Take a fresh look at your lifestyle.

మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం

మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : బతుకుదెరువు కోసం వ్యవసాయం చేస్తూ…మరోవైపు వంటలు చేసుకుంటూ జీవనం సాగించే బ్రతుకుల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా లోని మహేశ్వరం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని శ్రీశైలం, హైదారాబాద్‌ ‌జాతీయ రహదారిపై తుమ్మాలూరు గేట్‌ ‌సమీపంలో మ్యాక్‌ ‌ప్రాజెక్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…నాగర్కర్నూల్‌ ‌జిల్లా వెల్దండ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాసు రామస్వామి (36), ఇదే మండలంలోని పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య(35), ముంత శ్రీను (35), హన్మంతు కేశవులు (33) నలుగురు వ్యవసాయ దారులు. ఐతే వ్యవసాయ పనులు లేని సమయంలో శుభకార్యాలకు వంటలు చేసి అదనపు ఆదాయం సంపాదించుకోవడం చేస్తుంటారు.

ఇందులో భాగంగానే గురువారం రాత్రి హైదరాబాదులోని చంపాపేట ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ ‌హాలులో వివాహ కార్యానికి వంటలు చేసేందుకు వెళ్లారు. అక్కడ తమ పనులు పూర్తి చేసుకొని అర్ధరాత్రి పన్నెండున్నర ప్రాంతంలో కారులో తమ స్వస్థలానికి బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మ్యాక్‌ ‌విల్లా ప్రాజెక్టు సమీపానికి చేరుకోగానే ఎదురుగా వొస్తున్న డీసీఎం అతివేగంగా వొచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య, శ్రీను, రామస్వామి అక్కడిక్కడే మరణించగా హన్మంతు కేశవులు చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో వెలికి తీయడానికి రెండు గంటల సమయం పట్టింది.

వీరిలో ఒక్క కేశవులు మాత్రమే కొన ఊపిరితో ఉండటంతో బతికించేందుకు ప్రయత్నించారు. కానీ చికిత్స కూడా ప్రారంభం కాకుండానే అతను మృతిచెందడం విషాదం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఎం వ్యాన్‌ ‌డ్రైవర్‌ ‌షేక్‌ ‌జానిమియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మహేశ్వరం జోన్‌ ‌డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌, ‌మహేశ్వరం ఏసీపీ అంజయ్యలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వీరి వెంట మహేశ్వరం, కందుకూరు సీఐలు మధుసూదన్‌, ‌కృష్ణంరాజులు ఉన్నారు.

విషాదంలో రెండు గ్రామాలు..
బతుకుతెరువుకు వంట చేసే నిమ్మిత్తం వెళ్లి నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో బలైన సంఘటన రెండు గ్రామాలలో విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో రామస్వామి లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, ఇతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఇంటికి దిక్కైన యజమాని చనిపోవడంతో వీరి కుటుంబంలో విషాదం నిండింది. మరోవైపు యాదయ్య, కేశవులు, శ్రీను ముగ్గురు పోతేపల్లి గ్రామానికి చెందిన వారు వీరి మరణంతో గ్రామంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఈ ముగ్గురికి కూడా భార్య, ఇద్దరు పిల్లలు చొప్పున ఉండటం గమనార్హం. చనిపోయిన నలుగురు కూడా ఇంటి యజమానులే వీరిపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నలుగురికి కూడా పదేళ్లలోపు పిల్లలే ఉండటం గమనార్హం. ఇంటి యజమానులతో పాటే ఉపాధి కోల్పోయిన ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply