- తప్పనిసరైతే రక్షణ చర్యలు తీసుకోవాలి
- పెరుగుతున్న ఎండలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచన
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రజలకు సూచించారు. ఈ మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వొస్తే రక్షణ చర్యలు తీసుకోవాలని, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని డాక్టర్ శ్రీనివాస్ రావు విడియాకు వెల్లడించారు. ఈ ఆరు జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు.
2015లో వడదెబ్బ, సన్ స్ట్రో డెత్స్ ఎక్కువగా సంభవించాయని, ప్రజలను ఎండలను దృష్టిలో ఉంచుకొని తమ టైమ్ టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. చెమట రాకపోవడం, నాలుక ఎండిపోవడం, పెదాలు పగిలిపోవడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, గుండెదడ, మూత్రం రాకపోవడం లాంటి లక్షణాలు వడదెబ్బ లక్షణాలని శ్రీనివాస్ రావు తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే దగ్గర్లోని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లాలని, పానీయాలు అందించాలని, గాలి బాగా తగిలేటట్లు చూడాలని, కుదుట పడకపోతే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించాలని, అప్పుడే వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులు, వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలుషితం లేని నీటిని మాత్రమే తీసుకోవాలని ఆయన చెప్పారు.
కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మసాలాలు తీసుకోవద్దన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు గర్భిణి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణి స్త్రీలు ఆస్పత్రులకు వెళ్లాలనుకుంటే మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్‌లోనే వెళ్లాలని శ్రీనివాస్ రావు సూచించారు.