మధ్య తరగతి కోసం హౌజింగ్‌ స్కీమ్‌

  • రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం
  • కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్‌ యోజన గ్రావిూణ్‌’ కొరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బ్జడెట్‌లో నూతన పథకాన్ని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *