2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )
మహారాష్ట్రలో విజయం సాధించడంతో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చూపు తెలంగాణపై పడింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వొస్తున్న బిజెపి.. రానున్న 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రణాళికలను రచిస్తోంది. వాస్తవంగా గత ఎన్నికల్లోనే తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేస్తామని బిజెపి ఘంటాపథంగా చెప్పింది. కానీ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైంది. గత పార్లమెంట్, శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆపార్టీ రెండంకెల విజయాన్ని సాధించలేకపోయింది. ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. ఇప్పుడు వొచ్చే ఎన్నికల్లో 88 స్థానాలను సాధించుకునే దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేయాలని యోచిస్తోంది. తాజాగా ఆ పార్టీ పార్లమెంట్, శాసనసభ్యులతో దిల్లీలో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ వారికి అదే విషయాన్ని ఉపదేశించినట్లు తెలుస్తున్నది.
గతంతో పోలిస్తే తెలంగాణలో బిజెపిపైన ఆదరణ పెరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోదీ వారికి సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతూ వొస్తున్నాయి. తెలంగాణను సాధించామని చెప్పుకున్న బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్‌ను చేజార్చుకుంది. అయితే అప్పటివరకు బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటుకున్న బిజెపి.. గత ఎన్నికల్లో మూడవ స్థానానికే పరిమితమైంది. బిజెపిని కాదని స్థానిక ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల ఆదరణను పొందిందనే చెప్పాలి.. ఆ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బిఆర్‌ఎస్‌ను కాదని, ఇప్పుడు కాంగ్రెస్‌కు తామే ప్రత్యమ్నాయ మంటోంది బిజెపి. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు అధ్వానంగా మారిందని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వం విరుచుకుపడుతోంది.
కాంగ్రెస్ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలకు బిజెపియే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ఎంపీ, ఎంఎల్‌ఏలకు వివరించారు. అందుకు అనుగుణంగా నాయకులు అడుగులు వేయాల్సిఉందని, ప్రధానంగా పార్టీలో అంతర్గత విభేదాలను విడనాడి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఏక్ హే తో సేఫ్ హై అనే విధంగా కలిసికట్టుగా, ప్రణాళికాబద్దంగా పనిచేస్తే అధికారంలోకి రావడం ఏమంత కష్టంకాదని వారికి హితబోధ చేశారు. ఈ విషయంలో ఆయన వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రతిఘటించి ప్రజల పక్షాన నిలవాలన్నారు. అందుకు నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండాల్సిఉంటుంది.
అలాగే కేంద్ర నుంచి వచ్చే నిధులు, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, అవి రాష్ట్రంలో సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఇదిలా ఉంటే త్వరలో రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ రాష్ట్ర శాఖ కూడా అప్రమత్తమవుతున్నది. అంతర్గత విభేదాలున్నా అందరినీ కలుపుకుపోయే విధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్‌గా మారిన రెసిడెన్షియల్ పాఠశాలపై ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. సుమారు నాలుగైదు నెలలుగా ఈ పాఠశాలల నిర్వహణ అధ్వానంగా మారి, పలువురు విద్యార్దుల మరణానికి దారితీసిన సంఘటనపై ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్దమైంది. అలాగే పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏల విషయంలో హైకోర్టు సూచనలు స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల విషయంపై ఆందోళనకు ఆ పార్టీ సిద్దమైంది. దీనికితోడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే ప్రక్రియను కూడా ఆ పార్టీ ప్రారంభించింది.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
నవంబర్ నెలాఖరు వరకు అన్ని గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. కాగా డిసెంబర్ మొదటి వారంలో మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసేదిశగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. అయితే చాలాకాలంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూ వొస్తున్నది. ఈ పదవికోసం పార్టీలోని పలువురు సీనియర్లు ఆశపెట్టుకున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, మధ్యలో పార్టీలో చేరినవారికి మధ్య పోటీ కొనసాగుతోంది.
డిసెంబర్ చివరినాటికి జాతీయ అధ్యక్షుడిని నియామకంతోపాటు, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా జరుగుతుందంటున్నారు. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్ కూడా తన కార్యక్రమాలను ఉధృ తం చేస్తోంది. లగిచర్ల, దిలాస్‌పూర్ సంఘటనల్లో ప్రజలపక్షాన నిలిచి పోరాటం చేయడంలో బిఆర్‌ఎస్ కన్నా బిజెపి వెనుకపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక ఇప్పటికే అనేక సభలు, సమావేశాల్లో తల్లిని చంపి పిల్లను బతికించారంటూ తెలంగాణ ఆవిర్భావంపై ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలను ఇక్కడి ప్రజలు మరిచిపోయి ఆ పార్టీకి పట్టం కడుతారా అన్న చర్చకూడా జరుగుగుతోంది.