదస్సు హెచ్చరిక
  • వ్యవసాయ మంత్రి తోమర్‌ను కలిసిన 15 మంది సభ్యుల బృందం
న్యూ దిల్లీ, మార్చి 20 : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి), రుణమాఫీ, ఫింఛను చట్టం సహా తమ డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చకుంటే మరోమారు ఉద్యమం చేపడతామని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గతంలో రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదని, 15 మంది సభ్యులతో కూడిన ఎస్‌కెఎం ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌తో మధ్యాహ్నం కృషి భవన్‌లో సమావేశమై తమ డిమాండ్ల ప•త్రాన్ని సమర్పించినట్లు రైతు నాయకుడు దర్శన్‌ ‌పాల్‌ ‌తెలిపారు. తమకు పరిష్కారం కాని అనేక సమస్యలు ఉన్నాయని, దాంతో మరోసారి ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ 30‌న దిల్లీలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని, సమావేశానికి ముందు అన్ని రైతు సంఘాలు తమ తమ రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పంచాయతీలు నిర్వహించాలని ఆయన కోరారు.
సోమవారం ఇక్కడి రమీలా మైదాన్‌లో నిర్వహించిన ‘కిసాన్‌ ‌మహా పంచాయత్‌’‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…తాము ప్రతిరోజూ నిరసనలు చేయకూడదనుకుంటున్నామని, కానీ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే తాము మరొక ఆందోళనను ప్రారంభిస్తామని, అది వ్యవసాయ చట్టాలపై నిరసన కంటే పెద్దది కాగలదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంఎస్‌పి చట్టం, పూర్తి రుణమాఫీ, పింఛన్‌, ‌పంటల బీమా, రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, ఇప్పుడు రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం వంటి డిమాండ్‌లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పాల్‌ ‌తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌మిశ్రాను బర్తరఫ్‌ ‌చేసి జైలులో పెట్టాలని, వడగళ్ల తుఫాను, అకాల వర్షాల కారణంగా పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. రైతులకు విద్యుత్‌ ‌రాయితీలను విద్యుత్‌ ‌చట్టం నుంచి మినహాయించామని తోమర్‌ ‌తమ ప్రతినిధి బృందానికి తెలిపినట్లు పాల్‌ అన్నారు.
అయితే ఈ డిమాండ్‌ ఇప్పటికే నెరవేరిందని, అది రైతు సంఘాల పెద్ద విజయమని ఆయన అన్నారు. వడగళ్ల వాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని మంత్రి ప్రతినిధి బృందానికి తెలిపారు. ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ అంశాన్ని కూడా తాము మంత్రితో చర్చించామని, రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకునేలా, మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేలా తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటానని తోమర్‌ ‌హామీ ఇచ్చాడని రైతు సంఘం నాయకుడు పాల్‌ ‌చెప్పారు. ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఇవి మరొక ‘ఆందోళన’కు తమను ఉపక్రమిస్తున్నాయని అన్నారు. ఏప్రిల్‌ 30‌న దిల్లీలో మరో సమావేశానికి ముందు అన్ని రైతు సంఘాలు ర్యాలీలు, పంచాయతీలు నిర్వహించాలని కోరుతున్నానని పాల్‌ ‌తెలిపారు.

Leave a Reply