కొత్తగూడెం, ఏప్రిల్ 19(ప్రజాతంత్ర ప్రతినిధి) : బహిర్భూమికి వెళ్లిన అభాగ్యురాలిని మాటేసి కాటేసిన మరో మానవ మృగం ఉదంతం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం కప్పి పుచ్చేందుకు ఊరి పెద్దలు కట్టుబాటు పేరుతో బాధితులను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డపై కామక్రూరుడు దాడి చేశాడు. న్యాయం కోసం సహకరించాలని ఊరి పెద్దలను ఎంత అర్థించినా ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక దుఃఖాన్ని దిగమింగుకొని తామే వెళ్లి జరిగిన దారుణాన్ని లక్షిదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మానసిక దివ్యాంగురాలి కుటుంబ సభ్యులు. మమ్మల్ని కాదని స్టేషన్‌కు వెళ్తారా అంటూ..కుల బహిష్కరణ చేస్తామని ఊరి పెద్దలు బెదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక తెలిసిన వివరాల ప్రకారం లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలైన కె కృష్ణవేణి ఈ నెల14న రాత్రి వేళలో బహిర్భూమికి వెళ్లగా అదే వీధిలో ఉంటున్న బాలకృష్ణ అనే కామాంధుడు కామ వాంఛను తీర్చుకునేందుకు అన్నెం పుణ్యం ఎరుగని అమాయకురాలిపై పైశాచికత్వానికి ఓడిగట్టాడు. బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కామాంధునిపై కేసు నమోదు చేసి 16న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా నిందితుడు గతంలోనూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా కొందరి పెద్దల అండతో బాధితులను స్టేషన్ వరకు వెళ్లకుండా పరిష్కరించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద పడి తిరిగే ఇలాంటి కామాంధుడిని కఠినంగా శిక్షించాలని, అతనికి బాసటగా నిలుస్తున్న ఊరి పెద్దలపై సైతం కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.