- మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కునాలి
- ప్రీతి ఆత్మహత్య దురదృష్టకరం
- రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్
- కెయు ఆడిటోరియంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు
కాళోజీ జంక్షన్/కెయు క్యాంపస్(హన్మకొండ), ప్రజాతంత్ర, మార్చి 8 : సమాజంలో అన్ని రంగాల్లో మహిళలను సమగ్రంగా స్వయం సాధికారత సాధించేలా కృషి చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశా•, గిరిజన శాఖ మంత్రి సత్యావతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతీ మహిళ సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో కన్నుల పండువగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ భారతీ హోలీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ బండ ప్రకాష్ హాజరయ్యారు.
వివిధ రంగాల్లో విశేషమైన ప్రతిభ కనపరిచిన 27 మంది మహిళామూర్తులను ఉత్సవాల్లో శాలువ, జ్ఞాపిక, లక్షరూపాయల చెక్కుతో ఘనంగా మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. తాను వచ్చిన గిరిజన తాండ జీవిత అనుభవాలను చెప్పి విశ్వవిద్యాలయంలో విద్యార్థునుల్లో ఆత్మవిశ్వాసం నింపారు.కష్టాలకు వెనకడుగు వేయవద్దని పిలుపునిచ్చారు. జీవితంలో సమస్యలను ఎదిరించి నిలబడితేనే విజయం సాధించగమని మహిళల్లో ధైర్యాన్ని నూరిపోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఎలాంటి సమస్యలనైనా సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో వారు చేస్తున్న నిరంతర కృషిని కేవలం ఒక్కరోజు స్మరించుకుంటేనే సరిపోదని చెప్పారు. మహిళల నిరంతర ఓర్పు, శ్రమను సమాజం మొత్తం నిత్యం స్మరించుకోవాలని కోరారు. తమ హక్కుల కోసం, శ్రమ ఫలితం కోసం పోరాడిన అంతర్జాతీయ మహిళ పోరాటాన్ని నేటి మహిళలు స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కొన్ని సంఘటనలు మహిళలను తీవ్రంగా ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తాయని చెప్పారు. నేటి మహిళలకు చదువే గొప్ప ఆయుధమని, అందరూ ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను లింగబేధాల పట్ల వివక్షను తొలగించుకోవాలని కోరారు. బయటకు మహిళ రెండు చేతులతో పనిచేస్తున్న సాధారణ వ్యక్తిగా కనిపిస్తుందని, ఎనిమిది చేతులు చేయాల్సిన పని మొత్తం నేటి ఆధునిక మహిళ సాహసంతో ఆదిపరాశక్తిగా ముందుకుసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల కృషిని గౌరవించుకోవడంలో భాగంగానే మార్చి 8 మహిళల పండువగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళ కూడా ప్రభుత్వం అందించే పురస్కారానికి అర్హురాలని పేర్కొన్నారు. కొన్ని నియమనిబంధనల వల్ల కేవలం 27 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. గ్రామస్థాయిలో ఆశ వర్కర్ నుంచి జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో విశేషమేన ప్రతిభా, సేవారంగాల్లో కృషి చేసినవారిని కమిటి ఎంపిక చేసిందని చెప్పారు.గతంలో పనిచేసిన అనేక ప్రభుత్వాల కంటే కేసీయార్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని మంత్రి చెప్పారు.
మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలనే సదాశయంతోనే సీఎం కేసీయార్ మహిళలకు విద్యా, ఆరోగ్యం, భద్రత, ఆర్థికసాధికారతకు పెద్దపీట వేశారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసిడిఎస్‌ల ద్వారా పదిహేడు లక్షల మంది బాలబాలికలకు, ఐదు లక్షల మంది గర్బిణీలకు కేసీయార్ న్యూట్రిషన్ ఫుడ్ అందుతోందన్నారు. ఆరోగ్యమహిళ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1200 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతిమంగళవారం మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్తర కార్యక్రమం రూపుదాల్చబోతోందని చెప్పారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు. పిల్లల ఎదుగుదల కోసం పోషకాలను అందించే బాలామృతం త్వరంలోనే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అందరికీ అందేలా కార్యచరణ రూపొందించామని చెప్పారు. గతంలో కంటే ప్రభుత్వ ఆస్పత్రులలో మహిళల ప్రసవాల సంఖ్య భారీగా పెరిగి, మరణాల సంఖ్య తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగానే శాస్త్రీయ దృక్పథంతో సీఎం కేసీయార్ కళ్యాణలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు.
ఈ పథకం ద్వారా 12వేల కోట్ల రూపాయలు నిరుపేద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బాలికల విద్యాభివృద్ధిలో భాగంగా నాలుగు లక్షల మంది బాలికలు చదువులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలను ఉద్యోగాలు సాధించుకునే వరకు తల్లిదండ్రులు చదివించాలని కోరారు. కొడుకులతో సమానంగా చూడటం తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వయం ఆర్థిక సాధికారత కోసం 33 శాతం విద్యా, ఉద్యోగ అవకాశాల కల్పనలో ముందుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మెడికో విద్యార్థిని ప్రతీ ఆత్మహత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. మహిళలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పారు. సమస్యలకు ఎదురీదడం ద్వారనే విజేతలుగా నిలబడుతామని చెప్పారు. ఆత్మహత్యలతో సాధించేది ఏమీ లేదన్నారు. సమస్యలకు భయపడి అందరూ ఆత్మహత్యలకు పాల్పడితే సమాజమే ఉండదన్నారు. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి మహిళా హాస్టళ్ల నిర్మాణం కోసం 20 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కెయు విసి ఆచార్య టి.రమేష్, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, మహబూబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ దీప్తి రెడ్డి వరంగల్ హనుమకొండ జిల్లాల డాక్టర్ గోపి, శిక్త పట్నాయక్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, తదితర అధికారులతో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. 2023 మహిళా దినోత్సవ కార్యక్రమంలో 27 మంది ప్రతిభ గల మహిళలను సత్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళల, కోసం వృద్ధుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రాష్ట్ర మహిళలందరికీ అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ వివరించారు.